ysr congress joining nda: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో చేరేందుకు వైసీపీ సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో వైసీపీ చేరడం వల్ల రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు కలిగే లాభనష్టాలపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఎన్డీయేలో వైసీపీ చేరితే.. ఆ పార్టీకి ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు కొంత వరకూ దూరమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పూర్తిగా కాకపోతే దీని ప్రభావం కొంతమేరకు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎస్సీలు, ముస్లిం వర్గాలు వైసీపీకి అండగా నిలబడ్డాయి.
హోదా కుదరదని చెబుతున్న బీజేపీతో కలిస్తే, ప్రజలకు జగన్ ఏమని సమాధానం చెబుతారు?
ఇక, అంతకంటే ముఖ్యంగా ఎన్నికలకు ముందు నుంచి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. 25 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ చెబుతూ వచ్చింది. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. హోదా కుదరని పని అనే చెబుతోంది. మరి అలాంటి పార్టీతో కలిస్తే రాష్ట్ర ప్రజలకు వైసీపీ నేతలు ఏమని సమాధానం చెబుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవసరం కోసమే జట్టు కట్టారనే విమర్శలకు సమాధానం చెప్పగలుగుతుందా?
జగన్ ఎన్డీయేలో కలిస్తే, మళ్లీ టీడీపీ బలపడేందుకు అవకాశం:
ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే ఏపీ బీజేపీ కూడా అధికార పక్షం వైపే నిలబడుతుంది. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ ఒక్కటే అసలైన ప్రతిపక్షంగా నిలుస్తుందని అంటున్నారు. దీని వల్ల మళ్లీ టీడీపీ బలపడేందుకు వీలు దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పక్కకు జరిగినట్టయితే ప్రభుత్వాన్ని నిలదీయడంలో టీడీపీ ముందు వరుసలో ఉంటుంది. తద్వారా ఆ పార్టీకి హెల్ప్ అవుతుందని అంటున్నారు. మరి టీడీపీ బలపడేందుకు వీలుగా ఎన్డీఏలో వైసీపీ చేరేందుకు సిద్ధపడుతుందా అనే చర్చ జరుగుతోంది.
మరోపక్క, బీజేపీతో పాటు నరేంద్ర మోదీకి దూరం కావడం వల్ల జరిగిన నష్టాన్ని గత ఎన్నికల్లో చంద్రబాబు ఇప్పటికే అనుభవపూర్వకంగా చూశారు. అధికారానికి టీడీపీ దూరమైంది. మరి ఎన్డీఏలో వైసీపీ చేరితే కేంద్రంలో, రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీ, వైసీపీలను ఢీకొట్టడం చంద్రబాబుకు వీలవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ, మోదీ పట్ల సానుకూల వైఖరి చూపిస్తున్న చంద్రబాబు… ఇప్పడు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారిందంటున్నారు.
చంద్రబాబుకి దారులు మూసుకుపోతాయి:
బీజేపీతో మళ్లీ కలవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీలో ఒక వర్గం అంటోంది. ఒకవేళ అదే నిజమైతే ఆ దారులు మూసుకుపోతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ గెలిచింది లేదు. అలా అని కాంగ్రెస్‌లో కలిసే చాన్స్ కూడా లేదు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారన్నదే ప్రశ్న.
వైసీపీని చేర్చుకుంటే మళ్లీ బీజేపీకే మైనస్:
ఇక, బీజేపీ గతంలో రెండుసార్లు టీడీపీతో కలసి పని చేసింది. ఈ కారణంగా సొంతంగా రాష్ట్రంలో పార్టీ ఎదగలేకపోయిందనే అభిప్రాయం ఆ పార్టీలోని కొందరి నేతల్లో ఉంది. ఇప్పుడు వైసీపీని చేర్చుకోవడం వల్ల కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో టీడీపీ కాస్త బలహీన పడడంతో సొంతంగా ఎదిగేందుకు బీజేపీకి అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాంటి మంచి చాన్స్‌ను మరోసారి మిస్ చేసుకోవడం ఎందుకనే వాదన వినిపిస్తోంది.
కొత్త మిత్రులను చేర్చుకోవాలని అనుకోవడం వెనుక బీజేపీ వ్యూహం:
కేంద్రంలో ఇప్పటికే ఇద్దరు మిత్రులను బీజేపీ దూరం చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన శివసేన, పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. ఈ తరుణంలో కొత్త మిత్రులను చేర్చుకోవడం ద్వారా తమతో జత కలిసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలు ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ వైసీపీ కేంద్ర సర్కారులో చేరితే మాత్రం రాజకీయాల్లో అనూహ్య మార్పులు తప్పవని అంచనా వేస్తున్నారు.