YS Jagan on Amaravati : ‘అమరావతికి అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు YCP వ్యతిరేకం కాదు.. మండలికి పిలవాలి కదా’ : YS జగన్

YS Jagan on Amaravati : అమరావతి చట్టబద్ధతపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అమరాతికి వ్యతిరేకం కాదన్నారు.

ys jagan key comments on amaravati as andhra pradesh capital

YS Jagan on Amaravati :

అమరావతి పేరుతో చంద్రబాబు డ్రామా చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. రాజధానిని మళ్లీ మార్చకుండా చట్టసవరణ అని డ్రామా చేస్తున్నారు. మళ్లీ అదే చట్టాన్ని మార్చలేరా? ఏ అసెంబ్లీ అయినా చట్టాలను చేయవచ్చు.. మళ్లీ ఆ చట్టాన్ని మార్చవచ్చు. ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు చేస్తున్నారు?” అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమన్నారు. రాష్ట్రంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయతీ లేవని మండిపడ్డారు. పరిపాలన అంటే చంద్రబాబు దృష్టిలో దోపిడీ చేయడమేనని.. దానికి కొత్త కొత్త పేర్లు పెట్టి స్కాములు చేస్తూ రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని జగన్ ఆరోపించారు.

‘రాజధానిపై అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదని మంత్రి పార్థసారథి స్టేట్‌మెంట్ ఇచ్చారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రానికి రాజధాని అనే పదమే లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించదు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రాజధానులను కేంద్రం డిసైడ్ చేయలేదు. రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది’ అని జగన్ స్పష్టం చేశారు.

‘మొదటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతికి లక్ష కోట్లు అవుతుందని డీపీఆర్ ఇచ్చారు. మొదటి 50 వేల ఎకరాల అభివృద్ధికి దిక్కు లేదు.. మళ్లీ ఇంకో 50 వేల ఎకరాలు ఎందుకు? లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాలకు రెండు లక్షల కోట్లు కావాలి.. ఎక్కడి నుండి తెస్తారు? అవన్నీ జరగడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇంకెంత ఖర్చు పెరుగుతుంది? 2019లో చేసిన మాస్టర్ ప్లాన్‌ను మళ్లీ ఎందుకు మార్చారు? అప్పట్లో 50 వేల ఎకరాలతో ప్రపంచ రాజధాని అన్నారు.. ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నారు. అడుగు నిర్మాణానికి 11 నుండి 14 వేల ఖర్చు ఎందుకు అవుతుంది?’ అని జగన్ ప్రశ్నించారు.

‘5.30 గంటల అసెంబ్లీ సమావేశంలో నన్ను తిట్టడమే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పరా? పట్టపగలే ప్రజలని మోసం చేయడానికి అసెంబ్లీ డ్రామా ఆడారు. అసెంబ్లీని పిలిచినప్పుడు మండలిని కూడా పిలవాలి కదా.. కానీ పిలవలేదు. ఎందుకంటే మండలిలో మాకు బలం ఉంది.. అవినీతి బండారం కడిగేస్తారని పిలవలేదు. రాజధాని మళ్లీ మార్చకుండా చట్టసవరణ అని డ్రామా ఆడుతున్నారు.. మళ్లీ అదే చట్టాన్ని మార్చలేరా? ఏ అసెంబ్లీ అయినా చట్టాలను చేయవచ్చు.. మళ్లీ చట్టాన్ని మార్చవచ్చు. ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు చేస్తున్నారు?’

‘12 ఏళ్లుగా చంద్రబాబు అమరావతిలో కాపురం ఉన్నారా? ఇప్పటికీ హైదరాబాద్‌లోనే మీకు శాశ్వత నివాసాలు ఉన్నాయి. 2014-19 వరకు హైదరాబాద్ నుండి షటిల్ సర్వీస్.. 2019-24 వరకు పూర్తిగా హైదరాబాద్‌లోనే కాపురం.. మళ్లీ రెండేళ్లుగా వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు ప్రత్యేక విమానాలు ఎందుకు? అమరావతి ప్రాంతానికి అప్పుడు.. ఇప్పుడు మేము వ్యతిరేకం కాదు. కానీ అమరావతి కోసం నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో బహిరంగంగా చర్చించాలి’ అని జగన్ డిమాండ్ చేశారు.