Hyderabad: దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లలో బిల్లుల కోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను వాడారు. దాని సాయంతో ఆరేళ్లుగా భారీగా పన్నుల ఎగవేతకు పాల్పడ్డారు.
మొదట హైదరాబాద్‌లో బయటపడిన ఈ మోసం వెనుక ఉన్న గుట్టును విప్పుకుంటూ పోతే అహ్మదాబాద్‌లో దాని మూలాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. లక్షకు పైగా రెస్టారెంట్లు.. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ సాయంతో మొత్తం కలిపి రూ.70 వేల కోట్ల అమ్మకాలకు పన్నులు ఎగవేశాయని తేల్చారు.
మనం రెస్టారెంట్లలో కట్టే బిల్లులో పన్ను సొమ్ము కూడా ఉంటుంది. ఆ పన్నును రెస్టారెంట్లు న్యాయంగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ పన్ను ఎగవేత కోసం ఆయా రెస్టారెంట్లు అమ్మకాలను 20-30 శాతం తక్కువగా చూపిస్తున్నాయి. కస్టమర్లు యూపీఏ ద్వారా చేసే చెల్లింపులకు కూడా రోజుకి ఒక క్యూఆర్ కోడ్‌ను రెస్టారెంట్లు వాడాయి.
Also Read: మండలిలో ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఛైర్మన్ టేబుల్‌పై పడేసిన వైసీపీ సభ్యులు.. రచ్చ రచ్చ
గత ఏడాది నవంబరులో హైదరాబాద్‌లో కొన్ని రెస్టారెంట్లపై సాధారణ దాడులతో ప్రారంభమైన అధికారుల సోదాలు.. దేశవ్యాప్తంగా భారీ పన్ను ఎగవేత రాకెట్‌ను బయటపెట్టాయి.
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 133ఏ (పన్ను శాఖ తనిఖీలు నిర్వహించే అధికారం ఇచ్చే నిబంధన) కింద జరిగిన విచారణలో 2019-20 నుంచి 2025-26 వరకు 6 ఆర్థిక సంవత్సరాలకు చెందిన దాదాపు 60 టెరాబైట్ల లావాదేవీ డేటాను విశ్లేషించారు.
అధికారులు తెలిపిన ప్రకారం ఈ సాఫ్ట్‌వేర్‌ను లక్షకు పైగా రెస్టారెంట్లు వినియోగిస్తున్నాయి. ఇది భారత రెస్టారెంట్ మార్కెట్‌లో సుమారు 10 శాతం వాటాను కలిగి ఉంది.
రూ.2.43 లక్ష కోట్ల బిల్లింగ్ విశ్లేషణ
బ్యాక్‌ఎండ్ విశ్లేషణలో మొత్తం బిల్లింగ్ సుమారు రూ.2.43 లక్ష కోట్లు అని తేలింది. ఇందులో రూ.13,317 కోట్లను పోస్ట్ బిల్లింగ్ డిలీషన్స్‌గా గుర్తించారు. అంటే బిల్లింగ్ తర్వాత అమ్మకాల డేటాను వ్యవస్థాబద్ధంగా మార్చారన్నమాట.
ఫోరెన్సిక్ పరిశీలన హైదరాబాద్‌లోని ఆయకర్ భవన్ డిజిటల్ ల్యాబ్‌లో జరిగింది. సాఫ్ట్‌వేర్ సంస్థ అహ్మదాబాద్ కేంద్రంలో బ్యాక్‌ఎండ్ యాక్సెస్ పొందిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టారు.
దర్యాప్తు అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 1.77 లక్ష రెస్టారెంట్ ఐడీలకు చెందిన డేటాను పరిశీలించారు. ఓపెన్ సోర్స్ సమాచారం ఆధారంగా జీఎస్టీ నంబర్లు (వస్తు సేవల పన్ను గుర్తింపు సంఖ్య) అలాగే పాన్ నంబర్లు మ్యాప్ చేశారు.