అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, అలాగే వాణిజ్య సుంకాలపై అనిశ్చితి నెలకొనడం, డాలర్ బలహీనత వంటి అంశాల వలన అంతర్జాతీయంగా ఇవాళ బంగారం ధర దాదాపు $2,900 (ఔన్సుకి)తో స్థిరంగా కొనసాగింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించడం వల్ల ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడే అవకాశం ఉండడంతో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.
డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల వల్ల అమెరికా, చైనా, మెక్సికో, కెనడా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగుతున్నాయి. కొత్త టారిఫ్ లు విధించడంతో అంతర్జాతీయ వ్యాపారం ప్రభావితమవుతోంది, ఇది పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడులవైపు మళ్లించేలా చేస్తుంది.
తాజా ADP ఉద్యోగ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరిలో అమెరికాలో కేవలం 77,000 కొత్త ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి, కానీ అంచనాల ప్రకారం 140,000 ఉద్యోగాలు రావాల్సింది. ఇది ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందనే సంకేతాన్ని ఇస్తుంది. తద్వారా ఫెడ్ వడ్డీ రేట్ల కోతకు మరింత ప్రాధాన్యం పెరుగుతోంది. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడుతుందని బంగారం ధర పెరగడానికి కారణమవుతుందని తెలిసిన విషయమే.
ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధ భయాలను పెంచి బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెట్టుబడిదారుల దృష్టి రాబోయే అమెరికా ఉద్యోగ డేటా (Non-Farm Payrolls – NFP Report) మీద ఆధారపడి ఉంది.
ఇది అమెరికా ఆర్థిక స్థితిగతులపై స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. ఈ నివేదిక ప్రభావం ఆధారంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం మారవచ్చు. దీనివల్ల బంగారం, వెండి ధరలు ప్రభావితమవుతాయని నిపుణులు అంటున్నారు.
NFP డేటా ప్రభావం ఎలా ఉంటుందంటే?
ఎక్కువ మంది ఉద్యోగాల్లో చేరితే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే సంకేతాన్ని ఇస్తుంది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గి డాలర్ బలపడుతుంది. అప్పుడు బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగ డేటా బలంగా ఉందని అంటారు.
అదేవిధంగా అనుకున్నంత స్థాయిలో ప్రజలు ఉద్యోగాల్లో చేరకపోతే డాలర్ బలహీనపడి బంగారం, వెండి ధరలు పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ మేము చెప్పదలచుకున్నది ఏంటంటే అమెరికాలో చేసే ఉద్యోగులపై కూడా బంగారం రేటు ప్రభావం ఉంటుంది.