కారణం ఏంటి : ఆపరేషన్‌ ఆకర్ష్‌కు వైసీపీ విరామం

ఇంటర్వెల్‌ అంటే ఓ ఐదు నిమిషాలో.. పది నిమిషాలో ఉంటుంది. కానీ, అదేం చిత్రమో గానీ.. ఇంటర్వెల్‌ తర్వాత సెకెండ్‌ హాఫ్‌ ఇంతవరకూ స్టార్ట్‌ కాలేదు. అసలిది ఇంటర్వెల్‌ గ్యాపా..

  • Publish Date - February 4, 2020 / 05:10 AM IST

ఇంటర్వెల్‌ అంటే ఓ ఐదు నిమిషాలో.. పది నిమిషాలో ఉంటుంది. కానీ, అదేం చిత్రమో గానీ.. ఇంటర్వెల్‌ తర్వాత సెకెండ్‌ హాఫ్‌ ఇంతవరకూ స్టార్ట్‌ కాలేదు. అసలిది ఇంటర్వెల్‌ గ్యాపా..

ఇంటర్వెల్‌ అంటే ఓ ఐదు నిమిషాలో.. పది నిమిషాలో ఉంటుంది. కానీ, అదేం చిత్రమో గానీ.. ఇంటర్వెల్‌ తర్వాత సెకెండ్‌ హాఫ్‌ ఇంతవరకూ స్టార్ట్‌ కాలేదు. అసలిది ఇంటర్వెల్‌ గ్యాపా.. లేక సెకెండ్‌ హాఫ్‌ ప్రింటే లేదా? ఇదంతా ఎందుకంటే.. ఏపీలో జనం చూస్తున్న పొలిటికల్‌ సినిమా ఇలానే ఉంది. వైసీపీ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ సినిమాకు లాంగ్‌ ఇంటర్వెల్‌ పడింది. దీనికి కారణం.. బాక్సులు లేకపోవడమేనా? అదేనండీ.. దూకేవారు సిద్ధంగా లేకపోవడమేనా?

టీడీపీకి కలిసొచ్చిన 3 రాజధానుల వ్యవహారం:
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులు ప్రస్తావన చేసినప్పటి నుంచి రాజకీయాలు వేగంగా మారాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ ఒక సంవత్సరం పాటు కోలుకోలేదేమో అని ఆ పార్టీ భావించింది. అన్న క్యాంటీన్ల ఎత్తివేత, ఇసుక కొరత, చలో ఆత్మకూరు అంటూ కొన్ని కార్యక్రమాలు చేసినా, అవి  ఉనికి కోసమే అన్నట్టు సాగాయి. ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలు.. వారిలో వల్లభనేని వంశీ, మద్దాల గిరి అధికార పక్షానికి దగ్గరయ్యారు. ఇంకా పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు జారిపోతారనే ప్రచారం జరుగుతున్న సందర్భంలో మూడు రాజధానుల వ్యవహారం టీడీపీకి కలిసి వచ్చిందని అంటున్నారు.

అసెంబ్లీ, మండలి సమావేశాలతో టీడీపీ సభ్యుల్లో నమ్మకం:
అమరావతి ప్రాంత రైతులు ఉద్యమాల పేరుతో రోడ్డెక్కటంతో పక్క చూపులు చూస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. మూడు రాజధానుల ఇష్యూలో అధికార పార్టీకి ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ప్రస్తుతానికి గంటా శ్రీనివాసరావు, గొట్టిపాటి రవితో సహా ఎవరూ పార్టీ మారే ఆలోచన చేయటం లేదట. మూడు రాజధానులపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటనకు ముందు వరకూ టీడీపీ పనైపోయిందనే అంచనాకు వచ్చారంతా. తదనంతరం అసెంబ్లీ సమావేశాలలో, శాసనమండలి సమావేశాలలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి తన సభ్యుల్లో నమ్మకం కలిగించడమే కాకుండా ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వగలిగిందని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. 

వైసీపీలోకి 15 మంది ఎమ్మెల్సీలు..?
ఒకానొక సందర్భంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అధికార పార్టీ ప్లాన్ చేసిందని, త్వరలో టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా వైసీపీలో చేరబోతున్నారు అంటూ విస్తృత ప్రచారం జరిగింది. శాసనమండలి సభ్యులు కూడా 15 మంది వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీడీపీ శాసనమండలి సభ్యులు పోతుల సునీత, శివనాథ్‌ రెడ్డి, డొక్కా మాణిక్య వర ప్రసాద్ కూడా వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని.. విశాఖ, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఒకటే చర్చ జరిగింది. దీనిని టీడీపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. 

టీడీపీకి దూరమైన ఇద్దరు ఎమ్మెల్యేలు బాధపడుతున్నారా?
మూడు రాజధానుల ప్రకటన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు మూడు ముక్కలయ్యారని, ఆ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలే ఎందుకు వెళ్లామా అని బాధ పడుతున్నారని టీడీపీలో చర్చ సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీలపై అధికార వైసీపీ ఎంతగా గాలం వేసినా పని కాలేదని, ఏది జరిగినా మన మంచికే అంటూ ఆనందపడుతున్నారట తెలుగు తమ్ముళ్లు. మొత్తం మీద వైసీపీ ఎత్తుగడలను టీడీపీ విజయవంతంగానే తిప్పికొట్టిందని సంబరపడుతున్నారట. మండలి రద్దు చేయాలన్న ఆలోచన కూడా ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతుందని భావిస్తున్నారని అంటున్నారు.