8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. జీతం పెంపుతో పాటు HRAలోనూ బంపర్ బెనిఫిట్!
8th Pay Commission : 8వ వేతన సంఘం HRA ప్రతిపాదనలు అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. లెవల్ 5 ఉద్యోగులకు నెలకు రూ.15,768 వరకు హెచ్ఆర్ఏ పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- September 6, 2026 / 11:40 AM IST
8th Pay Commission HRA Hike
- HRA పెరిగితే నెలకు రూ.15,800 వరకు అదనపు ఆదాయం
- భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు
- లెవల్ 5 ఉద్యోగికి నెలకు దాదాపు రూ.15,768 వరకు అదనం
8th Pay Commission HRA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ కలగనుంది. 8వ వేతన సంఘం అమలుకు ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఆమోదం పొందితే ప్రాథమిక వేతనం, ఇంటి అద్దె భత్యం (HRA) కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్స్-కేటగిరీ నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ పెంపు భారీగా ఉండొచ్చని అంచనా. ప్రతిపాదిత లెక్కల ప్రకారం.. లెవల్ 5 ఉద్యోగికి నెలకు దాదాపు రూ.15,768 వరకు అదనంగా హెచ్ఆర్ఏ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ప్రస్తుతానికి ఇంకా ఖరారు కాలేదు.
ప్రస్తుతం HRA ఎంతంటే? :
7వ వేతన సంఘం సమయంలో హెచ్ఆర్ఏ అనేది నగరాల వర్గీకరణ ఆధారంగా నిర్ణయించారు. ఎక్స్-కేటగిరీ నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రాథమిక వేతనంలో 24 శాతం, వై-కేటగిరీ నగరాల్లో 16 శాతం, జెడ్-కేటగిరీ నగరాల్లో 8 శాతం హెచ్ఆర్ఏగా నిర్ణయించారు.
అయితే, కరువు భత్యం (DA) 2024 జనవరిలో 50 శాతాన్ని దాటగా హెచ్ఆర్ఏ రేట్లను కూడా పెంచారు. తద్వారా ఎక్స్-కేటగిరీ నగరాల్లో హెచ్ఆర్ఏ 30 శాతం, వై-కేటగిరీ ప్రాంతాల్లో 20 శాతం, జెడ్-కేటగిరీ నగరాల్లో 10 శాతానికి చేరింది.
ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏంటి? :
ఇంటి అద్దెలు, గృహ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం కింద హెచ్ఆర్ఏను ఇంకా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ సంయుక్త సంప్రదింపుల యంత్రాంగం మండలి (NC-JCM) నుంచి వచ్చిన ప్రతిపాదన ప్రకారం.. ఎక్స్-కేటగిరీ నగరాలకు హెచ్ఆర్ఏ 40 శాతానికి, వై-కేటగిరీ నగరాలకు 35 శాతం, జెడ్-కేటగిరీ నగరాలకు 30 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు.. డీఏలో మార్పులు వస్తే హెచ్ఆర్ఏ కూడా సవరించే విధానం ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నగరాల వర్గీకరణను దశాబ్ద కాల వ్యవధికి బదులుగా ప్రతి ఐదేళ్లకోసారి రివ్యూ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. కొన్ని ఇతర ఉద్యోగ సంఘాలు 2-అంచెలు, 4-అంచెలు వంటి ప్రత్యామ్నాయ హెచ్ఆర్ఏ విధానాలను ప్రతిపాదిస్తున్నాయి.
లెవల్ 5 ఉద్యోగికి ఎంత పెరగొచ్చు? :
8వ వేతన సంఘం ఫైనల్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఇంకా ప్రకటించలేదు, అయితే 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంచనాగా తీసుకుంటే.. ఎక్స్-కేటగిరీ నగరాలకు 40 శాతం హెచ్ఆర్ఏ అమలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.. ప్రస్తుతం లెవల్ 5 ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ.29,200 అనుకుంటే.. ఎక్స్-కేటగిరీ నగరంలో 30 శాతం హెచ్ఆర్ఏ ప్రకారం ప్రస్తుతం నెలకు రూ.8,760 హెచ్ఆర్ఏ వస్తుంది.
