గుంటూరు సంగం డెయిరీపై వైసీపీ కన్ను

  • Publish Date - March 7, 2020 / 12:45 PM IST

భారతదేశంలో పాల డెయిరీ వ్యవస్థలో ఏపీకి చెందిన సంగం డెయిరీ అగ్రస్ధానంలో ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు దీని ద్వారా  ఉపాధి లభిస్తోంది. 2వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ చైర్మన్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ డెయిరీకి ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దీనిపై పట్టు సాధించేందుకు గతంలోనే కాంగ్రెస్ సర్కారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుంది. వైఎస్‌ హయాంలో ఆర్డినెన్స్‌ ద్వారా డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలిచ్చారు. వీటిపై అప్పటి చైర్మన్‌ కిలారి రాజన్‌బాబు కోర్టులో స్టే తీసుకురావటంతో వైఎస్ ఆలోచనకు గండిపడింది. 

టీడీపీ నేతల పెత్తనంపై అసహనం :
ఐదేళ్ల క్రితం ధూళిపాళ్ల నరేంద్ర.. క్షేత్రస్థాయిలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల మహాజనసభ తీర్మానంతో దీనిని సహకార పరిధి నుంచి కంపెనీ చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో చంద్రబాబు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా, నరేంద్ర మాత్రం అనుకున్నది సాధించారు. ఈ కారణంగానే నరేంద్రకు మంత్రి పదవిచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారని అంటారు. ప్రస్తుత వైసీపీ సర్కారు సంగం డెయిరీపై టీడీపీ నేతల పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతోందట. ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా డెయిరీ చైర్మన్‌గా కొనసాగుతూ గుంటూరు జిల్లాలో నరేంద్ర చక్రం తిప్పుతున్నారు. దీనిని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆయన అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యలకు అసలు మింగుడుపడటం లేదంటున్నారు. 

సంస్థను హస్తగతం చేసుకోవాలనే :
ఎలాగైనా సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో జిల్లా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు వరుస భేటీలతో సంగం డెయిరీ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలన్న దానిపై విస్తృత స్థాయిలో మంతనాలు సాగిస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఎన్నికలు జరపాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిని అడ్డం పెట్టుకుని పాల ఉత్పత్తిదారుల సేకరణ కేంద్రాలకు ఎన్నికల పేరుతో సహకార శాఖ జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులతో వైసీపీ నేతలు చర్చిస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. ప్రస్తుత పాలకవర్గాన్ని ఏదో ఒక వంకతో తప్పించి ఆర్డినెన్స్‌ ద్వారా ఆ సంస్థను హస్తగతం చేసుకోవాలనే ఆలోచనతో వైసీపీ వర్గాలున్నాయని అంటున్నారు. 

ప్రభుత్వ ఆలోచనలను తిప్పి కొట్టేందుకు నరేంద్రతోపాటు టీడీపీ నేతలు ఇప్పటికే ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం కుట్రపూరిత ఆలోచన చేస్తే ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారట. ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేసినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ధూళిపాళ్ల సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఒకసారి కంపెనీ చట్ట పరిధిలోకి వెళ్లిన డెయిరీని తిరిగి సహకార చట్టం పరిధిలోకి తీసుకురావటం సాధ్యపడదన్న వాదన వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి.