Gold Imports : బంగారం కొంటున్నారా? కేంద్రం నిర్ణయంతో భారీ మార్పు.. 30శాతం తగ్గాయి.. మార్కెట్ లెక్కలు ఇవే..
Gold Imports Fall 30Percent : బంగారం కొనుగోళ్లను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయి.
- Harish Thanniru
- Published on- September 8, 2026 / 09:48 AM IST
Gold Imports Fall 30Percent
Gold Imports Fall 30Percent : బంగారం కొనుగోళ్లను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. భారీగా పెంచిన దిగుమతి సుంకాల కారణంగా దేశీయంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే ఎక్కువగా ఉండటం.. మరోవైపు వినియోగదారుల డిమాండ్ తగ్గుతుండటంతో దిగుమతులు కూడా క్రమంగా పడిపోతున్నాయి. అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో మళ్లీ దిగుమతులు పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశంలోకి భారీగా బంగారం దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచింది. ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పిలుపునిచ్చారు. అయితే, దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం ప్రధాని పిలుపు కంటే దిగుమతి సుంకాల పెంపే అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మెటల్స్ ఫోకస్ సంస్థ గణాంకాల ప్రకారం.. గత ఏడాది మే నెలలో భారత్ 30.6 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది మే నెలలో 4శాతం తగ్గి 29.4 టన్నులకు చేరింది. జూన్ నెలలో 20శాతం, జులై నెలలో 23.7శాతం, ఆగస్టు నెలలో 30శాతం తగ్గుదల చోటు చేసుకుంది. సెప్టెంబర్ నెలలో కూడా బంగారం దిగుమతులు 15శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ అంచనా వేసింది.
బంగారం దిగుమతులపై సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం దిగుమతుల తగ్గుదలకు ప్రధాన కారణంగా మారిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సుంకాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే దేశీయంగా బంగారం ధరలు మరింత అధికంగా మారాయి. దీంతో వినియోగదారులు బంగారం కొనుగోళ్ల విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. డిమాండ్ తగ్గడంతో దిగుమతుల పరిమాణం కూడా తగ్గుతోంది.
ప్రస్తుతం దిగుమతులు తగ్గుతున్నప్పటికీ.. రానున్న నెలల్లో పరిస్థితి మారే అవకాశం ఉందని బులియన్, జ్యువెలరీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వరుసగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ రావడంతో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భారీగా దిగుమతి సుంకాల కారణంగా దేశంలోకి అక్రమ మార్గాల్లో బంగారం స్మగ్లింగ్ పెరుగుతోందని ఆభరణాల పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ కూడా రాసినట్లు సమాచారం.
సుంకాలు అధికంగా ఉండటం వల్ల అధికారిక మార్గంలో బంగారం దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. దీంతో అక్రమ మార్గాల్లోకి బంగారం మళ్లే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, త్వరలోనే బంగారం ధరలపై సుంకాల భారాన్ని తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. దేశీయ అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారానే తీరుతుంది. భారత్ ఏటా సుమారు 700 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు పరిశ్రమ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలోని ప్రజల వద్ద ఇప్పటికే దాదాపు 31,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ఈ భారీ బంగారం నిల్వలను ఉత్పాదక కార్యకలాపాలకు ఉపయోగించేలా చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
