8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ న్యూస్.. డీఏ (డియర్‌నెస్ అలవెన్స్), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
8వ వేతన సంఘంపై చర్చలు జోరుగా సాగుతుండగా, ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. డీఏ, డీఆర్‌లను ప్రాథమిక వేతనంలో విలీనం చేయడం వల్ల వేతనాలు భారీగా పెరుగుతాయని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
డీఏ, డీఆర్ విలీనం త్వరలో ప్రకటించనున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. అయితే, 8వ వేతన సంఘం అమలుకు సంబంధించిన కాలక్రమం ఇంకా ప్రకటించలేదు. జనవరి 1, 2026 నాటికి అమలు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ కమిషన్ పూర్తి అమలుకు 2028 వరకు పట్టవచ్చు. అందుకే చాలా మందిలో వేతన సంఘం అమలు అయ్యే వరకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను సవరిస్తుందా? లేదా ఉద్యోగులు జీతాల పెంపు కోసం వేతన సంఘం వరకు వేచి ఉండాల్సి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2016లో 7వ వేతన సంఘం నుంచి కేంద్ర ఉద్యోగుల సంస్థలు DA-DR విలీనం కోసం డిమాండ్‌ను లేవనెత్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డీఏ భారాన్ని పెంచుతుందని, ప్రాథమిక వేతనంలో చేర్చడం వల్ల పెన్షన్లు ఇతర భత్యాలు ప్రయోజనం పొందుతారని వాదిస్తున్నారు. ఈ విలీనం ఉద్యోగులకు రిలీఫ్ అందిస్తుంది. కానీ, ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని సిబ్బంది ప్రతినిధి ఒకరు అన్నారు.
విలీనం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ.. “ప్రస్తుతం డీఏ 58శాతానికి చేరుకుంది. విలీనం చేయడం వల్ల ప్రాథమిక వేతనం పెరుగుతుంది. జీడీపీలో 0.5శాతం కన్నా ఎక్కువ ఖర్చు పెరుగుతుంది. అయితే, ద్రవ్యోల్బణం నుంచి బిగ్ రిలీఫ్ పొందడానికి డీఏను కాలానుగుణంగా పెంచుతామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పుకార్లకు ప్రభుత్వం చెక్ :
డీఏ, డీఆర్‌లను బేసిక్ పేలో విలీనం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి లేదని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపించాయనే నివేదికల మధ్య ఈ ప్రకటన జారీ అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పుదారి పట్టించే వార్తలను నమ్మొద్దని అధికారి పేర్కొన్నారు. “మేం సకాలంలో డీఏ రివ్యూలను నిర్వహిస్తాం” అని అధికారి తెలిపారు.
గత ఏడాదిలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి. కానీ, మంత్రిత్వ శాఖ ప్రతిసారీ ఆ వార్తలను తోసిపుచ్చింది. 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉందని, డీఏ విలీనం లేకుండానే అమలు చేశారని సీనియర్ అధికారి వివరించారు. ఇప్పుడు, 8వ వేతన సంఘం కోసం కమిటీ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. కానీ, విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం.
8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలు అవుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే.. 5 మిలియన్లకు పైగా కేంద్ర ఉద్యోగులు, 6.5 మిలియన్ల పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.46 వరకు ఉండవచ్చని అంచనా. దాంతో సగటు వేతనాలు 30 శాతం నుంచి 40శాతానికి పెంచుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
అయితే, డీఏ విలీనం లేకపోవడం పట్ల నిరాశ వ్యక్తమవుతోంది. విలీనం వల్ల పెన్షనర్లకు భారీగా ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై పునఃపరిశీలించాలి. కమిషన్ ఏర్పాటును 2025-26 బడ్జెట్‌లో ప్రకటించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాబోయే డీఏ పెంపు మార్చి 2026లో ఉండొచ్చు.
ఉద్యోగులపై ఎఫెక్ట్.. ఏం చేయాలి? :
ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా డీఏపై ఆధారపడాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణం 5.49శాతం వద్ద ఉండటంతో రాబోయే డీఏ పెరుగుదల 3శాతంగానే ఉండొచ్చు. జీతాలు స్థిరంగా ఉంటాయి. కానీ, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సైడ్ ఇన్‌కమ్ తప్పనిసరిగా ఉండాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంమీద, ఈ కేంద్రం నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. కానీ, 8వ కమిషన్ నుంచి భారీ ఉపశమనం లభిస్తుందనే ఆశతోనే ఉద్యోగులు ఉన్నారు. ఏదిఏమైనా అన్ని ప్రయోజనాలను సకాలంలో అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.