విలక్షణ తీర్పులకు ఈ నియోజకవర్గం పెట్టింది పేరు.. ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

AP Elections 2024: వరుసగా మూడోసారి గెలిచి రామానాయుడు హ్యాట్రిక్‌ సాధిస్తారా? లేక వైసీపీ సంచలన విజయం నమోదు చేస్తుందా?

విలక్షణ తీర్పులకు ఈ నియోజకవర్గం పెట్టింది పేరు.. ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

Palakollu Assembly constituency

విలక్షణ తీర్పులకు ఆ నియోజకవర్గం పెట్టింది పేరు. అందుబాటులో ఉన్నవారిని అందలం ఎక్కించడం…. అవసరం లేదనుకుంటే ఓడించడం ఆ నియోజకవర్గం ప్రత్యేకత. అందుకే ఆ నియోజకవర్గం ఓటర్ల నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదంటారు. తన, మన భేదం లేకుండా పనితీరే ప్రాతిపదికగా అక్కడి ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడూ ఓ సెన్సేషనే.. ఇన్నిరకాల స్పెషాలిటీస్ ఉన్న ఆ నియోజకవర్గం ఏది? ఆ నియోజకవర్గంలో తాజా ఎన్నికల పోరు ఎలా ఉంది?

చిరంజీవి, దాసరి నారాయణరావు ఇక్కడి వారే..
ఏపీలో వీఐపీ నియోజకవర్గం పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక్కడి వారే.. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులకు పాలకొల్లు కేరాఫ్ అడ్రస్.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు గట్టి పట్టున్న ప్రాంతం. కాపుల ఖిల్లాగా చెప్పే పాలకొల్లులో ఈ సారి పోటీ ఎలా ఉండబోతోందనేది అందరిలోనూ ఆసక్తిరేపుతోంది.

గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా గెలిచిన టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయం దుమ్మురేపుతోంది. రెండు సార్లు గెలిచిన జోష్‌లో రామానాయుడు, ఈ సారి ఆయనకు ఎలాగైనా చెక్‌ చెప్పాలనే ఉద్దేశంతో వైసీపీ పావులు కదుపుతోంది. రామానాయుడిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో బీసీల్లో బలమైన సామాజికవర్గమైన శెట్టిబలిజ కులానికి చెందిన గుడాల గోపికి టికెట్‌ ఇచ్చింది వైసీపీ.

విస్తారమైన కొబ్బరి తోటలు, ఆక్వా సాగుతో ప్రపంచవ్యాప్తంగా పాలకొల్లు ఫేమస్‌. అంతేకాదు ఇదే ప్రాంతానికి చెందిన మెగాస్టార్‌ చిరంజీవి, దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ, చలం, పినిశెట్టి రవిరాజా, రేలంగి నరసింహారావు, బన్నీ వాసు, అడ్డాల చంటి ఇలా ఎందరో ప్రముఖులు సినీ రంగంలో రాణించారు. ఇంకా రాణిస్తున్నారు.

చిరంజీవి, దాసరి రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. కళారంగంలో రాణిస్తున్న ప్రముఖులపై ఎంతో గౌరవభావం చూపిన ఇక్కడి ఓటర్లు… రాజకీయాల వరకు వేరేగా ఆలోచించడం విశేషం. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవికి స్వస్థలం పాలకొల్లులో చేదు ఫలితమే ఎదురైంది. స్వయంగా చిరంజీవి పోటీ చేసిన… స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోడానికి ప్రాధాన్యం ఇచ్చిన పాలకొల్లు ఓటర్లు తమ రూటే సెపరేటు అన్నట్లు తీర్పు నిచ్చారు.

కాపులకే ప్రాధాన్యం
ఇక గత ఎన్నికల్లో సైతం రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్‌ సునామీతో టీడీపీ కొట్టుకుపోగా, పాలకొల్లులో మాత్రం వైసీపీ హవాను తట్టుకుని నిలబడ్డారు స్థానిక ఎమ్మెల్యే రామానాయడు. గత ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ సేవ చేస్తున్న ఎమ్మెల్యే మూడోసారి గెలుపుపై గురిపెట్టారు. ఇక నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ కావడంతో ఏ పార్టీ అయినా కాపులకే ప్రాధాన్యం ఇస్తుంటుంది.

కానీ, అధికార వైసీపీ మాత్రం వ్యూహం మార్చి బీసీలకు చాన్స్‌ ఇచ్చింది. నియోజకవర్గంలో మొత్తం లక్షా 90 వేల ఓట్లు ఉండగా, ఇందులో కాపు సామాజికవర్గం ఓట్లు 52 వేలు ఉండగా, బీసీ ఉప కులాలు ఓట్లన్నీ కలిపితే దాదాపు 80 వేల వరకు ఉంటాయి. దీంతో వైసీపీ బీసీలపై ఫోకస్‌ పెంచింది.

ఒకవైపు టీడీపీ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామానాయుడు, మరోవైపు బీసీ నేత, వైసీపీ అభ్యర్థి గుడాల గోపి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా రామానాయుడిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ను కాదని, ఎవరూ ఊహించిన రీతిలో గుడాల శ్రీహరిరావు అలియాస్‌ గోపికి టికెట్‌ ఇచ్చింది. టికెట్‌ ప్రకటన తర్వాత అధికార పార్టీ కేడర్‌ అండతో ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు గోపి.

గతంలో ఎమ్మెల్యే రామానాయుడికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబులు పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని పార్టీ ఆదేశించింది. అదేసమయంలో ఆ ఇద్దరికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది. శేషుబాబుకు టీటీడీ సభ్యత్వం, నాగబాబుకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవులు ఆశచూపినట్లు చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరూ పార్టీ అభ్యర్థి గోపికి సహకరిస్తారని అధిష్టానం భావిస్తోంది. కానీ, ప్రస్తుతానికి వారెవరూ ప్రచారంలో కనిపించడం లేదు. కానీ, అందరినీ కలుపుకుని వెళ్తానని, ఎన్నికల్లో విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు గోపి.

నువ్వా-నేనా అన్నట్లు
అనూహ్యంగా టికెట్‌ దక్కించుకున్న గోపి…. ఎమ్మెల్యే రామానాయుడికి గట్టిపోటీ ఇస్తున్నారు. ఐతే కూటమితో తమ బలం మరింత పెరిగిందని… ఈ సారి కూడా తనదే విజయం అంటూ ధీమా కనబరుస్తున్నారు ఎమ్మెల్యే రామానాయుడు. టీడీపీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్న రామానాయుడు టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం, పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయంటున్నారు.

మొత్తానికి పాలకొల్లులో రెండు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో సమన్వయం సాధిస్తే సానుకూల ఫలితాలు సాధించే వీలుందనే విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ అంటీ ముట్టనట్టు ఉండటం, మిగిలిన ప్రధాన నేతలు కూడా ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తట్టుకుని నిలబడటం అంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు. ఏదిఏమైనా పాలకొల్లు రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది. వరుసగా మూడోసారి గెలిచి రామానాయుడు హ్యాట్రిక్‌ సాధిస్తారా? లేక వైసీపీ సంచలన విజయం నమోదు చేస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read: యాదగిరి గుట్టను కూడా మేమే కట్టాం.. మరి అక్కడికెందుకు వెళ్తున్నారు?: కేసీఆర్