Gold Demand Drop : గోల్డ్ ఢమాల్..! 70 శాతం తగ్గిన డిమాండ్.. బంగారం కొనాలా? ఆగాలా? అసలు కారణాలివే..!
Gold Demand Drop : బంగారంపై దిగుమతి సుంకం పెంపు తర్వాత దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ దాదాపు 70శాతం మేర పతనమైంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు బంగారం కొనాలా? వద్దా? అని ఆలోచనలో పడ్డారు.
- Sreehari A
- Published on- May 31, 2026 / 01:23 PM IST
Gold Demand Drop ( Image Credit : AI )
- బంగారంపై దిగుమతి సుంకం పెంపుతో భారీగా క్షీణించిన డిమాండ్
- దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన కేంద్రం
- జీఎస్టీతో పసిడిపై పన్ను భారం 9.18 నుంచి 18.45 శాతం పెంపు
- బంగారం డిమాండ్‌లో దాదాపు 70శాతం పతనం
- గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపని భారతీయ కొనుగోలుదారులు
Gold Demand Drop : బంగారం కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి పెద్దగా డిమాండ్ లేదు.. భారతీయులకు బంగారం అతిపెద్ద సెంటిమెంట్ అయినా అలాంటి పసిడిని ఇంటికి తెచ్చుకునేందుకు ఆస్తి చూపడం లేదు. వాస్తవానికి, బంగారం అనేది కేవలం ఆభరణం కాదు.. అది పెట్టుబడి, భద్రతగా కూడా భావిస్తారు. అయితే, ప్రస్తుతం గోల్డ్ కొనాలా వద్దా? అనే సందిగ్ధంలో చాలా భారతీయ ఫ్యామిలీలు ఉన్నాయి.
దీనికి కారణం ఒకటని చెప్పలేం.. అందులో పెరిగిన బంగారం ధరలు కావొచ్చు.. కొత్త దిగుమతి సుంకాలు, జీవన వ్యయాల భారమంతా ఇప్పుడు బంగారం మార్కెట్‌ను గట్టిగా దెబ్బతీశాయి. బంగారం డిమాండ్‌లో దాదాపు 70శాతం పతనమైంది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలైంది.
70 శాతానికి పడిపోయిన గోల్డ్ డిమాండ్ :
కేంద్ర ప్రభుత్వం మే 13 నుంచి గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచేసింది. దాంతో దేశంలో గోల్డ్ డిమాండ్ దాదాపు 70 శాతం మేర క్షీణించింది. 2025 ఏడాదిలో ఇదే సమయంలో 25 టన్నులు ఉన్న డిమాండ్ ఈసారి కేవలం 7.5 టన్నులకు పరిమితమైనట్లు ఇండస్ట్రీ అంచనా వేస్తోంది.
పన్నుల భారం.. కొనుగోలుదారుల వెనుకడుగు :
దిగుమతి సుంకం పెంచడంతో జీఎస్టీతో కలిపి పసిడిపై మొత్తం పన్ను భారం 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగింది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఆహార ధరలు కూడా పెరగడంతో భారతీయ వినియోగదారులు గోల్డ్ వంటి భారీ కొనుగోళ్లను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నారు. అందులోనూ రూపాయి బలహీనపడటం, ముడిచమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని దిగుమతి నిబంధనలను కఠినతరం చేసింది.
ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఆహార ధరల పెంపుతో సుంకాల పెంపు కారణంగా బంగారం వంటి కొనుగోళ్లపై ఖర్చు చేసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ప్రకారం.. జోయాలుక్కాస్ బంగారం స్టోర్లలో డిమాండ్ 35 శాతానికిపైగా పడిపోగా, పసిడిపై పెట్టుబడి డిమాండ్ కూడా మందగించిందని అంటున్నారు.
తేలికపాటి ఆభరణాలకే భారతీయుల మొగ్గు :
ప్రస్తుతం బులియన్ మార్కెట్లలో 999 స్వచ్ఛత గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ.1.57 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, కొనుగోలుదారులు మాత్రం తక్కువ బరువు, తక్కువ క్యారెట్లు ఉండే ఆభరణాలనే కొంటున్నారు.
కొత్త బంగారం కొనడం కన్నా పాత బంగారాన్ని విక్రయించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, ఆభరణాల మార్కెట్‌లోని వివిధ విభాగాలలో సుంకం పెంపు ప్రభావం వేర్వేరుగా ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
Read Also : Gold Rates Today : మహిళలకు మంచి గోల్డెన్ ఛాన్స్.. బంగారం ఇప్పుడు కొనడమే బెటర్.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
మధ్య తరహా, ప్రాంతీయ ఆభరణాల వ్యాపారులు బంగారు మార్పిడి, సరుకుల నిర్వహణపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పెట్టుబడి డిమాండ్ ఆధారంగా పరిశీలిస్తే.. 2026 ఏడాది ప్రారంభంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా మందగమనం దిశగా కొనసాగుతోంది.
మార్చి త్రైమాసికంలో భారత బులియన్ మార్కెట్లో బంగారు కడ్డీలు, నాణేల డిమాండ్ గతేడాదితో పోలిస్తే.. 34 శాతం పెరిగి 62.3 టన్నులకు చేరుకుంది. ప్రపంచంలో భారీ మొత్తంలో బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి కాగా, దేశీయ వార్షిక డిమాండ్ సాధారణంగా 800 టన్నుల నుంచి 850 టన్నుల మధ్య ఉంటుంది.
దేశంలోనే అత్యధికంగా గోల్డ్ వినియోగించే ప్రాంతాలలో దక్షిణ భారత్ కాగా.. ప్రస్తుతం డిమాండ్ బలహీనపడిందని ఆభరణాల వ్యాపారులు అంటున్నారు. పాత బంగారాన్ని అమ్మి, నగదును ఇంటికి తీసుకెళ్లేవారిలో భారీ పోటీ నెలకొంది.
బంగారానికి ఇంకా డిమాండ్ తగ్గుతుందా? :
అధిక ధరలు, పెరిగిన సుంకాలు, వినియోగదారుల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో 2026 రెండో త్రైమాసికం వరకు గోల్డ్ డిమాండ్ ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం కొనేవారు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి కోసమే బంగారం కొనాలనుకుంటే మాత్రం ధరల మార్పులను గమనించడం మంచిదని సూచిస్తున్నారు.
