Ys Jagan: ఇవి ఎన్నికలా.. సెలక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. జగన్ ఫైర్!
Ys Jagan: తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అక్రమాలు జరిగాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
- Sreehari A
- Updated on- November 5, 2026 / 04:48 PM IST
Ys Jagan Allegations
- పారదర్శిక ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం
- ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదు
- మా నేతల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు
- ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు శకుని పాత్ర
Ys Jagan Allegations : ఇవి ఎన్నికలా.. సెలక్షన్లా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాల్సిన చోట అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పారదర్శిక ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అలాంటి చోట ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని అన్నారు.
ఇప్పుడు జరిగే వాటిని ఎన్నికలని అంటామా? దేశ చరిత్రలో ఇలాంటి ఘోరమైన ఎన్నికలు ఎక్కడ జరిగి ఉండవన్నారు. ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసి ఎన్నికలు జరిపారని, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా హైజాక్ చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రక్రియ మొత్తం ఒక పద్ధతి ప్రకారం సాగలేదని, అన్ని దశల్లోనూ తమ పార్టీకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా జగన్ ఏమన్నారంటే? :
దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. బైండోవర్ కేసుల పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేశారని, పలుచోట్ల తమ పార్టీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
Read Also : AP MPTC-ZPTC Elections : ఏపీలో ప్రశాంతంగా పోలింగ్.. ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే?
ఎన్నికలంటే ఎలా ఉండాలి?
ఎన్నికలు అంటే ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం ఉండాలని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదని జగన్ అన్నారు. నామినేషన్ల నుంచి స్క్రూటినీ, విత్‌డ్రా, పోలింగ్ వరకు ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. చివరికి పోలింగ్ బూత్‌లలో కూడా తమ పార్టీ ఏజెంట్లను కూర్చోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై జగన్ ధ్వజం :
అధికార బలం, పోలీసుల సహకారం, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు శకుని పాత్ర పోషించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు.
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు. ప్రజాస్వామ్యానికి పారదర్శక ఎన్నికలే అసలైన పునాది అని పేర్కొన్నారు. మొత్తానికి ఎన్నికల నిర్వహణపై జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి చర్చకు దారితీశాయి..
