Gold Hallmarking Fee Hiked : బంగారం కొనేవారికి బిగ్ షాక్.. కొత్త రూల్స్ వచ్చాయ్! పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Gold Hallmarking Fee Hiked : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కీలక అప్డేట్ వచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఫీజును భారీగా పెంచింది.
- Harish Thanniru
- Updated on- September 17, 2026 / 06:02 PM IST
Gold Hallmarking Fee Hiked
Gold Hallmarking Fee Hiked : బంగారం ధర భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్ రేట్లు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, చాలామంది రాబోయే దసరా, దీపావళి పండుగుల సీజన్‌లో బంగారం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.. అలాంటి వారికి మరో షాకింగ్ న్యూస్. ప్రభుత్వం బంగారు ఆభరణాల హాల్ మార్కింగ్ ఛార్జీలను పెంచేసింది. ఈ కొత్త రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చేశాయి. ఈ భారీ పెరుగుదలతో బంగారాన్ని హాల్ మార్క్ చేయించుకోవడం ఖరీదైపోయింది.
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కీలక అప్డేట్ వచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఫీజును భారీగా పెంచింది. ఇప్పటివరకు ఒక్కో బంగారు ఆభరణానికి రూ.45గా ఉన్న హాల్‌మార్కింగ్ ఫీజును రూ.75కు పెంచింది. అంటే ఒక్కో ఆర్టికల్‌పై రూ.30 (దాదాపు 67శాతం) పెరుగుదల నమోదైంది. కొత్త రేట్లు 2026 సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, కొత్త నిబంధనల ప్రకారం.. బంగారు ఆభరణాలకు మాత్రమే హాల్‌మార్కింగ్ ఫీజు పెరిగింది. వెండి ఆభరణాలకు ఒక్కో ఆర్టికల్‌కు రూ.35గా ఉన్న ఫీజులో ఎలాంటి మార్పు చేయలేదు. వెండి ఆభరణాలపై కనీస కన్సైన్‌మెంట్ ఛార్జీ రూ.150గా కొనసాగుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రంకు బంగారు ఆభరణాలను పంపినప్పుడు ఒక్కో ఆర్టికల్‌కు రూ. 75 చెల్లించాలి. అయితే ఒక్కో కన్సైన్‌మెంట్‌కు కనీస ఛార్జీ రూ.200గా ఉంటుంది. అందువల్ల ఒకే ఆభరణాన్ని హాల్‌మార్కింగ్‌కు పంపితే కేవలం రూ.75 మాత్రమే కాకుండా కనీస కన్సైన్‌మెంట్ ఛార్జీ వర్తించవచ్చు. ఇక్కడే వినియోగదారులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. హాల్‌మార్కింగ్ ఫీజు రూ.45 నుంచి రూ.75కు పెరిగినప్పటికీ.. ప్రతి బంగారు ఆభరణంపై వినియోగదారుడి బిల్లులో తప్పనిసరిగా రూ.30 అదనంగా వసూలు చేయాలనే నిబంధన లేదు. ఈ 75 రూపాయలను నగల వ్యాపారులు గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రాలకు చెల్లిస్తారు. పెరిగిన వ్యయాన్ని వ్యాపారి స్వయంగా భరించవచ్చు లేదంటే ఆభరణం మొత్తం ధరలో భాగంగా పరిగణించవచ్చు. అందువల్ల హాల్‌మార్కింగ్ ఫీజు పెరిగిందని చెప్పి ప్రతి ఆభరణంపై కచ్చితంగా రూ.30 అదనంగా చెల్లించాల్సిందేనని భావించాల్సిన అవసరం లేదు. ఆభరణం ధరలో బంగారం మార్కెట్ ధర, మేకింగ్ ఛార్జీలు, పన్నులు తదితర అంశాలు కూడా ఉంటాయి.
పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న సమయంలో హాల్‌మార్కింగ్ ఫీజు పెంపు అమల్లోకి రావడం వల్ల ఈ అంశం ప్రస్తుతం బంగారం కొనుగోలుదారుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పెంపు మొత్తం ఆభరణం ధరపై ఎంత ప్రభావం చూపుతుందనేది ఆయా నగల వ్యాపారులు పెరిగిన ఖర్చును ఎలా పరిగణిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
హాల్‌మార్కింగ్ ఎందుకు ముఖ్యం?
బంగారం స్వచ్ఛతను నిర్ధారించేందుకు హాల్‌మార్కింగ్ ఉపయోగపడుతుంది. హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణంపై సాధారణంగా బీఐఎస్ గుర్తు, బంగారం స్వచ్ఛత/క్యారెట్ వివరాలు, ఆరు అంకెల HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబర్ ఉంటాయి. ఆభరణం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఈ వివరాలను పరిశీలించడం ద్వారా బంగారం స్వచ్ఛత, గుర్తింపును చెక్ చేసుకోవచ్చు.
