Intel layoffs
intel Layoffs: మైక్రోసాప్ట్‌లో ఇటీవల చేపట్టిన 15వేల మందికిపైగా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల సమర్థించుకున్నారు. అయితే, ఎంతో కష్టంగా, తీవ్రమైన ఒత్తిడిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7శాతం మందికి ఇటీవల లేఆఫ్ ప్రకటించింది. 2014 తరువాత మైక్రోసాప్ట్ లో ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. తాజాగా.. మైక్రోసాప్ట్ బాటలో చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్ పయనిస్తోంది.
ఈ ఏడాది చివరి వరకు 25వేల ఉద్యోగాలను తొలగించాలని ఇంటెల్ సంస్థ యోచిస్తోంది. కొత్త సీఈవోగా లిప్-బు టాస్ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి ప్రధాన నిర్ణయాల్లో ఇది ఒకటి. 2024 చివరి నాటికి ఇంటెల్, దాని అనుబంధ సంస్థల్లో 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 25వేలకుపైగా మంది ఉద్యోగులను తొలగించడం ద్వారా తమ ఉద్యోగుల సంఖ్య 75వేలకు పరిమితం అవుతుందని సంస్థ భావిస్తుంది.
ఏప్రిల్ 2025 నుంచి ఇంటెల్ ఇప్పటికే సుమారు 15వేల మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, ఈ ఏడాది చివరి నాటికి 25వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముగించాలని సంస్థ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించడం ద్వారా వ్యయాలు భారీగా తగ్గించుకోవచ్చని, ఇటీవలి నష్టాల నుంచి కోలుకోవచ్చునని సంస్థ ఆలోచనగా తెలుస్తోంది.
మరోవైపు.. ఖర్చు తగ్గించే చర్యలలో భాగంగా జర్మనీ, పోలాండ్‌లోని ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఖర్చు ఉండేలా చూసుకోవడానికి దాని ఒహియో చిప్ ఫ్యాక్టరీల నిర్మాణాన్ని నెమ్మదిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటెల్ సంస్థ ఐరాపోలో కొన్ని ఫ్యాక్టరీల నిర్మాణ పనులను ఆపివేయనుంది. దీంతోపాటు అమెరికా విస్తరణ కార్యకలాపాల్లోనూ వేగం తగ్గించాలని యోచిస్తోంది.
కొన్ని కార్యకలాపాలను ఆసియా దేశాలకు బదిలీ చేయాలని సంస్థ భావిస్తోన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో అంతరాయాల నుంచి కోలుకొని, పోటీ సంస్థలకు దీటుగా నిలవాలంటే సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపర్చుకోవాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తుంది.
ఇదిలాఉంటే.. ఈ సంవత్సరం ఉద్యోగులను తొలగించిన అనేక టెక్ దిగ్గజాలలో ఇంటెల్ ఒకటి. జూలై ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ దాదాపు 9,000 మంది కార్మికులను తొలగించగా , జనవరిలో మెటా దాదాపు 5శాతం మంది ఉద్యోగులను తొలగించింది.