8th Pay Commission ( Image Credit to Original Source )
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 8వ వేతన సంఘంతో ఎంత జీతం పెరుగుతుందో తెలుసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామందికి ఉంటుంది. అయితే, ఈ అవకాశాన్నే క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ మోసగాళ్ళు.
8వ వేతన సంఘం శాలరీ కాలిక్యులేటర్లతో మోసాలకు కొత్త పద్ధతిని కనిపెట్టారు ఆన్‌లైన్ మోసగాళ్ళు. ఈసారి, మోసగాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ మోసగాళ్ల నెట్‌వర్క్ విస్తృతంగా ఉంది, హోం మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చొరవ ‘సైబర్ దోస్త్’ కూడా ఈ రిస్క్ ఉందంటూ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.
జీతం కాలిక్యులేటర్, 8వ వేతన కమిషన్ స్కామ్ ఏంటి? :
ఆన్‌లైన్ మోసగాళ్ళు కొత్త స్కామ్‌కు తెరలేపారు. శాలరీ కాలిక్యులేటర్, 8వ పే కమిషన్ స్కామ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. నివేదికల ప్రకారం ( REF.) ఈ మోసంలో 8వ సీపీసీ జీతం కాలిక్యులేటర్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ అందుబాటులో లేదు. కానీ, APK ద్వారా సైడ్-లోడ్ అవుతుంది. ఆ తర్వాత వ్యక్తికి, అవతలి వ్యక్తి ఫోన్‌కు ఫుల్ యాక్సెస్ లభిస్తుంది. దాంతో యూజర్ల బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టదు.
మోసగాళ్ళు బ్యాంకు ఖాతా ఎలా ఖాళీ చేస్తారంటే? :
సైబర్ మోసగాళ్ళు ఒక యూజర్ ఫోన్‌లో APK ఫైల్ ఇన్‌స్టాల్ చేశాక మరో వ్యక్తి ఫోన్‌లోని ప్రతి యాక్టివిటీని రిమోట్‌గా మానిటరింగ్ చేయగలరు. మీ మెసేజ్, ఓటీపీలకు కూడా యాక్సెస్ ఇస్తుంది. వెంటనే మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులను ఖాళీ చేసేస్తారు మోసగాళ్ళు.
చాలామంది బాధితుల బ్యాంకు ఖాతాలు ఇలానే పూర్తిగా ఖాళీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ మాల్ వేర్ యాప్‌లు బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతాయి. మీకు బయటకు ఇతర యాప్స్ మాదిరిగా కనిపించదు. మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే విషయం కూడా మీకు తెలియదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సైబర్ స్కామ్ అనేది APK, సైడ్ లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీరు సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటారు. అయితే APKని సైడ్‌లోడ్ అంటే.. ప్లే స్టోర్‌కి వెళ్లకుండా ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు సాధారణంగా మాల్ వేర్‌తో ఉంటాయి. గూగుల్ పాలసీ కారణంగా ప్లే స్టోర్‌లో ఇలాంటి ఏపీకే ఫైల్స్ అనుమతి ఉండదు.
సైబర్ మోసగాళ్ళు యాప్ APK ఫైల్ మెసేజ్ రూపంలో పంపుతున్నారు. అయితే మెసేజ్ లింక్ ఓపెన్ చేయగానే యూజర్ల ఫోన్‌లలో మాల్ వేర్ ఆటో ఇన్‌స్టాల్ అవుతుంది. ముఖ్యంగా 8వ వేతన సంఘం గురించి ఎంత జీతం పెరుగుతుందని తెలుసుకునేందుకు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. అయితే, ఈ మోసపూరిత లింకులు క్లిక్ చేస్తే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అవుతుంది జాగ్రత్త.
సేఫ్‌గా ఎలా ఉండాలంటే? :
భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా APK ఫైల్, వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అలర్ట్స్ పంపదని సైబర్ సెక్యూరిటీ, భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి. కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల అవగాహన ఉంటే ఇలాంటి మోసాల నుంచి బయటపడొచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఒక్కటే..
8వ వేతన సంఘం, ఏదైనా ఇతర ప్రభుత్వ పథకానికి సంబంధించిన సమాచారం కోసం గుర్తుతెలియని మెసేజ్ లింక్‌లపై క్లిక్ చేయొద్దు. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే విజిట్ చేయండి. మీకు వచ్చే సెక్యూరిటీ ఓటీపీని ఎవరికి షేర్ చేయొద్దు.
అనుమానాస్పద యాప్ ఇన్‌స్టాల్ అయితే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు రిపోర్టు చేయండి. అలాగే మీ ఫోన్ కూడా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా మాల్ వేర్ మీకు తెలియకుండా డివైజ్ లో ఇన్ స్టాల్ అయినా రీసెట్ చేయడం వల్ల అన్ని డిలీట్ అయిపోతాయి.