Etcherla Fight : పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఈసారి అక్కడ గెలుపు ఎవరిదో?

నియోజకవర్గంలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే ఉత్కంఠ రానురాను ఎక్కువవుతోంది.

Etcherla Fight : పొలిటికల్ ట్విస్టులకు కేరాప్ ఎచ్చెర్ల నియోజకవర్గం. పొలిటికల్ కాంట్రవర్సీకి లోటు లేదక్కడ. అధికార, ప్రతిపక్షాల్లో గ్రూపులతో నిత్యం హాట్ హాట్ పాలిటిక్స్ నడిచే ఎచ్చెర్లలో రెండు పార్టీలూ ఊహించలేని ట్విస్టులతో రాజకీయాన్ని మలుపు తిప్పేశాయి. తాము ఒకటి తలస్తే అధినేతలు మరోలా నిర్ణయాలు తీసుకోవడంతో రెండు ప్రధాన పార్టీల్లో కేడర్ గప్ చుప్ అయిపోయారు. ఇంతకీ ఎచ్చెర్లలో ఏం జరిగింది? శ్రీకాకుళం జిల్లాకు ఆర్థికంగా ఆయువు పట్టు లాంటి ఆ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది?

శ్రీకాకుళం జిల్లాకు గేట్‌ వే..
శ్రీకాకుళం జిల్లాకు గేట్‌ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్‌గా చాలా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. పరిశ్రమలు, విద్యా కేంద్రాలు ఉన్న ఎచ్చెర్లలో ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం.. మరోవైపు పొడవైన జాతీయ రహదారితో జిల్లాలో ఆర్థిక కేంద్రంగా మారింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ, రాజీవ్‌ గాంధీ ట్రిపుల్‌ ఐటీతోపాటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం జిల్లా కేంద్రం శ్రీకాకుళం పక్కనే ఉంటుంది. అంతేకాకుండా నియోజకవర్గం పరిధిలోని రణస్థలం పారిశ్రామిక వాడలో ఎన్నో ఫార్మా పరిశ్రమల వల్ల ఉపాధి కోసం ఇతర ప్రాంతాల వారు వచ్చి స్థిరపడ్డారు. ఒకవైపు ప్రకృతి వనరులు, మరోవైపు విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉండటంతో పట్టుకోసం ప్రధాన పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తుంటాయి.

టీడీపీ కంచుకోట..
1967లో ఏర్పడిన ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి 1999 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు సీనియర్‌ మహిళా నేత ప్రతిభా భారతి. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన ప్రతిభా భారతి 2004లో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి కోండ్రు మురళీమోహన్‌ గెలుపొందారు. అంతవరకు ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా ఉన్న ఎచ్చెర్ల 2009లో జనరల్‌గా మారింది. దీంతో 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు మురళీమోహన్‌… రాజాం నియోజకవర్గానికి మారారు. ఇక 2009లో కాంగ్రెస్‌ గెలవగా, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలిచాయి. ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నుంచి నడికుదిటి ఈశ్వరరావు పోటీ పడుతున్నారు.

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం మండలాలు ఉన్నాయి. మొత్తం 2 లక్షల 42 వేల 918 ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో తూర్పుకాపు సామాజిక వర్గం ఓటర్లు మొదటి స్థానంలో ఉండగా రెడ్డిక, కళింగ, మత్స్యకారుల సామాజిక వర్గాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య విజయం దోబూచలాడగా, ఈసారి టీడీపీ తప్పుకుని బీజేపీకి ఈ నియోజకవర్గం కేటాయించడంతో ఉత్కంఠ రేపుతోంది.

రెండు పార్టీల్లోనూ అనూహ్యంగా చల్లారిన అసంతృప్తులు..
వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో నిన్నమొన్నటి వరకు గ్రూప్‌వార్‌ తీవ్ర స్థాయిలో ఉండేది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కి వ్యతిరేకంగా ద్వితీయశ్రేణి క్యాడర్‌ అంతా రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో టీడీపీలోనూ సీనియర్‌ నేత కళా వెంకటరావు, ప్రస్తుత విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయినే అనూహ్యంగా ఇప్పుడు రెండు పార్టీల్లోనూ అసమ్మతులు, అసంతృప్తులు టీ కప్పులో తుఫాన్‌లా చల్లారిపోయాయి. ఎన్నికల్లో ఎవరు ఎలాంటి పాత్ర పోషిస్తారోగాని.. ప్రస్తుతానికి అయితే ఇరుపార్టీల్లో తిరుగుబాటుదారులు శాంతించినట్లే కనిపిస్తున్నారు.

ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత..
గత ఎన్నికల్లో వైసీపీ తొలిసారి గెలిచిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ తొలుత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదని నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ద్వితీయ శ్రేణి నేతలు, చాలామంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లు బహిరంగ విమర్శలు చేసేవారు. ఎమ్మెల్యే కూడా వారిని శాంతపరిచేందుకు ఎన్ని విధాల ప్రయత్నించినా.. ఎవరూ వెనక్కి తగ్గేవారు కాదు. మంత్రి బొత్సకు ప్రధాన అనుచరుడైన ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ అధిష్టానం అండదండలతో మరోమారు టికెట్‌ తెచ్చుకున్నారు. ఐతే ఇటీవల వైసీపీలో కీలక నేత అయిన ఎచ్చెర్ల మండలానికి చెందిన జరుగుళ్ల శంకర్‌పై హత్యాయత్నం జరగడం, ఈ కేసులో నిందితుడిగా ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి అరెస్టు కావడం.. ఎమ్మెల్యేకు మైనస్‌గా మారిందని చెబుతున్నారు.

ఆశలన్నీ సంక్షేమ పథకాలపైనే..
పార్టీలో చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నా… అవన్నీ చిన్నచిన్న సమస్యలని… ప్రతి పార్టీలో అలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయని లైట్‌గా తీసుకుంటున్నారు ఎమ్మెల్యే. సీఎం జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తనదే గెలపని… తన విజయాన్ని ఆపడానికి ఎన్ని పార్టీలు కూటమి కట్టినా ఉపయోగం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే.

ఎచ్చెర్లను బీజేపీకి వదిలేసిన టీడీపీ..
గ్రూపులు, ఎమ్మెల్యేపై తిరుగుబాట్లతో వైసీపీ సతమతమవుతుండగా, టీడీపీలోనూ ఇదే పరిస్థితి ఉండటం…. టికెట్‌ కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలకు సర్దిచెప్పలేని పరిస్థితుల్లో ఎచ్చెర్లను బీజేపీకి వదిలేసింది టీడీపీ. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి సీనియర్‌ నేత కళా వెంకటరావుతోపాటు టీడీపీ శిక్షణ శిబిరాల కోఆర్డినేటర్‌ కలిశెట్టి అప్పలనాయుడు పోటీ చేయాలని భావించారు. సీనియర్‌ నేత కళా వెంకటరావు 2014లో ఎచ్చెర్ల నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో మరోమారు పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలంటే కలిశెట్టి పార్టీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు.

బీజేపీ జెండాను పట్టుకుని కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిన పరిస్థితి..
2019 నుంచి నిరంతరం పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో జిల్లా పార్టీ ఆయనను సస్పెండ్‌ చేసినా.. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, యువనేత లోకేశ్‌ అండదండలతో యథేచ్ఛగా నియోజకవర్గంలో పసుపు జెండా పట్టుకునే ప్రచారం చేసేవారు. ఇలా ఇద్దరూ పార్టీపై ఒత్తిడి చేయడం.. ఎవరికి టికెట్‌ కాదంటే ఏమవుతుందో అనే టెన్షన్‌తో ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది టీడీపీ. అంతేకాకుండా టీడీపీ టికెట్‌ కోసం కొట్లాడిన కళావెంకటరావుకు పక్కనే ఉన్న చీపురుపల్లి అసెంబ్లీ టికెట్‌, కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం పార్లమెంట్‌ టికెట్‌ ఇచ్చేంది. మరోవైపు కళా శిష్యుడైన నదికుదిటి ఈశ్వరరావును బీజేపీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది. దీంతో రెండు వర్గాల వారు ఇప్పుడు బీజేపీ జెండాను పట్టుకుని కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిన పరిస్థితి తలెత్తింది.

అనూహ్యంగా బీజేపీ టికెట్ కైవసం..
ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నడికుదిటి ఈశ్వరరావు 2019 వరకు టీడీపీలోనే ఉండేవారు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ అయిన ఈశ్వరరావు 2013లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తన స్వగ్రామం బంటుపల్లి సర్పంచ్‌గా తన తల్లిని గెలిపించుకున్నారు. అంతవరకు రాజకీయాలతో సంబంధంలేని ఈశ్వరరావు… తల్లిని సర్పంచ్‌ చేశాక… రణస్థలం మండలంలో రాజకీయంగా క్రియాశీలంగా తిరిగేవారు. ఆ క్రమంలోనే టీడీపీ నేత కళావెంకటరావుకు దగ్గరై 2014లో ఆయన విజయానికి కృషి చేశారు. 2019 తర్వాత బీజేపీలో చేరి అనూహ్యంగా ఈ ఎన్నికల్లో టికెట్‌ కైవసం చేసుకున్నారు.

కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈశ్వరరావు… బీసీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఐతే తమ ప్రాంతంలో కులం అనేది ఎవరూ చూడరని… సేవ చేస్తామా? లేదా? అన్నదే ప్రాతిపదికగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు. తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉండే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చూస్తానంటున్నారు.

ఎలాంటి మలుపు తిరుగుతుందో..
మొత్తానికి టీడీపీలో విభేదాలు బీజేపీ అభ్యర్థికి కలిసివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎచ్చెర్ల టికెట్‌ కోసం ప్రయత్నించిన ఇద్దరు నేతలకు అధిష్టానం న్యాయం చేయడంతో ఎచ్చెర్లలో బీజేపీ వెంట నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తాము ఎంత వ్యతిరేకించినా అధిష్టానం ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కే రెండోసారి టికెట్‌ ఇవ్వడంతో వైసీపీ నేతలు సైలెంట్‌ అయిపోయారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే ఉత్కంఠ రానురాను ఎక్కువవుతోంది.

Also Read : విలక్షణ తీర్పులకు ఈ నియోజకవర్గం పెట్టింది పేరు.. ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు