Narendra Modi Swadeshi : మోదీ చెప్పినట్టు బంగారం కొనడం, ఫారెన్‌లో పెళ్లిళ్లు మానేస్తే నిజంగా లాభమా?
Narendra Modi Swadeshi : ప్రధాని మోదీ చెప్పినట్టు బంగారం కొనడం మానేసి, విదేశాల్లో రిచ్ పెళ్లిళ్లు చేసుకోవడం మానేస్తే దేశానికి నిజంగా లాభమా? అసలు మోదీ స్వదేశీ పిలుపు వెనుక అసలు ఆర్థిక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- September 2, 2026 / 10:02 PM IST
Narendra Modi Swadeshi,
- ఫారెన్ వెడ్డింగ్‌కు బ్రేక్.. గోల్డ్ కొనుగోళ్లకు చెక్!
- మోదీ సూచన వెనుక అసలు ఆర్థిక లెక్క ఇదే
- బంగారం, విదేశీ టూర్లకు డబ్బు తగ్గిస్తే రూపాయి బలపడుతుందా?
- మోదీ ‘స్వదేశీ’ పిలుపు వెనుక ఆర్థిక కారణాలేంటి?
Narendra Modi Swadeshi : బంగారం కొనొద్దు.. విదేశాల్లో పెళ్లిళ్లు వద్దు.. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా చెబుతున్న మాట.. అసలు మోదీ ఎందుకు ఇలా అంటున్నారు? ఇప్పుడు ఇదే దేశంలో ఆర్థిక చర్చకు దారితీస్తోంది.
సాధారణంగా ఒక వ్యక్తి బంగారం కొనడం లేదా విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అది వారి వ్యక్తిగత నిర్ణయంగానే కనిపిస్తుంది. కానీ, కోట్లాది మంది ఒకేసారి ఇలాంటి (Narendra Modi Swadeshi) ఖర్చులు చేస్తే.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందనేది అక్షర సత్యం.. మరి మోదీ చెప్పినట్టు ఈ ఖర్చులను తగ్గిస్తే నిజంగానే భారత్‌కు లాభమా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తవానికి, భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడే దేశం. అందులో ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల్లో కీలక వాటా మనదే. ఇందుకోసం విదేశాలకు డాలర్లు చెల్లించాలి. అలాగే, విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం భారతీయులు ఖర్చు చేసే డబ్బు కూడా దేశం నుంచి బయటకు పోతోంది.
రూపాయిపై ఒత్తిడికి కారణం ఇదే :
ఇలాంటి విదేశీ చెల్లింపులు అలాగే పెరుగుతుంటే కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. తద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రూపాయిపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకుంటే డాలర్ డిమాండ్‌ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నదే ఈ వాదన వెనుక ఉన్న ఫైనాన్షియల్ లాజిక్.
ప్రస్తుతం భారత్ విదేశీ మారక నిల్వలు సుమారు 691.11 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగితే అప్పుడు ఈ పరిస్థితి వేగంగా మారుతుంది. చమురు దిగుమతుల బిల్లు పెరిగితే విదేశీ మారక నిల్వలపై అదనపు భారం పడుతుంది. అప్పుడు అనవసరమైన విదేశీ ఖర్చులను తగ్గించుకుంటే కొంతవరకు దీని ప్రభావం కూడా తగ్గుతుంది.
దేశంలోనే ఆ డబ్బును ఖర్చు చేస్తే :
మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. దేశీయ ఆర్థిక వ్యవస్థ మరిత బలపడాలంటే.. విదేశాల్లో పెళ్లి, టూర్ కోసం ఖర్చు చేసే డబ్బును మన దేశంలోనే ఖర్చు చేస్తే హోటళ్లు, ట్రావెల్ సంస్థలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, చిన్న వ్యాపారాలు, స్థానిక కళాకారులకు భారీగా ఆదాయం పెరుగుతుంది. అంటే.. డబ్బు దేశం బయటకు వెళ్లదు. దేశీయ మార్కెట్‌లోనే ఆ డబ్బు తిరుగుతుంది అనమాట. దీన్నే ‘వెడ్ ఇన్ ఇండియా’, డొమెస్టిక్ టూర్ అని చెప్పొచ్చు.
విదేశాలకు వెళ్లే డబ్బు పరిమాణం చిన్నదేం కాదు.. 2025–26లో ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద భారతీయ కుటుంబాలు దాదాపు 29 బిలియన్ డాలర్లను విదేశాలకు పంపాయి. కేవలం జూన్ నెలలో టూర్ల కోసం వెళ్లిన మొత్తం సుమారు 1.3 బిలియన్ డాలర్లు. ఇందులో కొంత మొత్తమైనా దేశంలోనే ఖర్చైతే దేశీయ వ్యాపారాలకు అదనపు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇది లాభమే కాదు.. నష్టం కూడా :
అయితే. ఇది ఒకవైపు లాభమే కాదు. మరోవైపు నష్టం కూడా ఉండొచ్చు. బంగారం కొనుగోళ్లను ఒక్కసారిగా తగ్గిస్తే.. జ్యువెలరీ రంగంపై ప్రభావం పడొచ్చు. మోదీ వ్యాఖ్యల తర్వాత టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి ఆభరణాల కంపెనీల షేర్లు 4.5శాతం వరకు పడిపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
మరో ముప్పు కూడా లేకపోలేదు.. అధికారిక మార్గాల్లో బంగారం కొనుగోళ్లను అదేపనిగా అడ్డుకుంటూ పోతే.. బంగారం డిమాండ్ పూర్తిగా మాయం కాదు.. ఇంకా అక్రమ దిగుమతుల వైపు మళ్లే అవకాశం పెరుగుతుంది. అధికారిక మార్కెట్‌ను తీవ్రంగా అణిచివేయొద్దు. అలా చేస్తే భారత్‌లో అక్రమ బంగారం ప్రవాహం 100 టన్నులు దాటే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ హెచ్చరించింది.
7.8% growth.
Strong numbers.
Even stronger confidence. pic.twitter.com/ZVPpnAXrVU
— Narendra Modi (@narendramodi) September 1, 2026
విదేశీ ఖర్చులు తగ్గించుకుంటే.. :
అందుకే ఇక్కడ ‘బంగారం కొనకూడదు, విదేశాలకు వెళ్లకూడదు’ అనేది కాదు. అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించి, సాధ్యమైన చోట దేశీయ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం వల్ల రూపాయి బయటకు వెళ్లకుండా కొంతవరకు తగ్గించవచ్చు. అదే సమయంలో దేశీయ వ్యాపారాలు, ఉద్యోగాలు, పర్యాటక రంగానికి కూడా అనుకూలంగా మారుతుంది.
ఇక ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడం సానుకూల సంకేతంగా చెప్పొచ్చు. అయితే, ప్రపంచ సరఫరా అంతరాయాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు వంటి సవాళ్లు ముందున్నాయి.
ఈ నేపథ్యంలో మోదీ పిలుపును కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ కోణంలో చూడటం కన్నా ప్రపంచ అనిశ్చితి వేళ దేశీయ ఖర్చులను పెంచి విదేశీ మారక వనరులను కాపాడుకునే ఆర్థిక వ్యూహంగా చూడాలి. ప్రపంచం ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మన ఖర్చే మన ఆర్థిక బలంగా నిలుస్తుంది.
