Digital Gold : డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? కేంద్రం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఇవే!
Digital Gold : దేశంలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్న డిజిటల్ గోల్డ్‌కు నియంత్రణలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.
- Harish Thanniru
- Published on- September 18, 2026 / 11:07 AM IST
Digital Gold
Digital Gold : బంగారంలో పెట్టుబడులకోసం చాలామంది ఇటీవల కాలంలో డిజిటల్ గోల్డ్‌పై (Digital Gold) ఆధారపడుతున్నారు. ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా, ఇంటి నుంచే కొనుగోలుకు అవకాశం ఉండడంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. చిన్న మొత్తాలతో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో సామాన్య వినియోగదారుల్లో దీనికి ఆదరణ పెరిగింది. సగటు లావాదేవీ విలువ సుమారు రూ.100గా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
దేశంలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్న డిజిటల్ గోల్డ్‌కు నియంత్రణలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. డిజిటల్ గోల్డ్‌లోని ప్రతి యూనిట్‌కు సమాన విలువైన భౌతిక బంగారం (Physical Bullion) ఉండేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ రంగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంయుక్త పర్యవేక్షణలోకి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి.. భౌతిక బంగారంలో పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది. అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రణ పరిధిలోకిరావు. ప్రస్తుత చట్టాల ప్రకారం అవి సెక్యూరిటీలు గానీ, కమోడిటీ డెరివేటివ్‌లు కావు కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదు. అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయి. అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారుల రక్షణ విధానాలు ఏవీ వర్తించవు. ప్రస్తుతం దేశంలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్న డిజిటల్ గోల్డ్ పెట్టుబడులను సెబీ, ఆర్బీఐ బ్యాంక్ పరిధిలోకి తీసుకొచ్చేలా కేంద్రం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
డిజిటల్ గోల్డ్‌పై నిబంధనలను కఠినతరం చేసే అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే నియంత్రణ సంస్థలు, బ్యాంకులు, ఇతర భాగస్వాములతో అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. డిజిటల్ గోల్డ్‌ను సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) చట్టం 1956 పరిధిలో సెక్యూరిటీగా గుర్తించే అంశంపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ మార్కెట్‌లో దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియంత్రణలు అమల్లోకి వస్తే డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే వినియోగదారులకు పారదర్శకత, భౌతిక బంగారం నిల్వకు సంబంధించిన స్పష్టత, నియంత్రణ పర్యవేక్షణ వంటి అంశాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే, తుది నిబంధనలు ఎలా ఉంటాయన్నది ప్రభుత్వం, ఆర్బీఐ, సెబీ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
