India Gold Demand 2026 : మోదీ పిలుపు ఎఫెక్ట్.. భారత్‌లో బంగారం డిమాండ్‌ తగ్గింది.. కానీ, రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. కారణాలివే..

India Gold Demand 2026 : భారత్‌లో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది.

india gold demand falls 6 percent

India Gold Demand 2026 : భారత్‌లో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది. అధిక ధరలు, కస్టమ్స్ సుంకం పెంపు, అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇందుకు ప్రధాన కారణాలని తెలిపింది. అయితే కొనుగోళ్ల విలువ మాత్రం రికార్డు స్థాయికి చేరడం విశేషం.

Also Read : TTD : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.. లేదంటే డబ్బులు పోయినట్లే..

భారత్‌లో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 6శాతం తగ్గి 131.4 టన్నులకు చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తన ‘Q2 2026 Gold Demand Trends’ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో డిమాండ్ 139.7 టన్నులుగా నమోదైంది. అధిక బంగారం ధరలు, కస్టమ్స్ సుంకం పెంపు, సీజనల్‌గా కొనుగోళ్లు తగ్గడం, అలాగే అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు డబ్ల్యూజీసీ తెలిపింది.

బంగారం డిమాండ్ తగ్గినా, బంగారం కొనుగోళ్ల మొత్తం విలువ మాత్రం రికార్డు స్థాయికి చేరింది. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం కొనుగోళ్ల విలువ రూ.1,98,100 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,32,500 కోట్లు మాత్రమే ఉండగా, ఈసారి సుమారు 50 శాతం పెరుగుదల నమోదైంది. అధిక ధరలున్నప్పటికీ భారతీయులు బంగారంపై ఆసక్తి కొనసాగిస్తున్నారని డబ్ల్యూజీసీ ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ తెలిపారు.

సమీక్షా త్రైమాసికంలో నగల డిమాండ్ 15శాతం తగ్గి 75.1 టన్నులకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 88.8 టన్నులుగా ఉంది. అధిక ధరలు, కస్టమ్స్ డ్యూటీ పెంపు, ప్రధాని మోదీ పిలుపు నగల కొనుగోళ్లపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది. మరోవైపు పెట్టుబడి కోణంలో బంగారం కొనుగోళ్లు మాత్రం పెరిగాయి. బార్‌లు, నాణేల రూపంలో పెట్టుబడులు 9 శాతం పెరిగి 50.3 టన్నులకు చేరాయి. అలాగే భారత గోల్డ్ ఈటీఎఫ్‌లలో 4.2 టన్నుల నికర పెట్టుబడులు నమోదయ్యాయి.

కస్టమ్స్ సుంకం పెరగడంతో అక్రమంగా బంగారం దేశంలోకి వచ్చే అవకాశాలు పెరిగాయని డబ్ల్యూజీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అక్రమ బంగారం మార్కెట్‌లోకి వస్తోందనే సమాచారం అందుతోందని, దీనిపై రాబోయే త్రైమాసికాల్లో నిశితంగా పరిశీలిస్తామని సచిన్ జైన్ తెలిపారు.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్‌లో రీసైకిల్ చేసిన బంగారం 17 శాతం తగ్గి 19.2 టన్నులకు చేరింది. అలాగే బంగారం దిగుమతులు 23 శాతం తగ్గి 98.1 టన్నులుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 127.4 టన్నులుగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది మొత్తం బంగారం డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉండే అవకాశముందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ పెరిగే అవకాశమున్నప్పటికీ, ధరల ప్రభావం కొనుగోళ్లపై కొనసాగవచ్చని పేర్కొంది.