8th Pay Commission : 8వ వేతన సంఘం గుడ్‌న్యూస్.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట! 5 కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్!
8th Pay Commission : ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణానంతరం జీవిత భాగస్వామి లేదా పిల్లలకు ప్రారంభంలో ఉద్యోగి చివరి జీతం/పెన్షన్‌లో 50 శాతం మేర కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. నిర్దిష్ట కాలం ముగిసిన తర్వాత 30 శాతానికి తగ్గుతుంది. కుటుంబంపై ఆధారపడే వారికి ఈ పెన్షన్‌ను 30 శాతానికి తగ్గించకుండా పూర్తి స్థాయిలో కొనసాగించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
- Sreehari A
- Published on- May 21, 2026 / 06:55 PM IST
8th Pay Commission
8వ వేతన సంఘం సమావేశంలో కీలక ముందడుగు
పెన్షనర్లకు భారీ రిలీఫ్.. 8వ వేతన సంఘం చర్చల్లో కీలక మలుపు
ఇకపై 10 ఏళ్లు కాదు.. ప్రతి 5 ఏళ్లకు పెన్షన్ పెరుగుతుంది
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్.. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. దేశంలోని 65 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నిజంగా శుభవార్తే..
గత వారం ఢిల్లీలో జరిగిన జాతీయ సంయుక్త సంప్రదింపుల యంత్రాంగం మండలి (NC-JCM) 49వ వార్షిక సమావేశంలో పెన్షన్‌కు సంబంధించి పాత సమస్యలపై ప్రభుత్వంతో సానుకూల చర్చలు జరిగాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉద్యోగ సంఘాలు (8th Pay Commission) లేవనెత్తిన పెన్షనర్ల సమస్యలపై క్యాబినెట్ కార్యదర్శి టి. వి. సోమనాథన్ హామీ ఇచ్చారు.
జేసీఎం స్టాఫ్ తమ సభ్యులకు జారీ చేసిన అధికారిక లేఖ ప్రకారం.. పెన్షన్ పెంపుదల నుంచి పాత పెన్షన్ పథకం (OPS) పరిధిని విస్తరించడం వరకు అనేక కీలక డిమాండ్లను 8వ పే కమిషన్‌కు రిపోర్టు చేయాలని, కొన్ని నిబంధనలను తక్షణమే సవరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశంలో నిర్ణయించిన మీ ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపే ఐదు ప్రధాన అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. ప్రతి 5 ఏళ్లకు పెన్షన్ పెరుగుతుంది :
ప్రస్తుతం, వేతన సంఘం నియామకంతో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే పెన్షన్ సవరిస్తున్నారని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. తద్వారా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం వృద్ధ పెన్షన్దారులకు చాలా కష్టంగా మారుతోంది.
అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుల ఆధారంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి పింఛన్లను పెంచాలి. ఈ డిమాండ్‌పై ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెన్షన్ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ ముఖ్యమైన డిమాండ్‌ను పరిశీలన కోసం 8వ వేతన సంఘానికి లాంఛనంగా పంపుతామని క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ జేసీఎంకు హామీ ఇచ్చారు.
2. ఆధారపడిన కుటుంబ పెన్షన్ 30శాతం తగ్గించొద్దు :
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి లేదా పెన్షన్దారు మరణించిన తర్వాత వారి భార్య లేదా పిల్లలకు చెల్లించే కుటుంబ పెన్షన్, ఉద్యోగి చివరి జీతంలో 50శాతం నుంచి కేవలం 30శాతానికి తగ్గుతుంది.
కుటుంబంపై ఆధారపడే వారికి ఇచ్చే ఈ పూర్తి పెన్షన్ 30 శాతం తగ్గించవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ అంశం సున్నితత్వాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంది. తుది నిర్ణయం కోసం 8వ వేతన సంఘానికి పంపేందుకు క్యాబినెట్ కార్యదర్శి ఆమోదం తెలిపారు.
3. దివ్యాంగ పిల్లలకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ రద్దు :
దివ్యాంగ పిల్లలు కుటుంబ పెన్షన్ ప్రయోజనాల కోసం వైద్య మండలి పౌర అధికారుల నుంచి ఆదాయం లేనట్టుగా వారికి సర్టిఫికేట్ సమర్పించాలి. సంబంధిత అధికారులు ఇలాంటి ధృవీకరణ పత్రాలను జారీ చేయడం లేదు.
ఆ పిల్లలు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని యూనియన్లు అంటున్నాయి. ఈ విషయంపై క్యాబినెట్ కార్యదర్శి తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా ఈ నిబంధనను తొలగించాలని పెన్షన్ విభాగాన్ని ఆదేశించారు.
4. ఈ ఉద్యోగులకు పాత పెన్షన్ :
డిసెంబర్ 22, 2003న NPS నోటిఫికేషన్ జారీ తర్వాత నియమితులైన ఉద్యోగులు పాత పెన్షన్ పథకం ప్రయోజనాలను పొందరు. అయితే, రెండు నిర్దిష్ట వర్గాలకు పాత పెన్షన్ పథకాన్ని (OPS) అమలు చేయాలని జేసీఎమ్ డిమాండ్ చేసింది. ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 22, 2003కు ముందు ఖాళీలు :
2003లో డిసెంబర్ 22వ తేదీకి ముందు ఆమోదించిన లేదా ప్రకటించిన నియామకాలలో ఆ తర్వాత చేరిన వారిని OPSలో చేర్చాలి. ఈ విషయంపై స్టాఫ్ సైడ్ నుంచి వివరణాత్మక నోట్ సమర్పించాలని క్యాబినెట్ సెక్రటరీ కోరారు.
కారుణ్య నియామకం :
ఒక అభ్యర్థి డిసెంబర్ 22, 2003కు ముందు కారుణ్య నియామకం కోసం అప్లయ్ చేసి ఉండి అర్హతా ప్రమాణాలను నెరవేర్చినప్పటికీ జనవరి 1, 2004 తర్వాత నియామకం జరిగితే పాత పెన్షన్ (OPS)కు అర్హులే. పెన్షన్, పెన్షన్దారుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ డిమాండ్‌ను వారంలోగా అమలు చేసేందుకు అంగీకరించారు.
5. వితంతువులకు కుటుంబ పెన్షన్ :
మరణించిన ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న వితంతువుకు కూడా కుటుంబ పెన్షన్ అందుబాటులోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన క్యాబినెట్ కార్యదర్శి, న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ నిబంధనను సవరించే బాధ్యతను సిబ్బంది, శిక్షణ విభాగానికి (DOP&T)కు అప్పగించారు.
