Union Budget 2026 ( Image Credit to Original Source)
Union Budget 2026 : వార్షిక బడ్జెట్ 2026కు కౌంట్ డౌన్ మొదలైంది.. 2026-27 కేంద్ర బడ్జెట్ సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ హల్వా వేడుక నేడు (జనవరి 27న) ఆర్థిక మంత్రిత్వ శాఖలో జరుగుతుంది. బడ్జెట్ తయారీలో పాల్గొన్న సీనియర్ అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
హల్వా వేడుక కేవలం స్వీట్లు పంపిణీ చేయడమే కాదు.. బడ్జెట్ ప్రక్రియకు సంబంధించి అన్నింటిని అత్యంత గోప్యంగా ఉంచుతారు. హల్వా వేడుక తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్ల తయారీలో నేరుగా పాల్గొన్న అధికారులంతా లాక్-ఇన్ పీరియడ్‌లోకి వెళతారు. ఈ కాలంలో దాదాపు 60 మంది నుంచి 70 మంది అధికారులు, ఉద్యోగులు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు ఉండవు. వారు ఇంటికి కూడా వెళ్లలేరు. బయట ఎవరినీ సంప్రదించలేరు.
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ ఫోన్ల వాడకం కూడా పరిమితంగా ఉంటుంది. పన్ను మార్పులు లేదా వ్యయ నిర్ణయాలు వంటి బడ్జెట్‌కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమాచారం ముందుగానే లీక్ కాకుండా నిరోధించేందుకు ఇలా చేస్తారు అనమాట.
ఈ ఏడాదిలో 2026-27 కేంద్ర బడ్జెట్ నియంత్రణ సడలింపు, ఆర్థిక వృద్ధిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్టుబడి, తయారీ, ఎగుమతులను పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అధికారుల ప్రకారం.. బడ్జెట్‌లో ఆమోద ప్రక్రియ కోసం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే చర్యలు ఉండవచ్చు.
హల్వా వేడుకతో బడ్జెట్‌కు సంబంధించి అన్ని వివరాలను సీక్రెట్‌గా లాక్ చేస్తారు. గతంలో, బడ్జెట్ డాక్యుమెంట్లు పూర్తిగా ఫ్రింట్ చేసేవారు. కాబట్టి లాక్-ఇన్ వ్యవధి ఎక్కువ కాలం ఉండేది. ఇప్పుడు, చాలా పనులు డిజిటల్‌గా చేస్తుండటంతో ఈ లాన్ ఇన్ వ్యవధి కొంతవరకు తగ్గింది.
దేశీయ సంప్రదాయం ప్రకారం.. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని స్వీట్లతో ప్రారంభించడం శుభప్రదం. హల్వా వేడుక కూడా ఈ సంప్రదాయంలో ఒక భాగమే. పరిపాలనాపరంగా, బడ్జెట్‌పై అన్ని చర్చలు పూర్తయ్యాయని, డాక్యుమెంట్ ఖరారు అయిందని అర్థం. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే మిగిలి ఉంది.