Read Also : EPF Home Loan : మీ హోం లోన్ రీపేమెంట్ చేయాలా? EPF నుంచి ఎంత విత్‌డ్రా చేయొచ్చు? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి!
2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం.. కొత్త ప్రాథమిక వేతనం రూ.61,320గా ఉంటే.. దీనిపై 40 శాతం హెచ్ఆర్ఏ రూ.24,528 అవుతుంది. అంటే.. ప్రస్తుత రూ.8,760తో పోలిస్తే.. నెలకు రూ.15,768 అదనంగా బెనిఫిట్ పొందొచ్చు. ఏడాదికి చూస్తే ఈ వ్యత్యాసం దాదాపు రూ.1.89 లక్షలు అనమాట.
ఇతర లెవెల్ ఉద్యోగులకు ఎంత లాభం? :
ఇదే లెక్కను ఇతర లెవల్ ఉద్యోగులకు వర్తింపజేస్తే కూడా HRAలో భారీగా పెరుగుదల కనిపిస్తుంది. లెవల్ 1 నుంచి లెవల్ 5 వరకు ఎంతవరకు జీతం పెరగొచ్చు? ఎంత మొత్తంలో నెలకు అందుకునే అవకాశం ఉందో అంచనాలను పరిశీలిద్దాం..
లెవల్ 1: రూ.5,400 నుంచి రూ.15,120కి పెంపు.. నెలకు రూ.9,720
లెవల్ 2 : రూ.5,970 నుంచి రూ.16,716కి పెంపు.. నెలకు రూ.10,746
లెవల్ 3 : రూ.6,510 నుంచి రూ.18,228కి పెంపు.. నెలకు రూ.11,718
లెవల్ 4 : రూ.7,650 నుంచి రూ.21,420కి పెంపు.. నెలకు రూ.13,770
లెవల్ 5: రూ.8,760 నుంచి రూ.24,528కి పెంపు.. నెలకు రూ.15,768
ఈ అంచనా లెక్కలన్నీ ముఖ్యంగా ఎక్స్-కేటగిరీ నగరాలు, 40 శాతం HRA, 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనే 3 అంచనాలపై ఆధారపడి ఉంటుంది.
ఎవరి జీతాలు పెరగనున్నాయి? :
8వ వేతన సంఘం తుది సిఫార్సులను కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపితే ప్రాథమిక వేతనం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణంలో భారీగా మార్పులు రావచ్చు. దాని ఆధారంగానే హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది.
అయితే, లెవల్ 1 నుంచి లెవల్ 5 వరకు మాత్రమే కాదు.. ఫైనల్ పే మ్యాట్రిక్స్‌లోని ఇతర స్థాయిల ఉద్యోగులపైనా కూడా ప్రభావం ఉండొచ్చు. ఉద్యోగి ఏ నగరంలో వర్క్ చేస్తున్నారు? ఆ సిటీ ఏ వర్గీకరణలో ఉంది? కొత్త బేసిక్ పే ఎంతగా నిర్ణయిస్తారు? చివరికి HRA శాతం ఎంతగా ఖరారు చేస్తారు దానిపైనే వాస్తవ పెంపు ఉంటుంది.
రూ.15,768 పెంపు ఖాయమా? :
ప్రభుత్వ ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం.. లెవల్ 5 ఉద్యోగికి రూ.15,768 హెచ్ఆర్ఏ పెంపు ఇప్పటివరకు అధికారికంగా ఖరారు కాలేదు. ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను, 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక అంచనా మాత్రమే..
ఫైనల్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతగా నిర్ణయిస్తారు? కొత్త ప్రాథమిక వేతనం ఎలా ఉంటుంది? డీఏను ఎలా పరిగణిస్తారు? నగరాల వర్గీకరణలో ఏమైనా మార్పులు చేస్తారా? చివరికి HRA రేట్లను ప్రభుత్వం ఎంతగా ఆమోదిస్తుంది? వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం రూ.15,768ను కచ్చితమైన జీతం పెంపు కాదు. అయితే, ఉద్యోగ సంఘాల ప్రతిపాదన ఆమోదం పొంది 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి అంచనాలు నిజమైతే లెవల్ 5 ఉద్యోగులకు HRAలో భారీ ప్రయోజనం దక్కవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఉద్యోగులు ఎదురుచూడాల్సిందే..
