Stock Market Crash : మార్కెట్లకు మళ్లీ చమురు సెగ.. ఒక్కరోజే రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి..!

India Stock Market Crash : చమురు ధరల పెరుగుదల, హర్మూజ్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 1,124 పాయింట్లు, నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయాయి.

Indian Stock Market Crash as Crude Oil Surge Falls 1124 Points

  • భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 360 పాయింట్లు తగ్గి 22780 వద్ద ముగిసిన నిఫ్టి
  • దాదాపు రూ. 8 లక్షల కోట్లు ఆవిరి
  • 1,124 పాయింట్లు తగ్గి 72,771 దగ్గర ముగిసిన సెన్సెక్స్

Stock Market Crash : దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 28న) భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు మార్కెట్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్మూజ్‌ జలసంధిని తెరిచే శాంతి ప్రతిపాదనలను తిరస్కరించినట్లు వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 108 డాలర్లకు చేరడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,734.83 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ముగింపు 73,895.74 పాయింట్లతో పోలిస్తే ప్రారంభంలోనే ఒత్తిడి కనిపించింది. రోజంతా నష్టాల్లోనే కదిలిన సూచీ ఇంట్రాడేలో 72,716.23 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

చివరకు 1,124.02 పాయింట్లు కోల్పోయి 72,771.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించింది. 360.25 పాయింట్లు పతనమై 22,780.25 వద్ద ముగిసింది. దీంతో కీలకమైన 23 వేల మార్కుకు దిగువన స్థిరపడింది.

Read Also : New Toll System : నో బూత్.. నో వెయిటింగ్.. సెకన్లలో టోల్ పేమెంట్.. కొత్త విధానం ఇదే.. ఇక జర్నీ మరింత ఫాస్ట్!

మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ వాల్యూ ఒక్కరోజులో దాదాపు రూ.8 లక్షల కోట్లు తగ్గి రూ.474 లక్షల కోట్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు, బాండ్ల రాబడులు పెరగడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.

సెన్సెక్స్‌ 30లో ఇన్ఫోసిస్‌ మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.03గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఔన్సు 4,154 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.