Bank Strike Feb 12 ( Image Credit to Original Source )
Bank Strike Feb 12 : బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మీకు ఫిబ్రవరి 12న బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే, ఇది మీకోసమే.. గురువారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా బ్యాంకులు తెరిచి ఉంటాయా? లేదా మూతపడతాయా? అనే గందరగోళం నెలకొంది. సాధారణ బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే దానిపై కస్టమర్లలో కూడా ఆందోళన రేకితిస్తోంది.
ఇప్పటివరకూ ఆర్బీఐ అధికారిక బ్యాంకు సెలవు ప్రకటించనప్పటికీ బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐ సహా ఇతర బ్యాంకులు సమ్మె రోజున సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కానీ, బ్యాంకులకు మాత్రం సెలవు లేదని, ఎప్పటిలానే తెరిచి ఉంటాయని తెలిపాయి.
ఫిబ్రవరి 12న బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా? :
ఇప్పటివరకు, ఏ బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 12న అధికారిక బ్యాంకింగ్ సెలవు దినంగా ప్రకటించలేదు. బ్యాంకులు తెరిచి ఉంటాయని భావిస్తున్నారు. కానీ, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే బ్రాంచ్ స్థాయి సేవలు పాక్షికంగా అంతరాయం ఏర్పడవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), ఇండియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ముఖ్యంగా బ్రాంచులు, సర్వీసు కౌంటర్లలో సర్వీసులపై ప్రభావం ఉండొచ్చునని సూచించాయి. హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏం చెప్పింది? :
నివేదికల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BSE)కి అధికారిక సమాచారం ఇచ్చింది. శాఖలు, కార్యాలయాలు సజావుగా పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే, సమ్మె షెడ్యూల్ ప్రకారం కొనసాగితే కార్యకలాపాలపై ప్రభావం పడవచ్చని బ్యాంక్ పేర్కొంది. ఫిబ్రవరి 12న జరిగే బ్యాంకు సమ్మె సమయంలో కస్టమర్లు ఎలా ప్రభావితమవుతారు?
బ్యాంకు కౌంటర్లలో క్యాష్ డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్కు క్లియరెన్స్, పాస్‌బుక్ అప్‌డేట్స్ వంటి బ్రాంచ్ ఆధారిత బ్యాంకింగ్ సేవలలో కస్టమర్లు ఆలస్యం లేదా తాత్కాలిక అంతరాయాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
Read Also : Vivo V50 5G : వారెవ్వా.. వివో V50 5Gపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అందుకే తెగ కొనేస్తున్నారు భయ్యా.. ధర ఎంతంటే?
అలాగే, బ్రాంచ్‌లోని కస్టమర్ సర్వీసు అభ్యర్థనలకు అంతరాయం కలగవచ్చు. అయితే, ఏటీఎంలు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు వంటి డిజిటల్ బ్యాంకింగ్ ఛానెల్స్ సాధారణంగా పనిచేస్తాయని భావిస్తున్నారు.
సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్ యూనియన్లు ఇవే :
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) వంటి ప్రముఖ ఉద్యోగులు, అధికారుల సంస్థలు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లతో (CTUs) చేతులు కలిపాయి.
నవంబర్ 2025లో నోటిఫై చేసిన 4 కొత్త లేబర్ కోడ్‌లపై బ్యాంకు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ కొత్త లేబర్ కోడ్ అమల్లోకి రానున్నాయి. అయితే, ఈ కొత్త కోడ్‌లు కార్మికులకు వ్యతిరేకమని, కఠినమైన యూనియన్ రిజిస్ట్రేషన్ షరతులు, కార్మిక రక్షణలను బలహీనపరుస్తున్నాయని ట్రేడ్ యూనియన్లు వాదిస్తున్నాయి.
వారానికి 5 రోజుల పని డిమాండ్ :
చాలా కాలంగా లేబర్ కోడ్ కన్నా బ్యాంకు ఉద్యోగులు ఎక్కువగా పనిదినాలపై డిమాండ్ చేస్తున్నారు. వారానికి 5 రోజుల పని దినాలు (శనివారం సెలవు) కూడా డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి, పనిభారం మధ్య మెరుగైన పని-జీవిత సమతుల్యతకు వారానికి రెండు రోజుల సెలవు అవసరమని అంటున్నారు. ఇంకా, జీత వ్యత్యాసాలు, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వంటి అంశాలు సమ్మెకు ఆజ్యం పోశాయి.