Cost of Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై క్లారిటీ ఇచ్చిన నితిన్ గడ్కరీ!

ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయా? రాబోయే ఏళ్లల్లో పెట్రోల్ వాహనాల స్థాయిలోనే ఈవీ వాహనాల ధరలు ఉండబోతున్నాయా? అంటే అవకాశం ఉందనే అంటున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.

Cost Of Electric Vehicles Will Be On A Par With Petrol Variants In 2 Years

Cost of Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయా? రాబోయే ఏళ్లల్లో పెట్రోల్ వాహనాల స్థాయిలోనే ఈవీ వాహనాల ధరలు ఉండనున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇవే సంకేతాలను ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) ధర పెట్రోల్ వాహనాల స్థాయికి చేరనున్నట్టు మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వేరియెంట్లతో సమానంగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఈవీలపై GST కేవలం 5% మాత్రమే ఉంది. లిథియం అయాన్ బ్యాటరీల ఖర్చు కూడా క్రమంగా తగ్గుతోంది. పెట్రోల్ పంపులతో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందని గడ్కరీ ఒక ప్రకటనలో వెల్లడించారు. డెన్మార్క్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై ది సస్టైనబిలిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ అన్నారు.

ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఊపందుకుందని చెప్పారు. పెట్రోల్ వాహనం కిలోమీటరు ప్రయాణించడానికి రూ.10 ఖర్చు అయితే.. డీజిల్ వాహనం కిలోమీటరు ప్రయాణించడానికి రూ.7 ఖర్చు అవుతుంది. ఈవీలు కిలోమీటరు ప్రయాణించడానికి రూ. ఒక ఖర్చు మాత్రమే అవుతుందని అన్నారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల(EV) సేల్స్ ప్రైవేట్ కార్ల అమ్మకాలలో 30శాతం, వాణిజ్య వాహనాల అమ్మకాలలో 70శాతం, బస్సుల అమ్మకాలలో 40శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలలో 80శాతం చేరుకోవడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం దేశంలో 2/3 ఎలక్ట్రిక్-కార్ వేరియంట్ల ధర రూ. 15లక్షల కంటే తక్కువగానే ఉంది. కేంద్రం సబ్సిడీ అందించడంతో ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలు, త్రివీలర్ వాహనాల ధర ప్రస్తుత పెట్రోల్ వాహనాలతో సమానంగా ఉందని ఆయన తెలిపారు.

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో ఎలక్ట్రిక్ హైవే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పైలట్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్టు గడ్కరీ వెల్లడించారు. ఇక్కడి ప్రాంతంలో సమృద్ధిగా సౌర శక్తి శక్తిని వినియోగించుకుని విద్యుదీకరణ చేసేందుకు వీలుంది. అంతేకాదు.. పెట్రోల్ స్టేషన్లలోనే ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) 2023 నాటికి దేశంలోని హైవేలలో కనీసం 700 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలను రూపొందించింది. ప్రతి 40-60 కిలోమీటర్లకు ఒక షార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.

సౌరశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో స్టోర్ చేయడంపై కేంద్రం కూడా దృష్టి సారించిందని కేంద్ర మంత్రి తెలిపారు. అతి త్వరలోనే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కూడా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ-స్కూటర్లు, ఈ-కార్ట్ లు, ఈ-ఆటోలు, ఈ-సైకిళ్లు వంటి చిన్న బ్యాటరీతో నడిచే వాహనాలకు దేశంలో భారీగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే వరుసగా 145%, 190% పెరుగుదలను చూశాయన్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో భారత్ ఎగుమతిదారుగా మారే అవకాశం ఉందని మంత్రి గడ్కరీ అభిప్రాయపడ్డారు.
Read Also : Google Drive: గూగుల్ డ్రైవ్‌లో సరికొత్త ఫీచర్.. చిటికెలో మీ ఫైల్స్‌ గుర్తుపట్టొచ్చు!