YS Sharmila : యలహంక ప్యాలెస్ వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్..

YS Sharmila : బెంగళూరు యలహంక ప్యాలెస్ కు సంబంధించి ఆస్తి వివాదంపై, తన కుమార్తె అంజలి వివాహం జరిపించే వేదికపై వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు.

YS Sharmila

YS Sharmila : బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు సంబంధించిన ఆస్తి విషయంలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మధ్య కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహం నిశ్చయమైంది. ఆమె వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో జరిపేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లుసైతం చేస్తున్నారు.  అయితే, యలహంక ప్యాలెస్ తనదని.. భద్రత, వ్యక్తిగత గోప్యత కారణాల దృష్ట్యా అందులో వివాహం  జరిపేందుకు వైఎస్ జగన్ నిరాకరించారు. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ను వేదికగా వాడుకోవాలని సూచించారు. ఈ విషయంపై కొద్దిరోజులుగా వివాదం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా.. వైఎస్ షర్మిల ‘ఎక్స్’ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

Also Read : AP Local Body Elections : ముగిసిన ఎన్నికల ప్రచారం.. నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం!

షర్మిల ట్వీట్ ప్రకారం..
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం. నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న వైఎస్ఆర్ తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.

వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. అంటూ షర్మిల్ ట్వీట్ లో పేర్కొన్నారు.