Gold Price Drop : బంగారం కొనేవాళ్లకు శుభవార్త.. వారంరోజుల్లో భారీగా తగ్గనున్న రేట్లు..! కారణం ఇదే..
Gold Price : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే, మీకు శుభవార్త. రాబోయే వారంపది రోజుల్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- August 27, 2026 / 05:31 PM IST
Gold Price Drop
Gold Price Drop : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే, మీకు శుభవార్త. రాబోయే వారంపది రోజుల్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయంగా పసిడి ధరలు తగ్గుతాయని పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోందని సమాచారం. ప్రస్తుతం బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15శాతంగా ఉంది. దీనిని తగ్గించాలని బులియన్ ట్రేడర్లు, జ్యువెలరీ పరిశ్రమ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సుంకాన్ని 6శాతానికి తగ్గించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
విదేశీ మారకపు ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు, బంగారం, వెండి కొనుగోళ్లను తగ్గించేందుకు వాటిపై దిగుమతి సుంకాన్ని 6శాతం నుంచి 15శాతం వరకు పెంచుతూ ఈ ఏడాది మే13న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల అంతర్జాతీయ విపణికి, దేశీయ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం అధికమై.. ఈ లోహాలను దొంగచాటుగా తేవడం (స్మగ్లింగ్) పెరిగిందని గుర్తించారు. దేశీయంగా విక్రయానికి మరో 3శాతం జీఎస్టీ కూడా పడుతోంది. ఈ నేపథ్యంలోనే బిల్లు లేకుండా తక్కువకు విక్రయిస్తామంటూ బేరాలు సాగిస్తున్న మోసగాళ్లూ పెరిగారు.
బిల్లు లేకుండా ఆభరణాలు కొనుగోలు చేస్తే, తరువాత వాటిల్లో లోహ స్వచ్ఛత తక్కువగా ఉన్నా.. ఫిర్యాదు చేసే పరిస్థితి కొనుగోలుదారులకు ఉండదు. ఇది తెలిసినా వారు అధికంగా మోసపోతున్నారు. ఇవన్నీ నివారించాలంటే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని మళ్లీ 6శాతానికి తేవాలని ట్రేడర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం ఉందన్న సమాచారంతో కొద్దిరోజులుగా గోల్డ్ విక్రయాలు తగ్గినట్లు మార్కెట్ల వర్గాల సమాచారం. ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే .. బంగారం దిగుమతి వ్యయం ఒక్కసారిగా తగ్గుతుంది. దీంతో ప్రస్తుతం అధిక సుంకంతో కొనుగోలు చేసిన స్టాక్‌ను కలిగిఉన్న డీలర్లు కూడా ధరలను తగ్గించాల్సిన పరిస్థితి రావొచ్చు. బంగారం ధరలు కూడా తగ్గుతాయి.
అయితే, వారంపదిరోజుల్లో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుంకం తగ్గిస్తే దేశీయ బంగారం ధరల్లో మరోసారి భారీ మార్పు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిర్ణయం వాయిదా పడితే ప్రస్తుత ధరల ధోరణి కొనసాగవచ్చు.
