YCP MLA Virupakshi : వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్‌

YCP MLA Virupakshi : వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి ఆలూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు 14రోజులు రిమాండ్‌ విధించింది.

YCP MLA Virupakshi : కర్నూల్ జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని చిప్పగిరి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట విరూపాక్షిని హాజరుపర్చారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఆయనకు 14రోజులు రిమాండ్ విధించింది. ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు.

Also Read : YS Jagan : వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.. చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్.. అధికారం శాశ్వతం కాదంటూ హెచ్చరిక

శనివారం రాత్రి సంగాల, నెమకల్లులో టీడీపీ కార్యకర్తలపై దాడులు, ధౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్, సంగాలకు చెందిన వైసీపీ కార్యకర్త గిరి ఫోన్‌లో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఈ వివాదం వారి మధ్య వివాదంకు దారితీసింది. ఈ ఘటనను వైసీపీ కార్యకర్త సంగాల గిరి ఎమ్మెల్యే విరూపాక్షికి తెలియజేశాడు. దీంతో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి నేమకల్లు గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో టీడీపి కార్యకర్త శేఖర్‌ తలకు తీవ్ర గాయమైంది. నాగరాజు స్వల్పంగా గాయపడ్డాడు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు ఎడమచేతికి గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని ఘర్షణ ఉధృతం కాకుండా చర్యలు చేపట్టారు.

టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితోపాటు పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 2.45 గంటల సమయంలో భారీ పోలీసు బలగాలను మోహరించి, ఎమ్మెల్యే విరూపాక్షితోపాటు మరికొంత మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.