New FASTag rules to streamline toll payments
Fastag New Rules : ఫాస్టాగ్ వాడుతున్న వాహనదారులకు బిగ్ అప్‌డేట్. వాస్తవానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్టాగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ కోసం కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ రూల్స్ ఫిబ్రవరి 17 అనగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
టోల్ లావాదేవీలను మరింత క్రమబద్ధీకరించేలా పారదర్శకంగా ఉండేందుకు అలాగే మోసాలను నివారించడానికి ఎన్‌పీసీఐ ఈ కొత్త నిబంధలను తీసుకువస్తోంది. ఇలాంటి పరిస్థితిలో, వాహన యజమానులు ఈ మార్పుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని ఉండాలి. తద్వారా ప్రయాణం సమయంలో ఎటువంటి అసౌకర్యాన్ని లేదా జరిమానాను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు.
ఫాస్టాగ్ బ్యాలెన్స్ వెరిఫై కోసం కొత్త రూల్స్ ఇవే :
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జనవరి 28, 2025న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌పీసీఐ సర్క్యులర్ ప్రకారం.. ఫాస్టాగ్ లావాదేవీలు ఇప్పుడు నిర్ణీత గడువు ఆధారంగా చెల్లుబాటు అవుతాయి. కొత్త రూల్స్ ప్రకారం.. ఫాస్టాగ్‌కు సంబంధించి రెండు ముఖ్యమైన గడువులను అమల్లోకి తీసుకొచ్చారు.
1. 60 నిమిషాలలోపు తక్కువ బ్యాలెన్స్ కారణంగా ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్, హాట్‌లిస్ట్ కావడం లేదా ఇన్‌యాక్టివ్ చేయబడి ఉంటే ఈ స్టేటస్ 60 నిమిషాల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే, టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది.
2. స్కానింగ్ చేసిన 10 నిమిషాల తర్వాత కూడా ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లో లేదా ఇన్ యాక్టివ్‌గా ఉంటే ఆయా ట్రాన్సాక్షన్ రిజెస్ట్ అవుతుంది. ఈ రెండు షరతులను ఫాస్ట్ ట్యాగ్ పాటించకపోతే సిస్టమ్ 176 ఎర్రర్ కోడ్‌తో లావాదేవీని తిరస్కరిస్తుంది. వాహన యజమాని టోల్ రుసుమును రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
వాహనదారులపై కొత్త రూల్స్ ప్రభావం :
ఫాస్టాగ్ అకౌంట్లను రెండు కేటగిరీలుగా విభజించారు. అందులో ఒకటి వైట్‌లిస్ట్ (యాక్టివ్), రెండోది బ్లాక్‌లిస్ట్ (పాసివ్). ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ చేసేందుకు అనేక కారణాలు ఉండవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం.. టోల్ ప్లాజా చేరుకోవడానికి 60 నిమిషాల ముందు ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అయితే, వెంటనే రీఛార్జ్ చేసినప్పటికీ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. అయితే, టోల్ స్కానింగ్ చేసిన 10 నిమిషాల్లోపు ఫాస్టాగ్ రీఛార్జ్ చేస్తే.. వినియోగదారులు పెనాల్టీని నివారించవచ్చు. ప్రామాణిక టోల్ రుసుము మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ యూజర్లు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి :
ఫాస్టాగ్ (FASTag) విషయంలో జరిమానాలు పడకుండా ఉండాలంటే వాహనదారులు కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వినియోగదారులు టోల్ ప్లాజాకు చేరుకునే ముందు వారి ఫాస్టాగ్ అకౌంట్లలో తగినంత బ్యాలెన్స్ ఉండాలి. మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ కాకుండా ఉండటానికి మీ కేవైసీ డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. అలాగే, సుదీర్ఘ ప్రయాణానికి ముందు మీ ఫాస్టాగ్ స్టేటస్ చెక్ చేయండి.