Swiggy-Zomato Boycott : స్విగ్గీ, జొమాటో బ్యాన్.. రెస్టారెంట్ల సంచలనం.. ఈ డేట్ నుంచి ఇక..!
Swiggy-Zomato Boycott : బెంగళూరులోని 1,000కుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఆగస్టు 15 నుంచి స్విగ్గీ, జొమాటో రెండు ప్లాట్‌ఫారమ్‌లను బహిష్కరిస్తామని హెచ్చరించాయి.
- Sreehari A
- Updated on- July 29, 2026 / 04:29 PM IST
Swiggy-Zomato Boycott
- ఆగస్టు 15 నుంచి స్విగ్గీ, జొమాటోకు షాక్..?
- ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు భారీ ఎదురుదెబ్బ
- బెంగళూరులో 1,000కుపైగా రెస్టారెంట్ల బహిష్కరణ హెచ్చరిక
Swiggy-Zomato Boycott : ఫుడ్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలని అనుకుంటున్నారా? ఆగస్టు 15 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయడం కష్టమే.. ఎందుకంటే.. ఆ రోజు నుంచి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను రెస్టారెంట్లు బైకాట్ చేయనున్నాయి. ఎక్కడంటే బెంగళూరులో మాత్రమే.. గతకొన్నాళ్లుగా ఈ నగరంలోని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు, రెస్టారెంట్ యజమానులకు మధ్య వివాదం తీవ్రంగా మారింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి వ్యతిరేకంగా రెస్టారెంట్ యజమానులు గట్టి వైఖరి తీసుకున్నారు. తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో (Swiggy-Zomato Boycott) ఉన్న డిమాండ్లను త్వరలో నెరవేర్చకపోతే ఆగస్టు 15 తర్వాత స్విగ్గీని పూర్తిగా బహిష్కరిస్తామని రెస్టారెంట్ అసోసియేషన్ బహిరంగంగా హెచ్చరించింది.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల విధానాలు తమ వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని రెస్టారెంట్ యజమానులు తీవ్రఆరోపణలు చేశారు. కంపెనీలు వసూలు చేసే భారీ కమీషన్లు, ముందస్తు నోటీసు లేకుండా ఇచ్చే ఏకపక్ష డిస్కౌంట్లు, హిడెన్ ఛార్జీలతో లాభాలను భారీగా దెబ్బతీశాయి.
ఈ కోతల మధ్య రెస్టారెంట్‌ను నడపడం రోజురోజుకూ కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని 1,000కుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఆగస్టు 15 నుంచి స్విగ్గీ, జొమాటో రెండు ప్లాట్‌ఫారమ్‌లను బహిష్కరిస్తామని హెచ్చరించాయి. కమీషన్లు, అనుమతి లేకుండా అమలు చేస్తున్న డిస్కౌంట్లు, ఇతర ఛార్జీలతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రెస్టారెంట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రెస్టారెంట్ యజమానుల డిమాండ్లు.. :
వినియోగదారుల ఫిర్యాదుల పేరుతో ముందస్తు సమాచారం లేకుండానే పేమెంట్ల నుంచి డబ్బు కోత విధించడం, అనుమతి లేకుండా క్యాంపెయిన్ యాడ్స్ నిర్వహించి వాటి ఖర్చులను రెస్టారెంట్లపై మోపడం, అధిక కమీషన్లు వసూలు చేయడం వంటి కారణంగా రెస్టారెంట్ల అందే లాభాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 15లోగా స్విగ్గీ, జొమాటో నుంచి అధికారిక లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రెస్టారెంట్ సంఘాలు డిమాండ్ చేశాయి. కస్టమర్ ఫిర్యాదులపై ఆటోమేటిక్ రీఫండ్‌లను నిలిపివేయడం, ఆహారం రెడీ అయ్యాక క్యాన్సిల్ అయిన ఆర్డర్ల నష్టాన్ని రెస్టారెంట్లపై మోపొద్దని, అనుమతి లేకుండా డిస్కౌంట్లు లేదా యాడ్స్ ఛార్జీలు విధించకూడదని కోరాయి.
అలాగే ప్రతి నెల కోతలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని, పేమెంట్ సమస్యల పరిష్కారానికి ప్రతి రెస్టారెంట్‌కు ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశాయి.
లేదంటే పూర్తిగా బహిష్కరిస్తాం :
హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావు మాట్లాడుతూ.. స్విగ్గీ తమ పేమెంట్ల నుంచి ఏకపక్షంగా కోతలు విధించడం, అదనపు డిస్కౌంట్లు, యాడ్స్ ఛార్జీలను బలవంతంగా అమలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. చర్చల్లో సానుకూల ఫలితం వస్తే భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని, లేకపోతే స్విగ్గీతో పాటు జొమాటో సేవలను పూర్తిగా బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఒక రెస్టారెంట్ యాప్ ద్వారా రూ. 1,00,000 బిజినెస్ చేస్తే.. భారీమొత్తంలో కమీషన్లు, డిస్కౌంట్లు, ఇతర ఛార్జీల పేరుతో కట్ చేయగా చివరికి కేవలం రూ. 40,000 మాత్రమే మిగులుతాయని అన్నారు. ప్రస్తుత ఈ ఆచరణ సాధ్యం కాని సిస్టమ్ రెస్టారెంట్ యజమానులకు నష్టాలను కలిగిస్తుందని, పరోక్షంగా వినియోగదారులపై కూడా భారం పడుతుందని అంటున్నాయి.
