NPS Vatsalya vs SSY
NPS Vatsalya vs SSY : మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ప్రభుత్వం అందించే అద్భుతమైన రెండు పథకాలు అందుబాటులో ఉన్నాయి. అవే.. NPS వాత్సల్య, సుకన్య సమృద్ధి యోజన (NPS Vatsalya vs SSY) పథకాలు.. ఈ రెండు పథకాల్లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.
లేదంటే రెండు ఎంచుకోవచ్చు. అది కూడా మీ అవసరాన్ని బట్టి. ఒక పథకం దీర్ఘకాలిక రిటైర్మెంట్ రాబడిని అందిస్తుంది. మరో పథకం సురక్షితమైన సేవింగ్ ఆప్షన్. రెండింటికీ వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఏ పథకంలో పెట్టుబడితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎంతకాలంలో ఎంత రాబడి వస్తుంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
NPS వాత్సల్య యోజన ఏంటి? :
NPS వాత్సల్య అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ప్రత్యేకంగా పిల్లల పేరిట తీసుకుంటారు. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేకుండా ప్రతి ఏడాది కనీసం రూ. 1000 డిపాజిట్ చేయాలి.
ఈ పథకంలో దీర్ఘకాలికంగా దాదాపు 9.5శాతం నుంచి 10శాతం వరకు రాబడిని అంచనా వేయవచ్చు. 3 ఏళ్లు పూర్తయిన తర్వాత విద్య లేదా అత్యవసర పరిస్థితుల కోసం 25శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పన్ను మినహాయింపు కోసం 80C కాకుండా, 80CCD (1B) కింద రూ. 50వేల వరకు అదనపు మినహాయింపు పొందవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఏంటి? :
సుకన్య సమృద్ధి యోజన కేవలం కూతుళ్లకు మాత్రమే. 10 ఏళ్ల వయస్సు వరకు కూతురి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి 15 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం, 8.2శాతం స్థిర వడ్డీ లభిస్తుంది. ప్రతి త్రైమాసికం, ప్రతి ఏడాది రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ పథకం పూర్తిగా పన్ను రహితం. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను లేదు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి తర్వాత 50శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత లేదా అమ్మాయి వివాహం తర్వాత (18 ఏళ్ల తర్వాత) మొత్తం రాబడిని ఒకేసారి తీసుకోవచ్చు.
ఏ పథకం ఎవరికి బెస్ట్? :
మీ కుమార్తె చదువు లేదా వివాహం కోసం డబ్బులు దాచుకోవాలంటే సుకన్య సమృద్ధి యోజన పథకం మంచిది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయంపై టాక్స్ సేవింగ్ ఆప్షన్ ఉంది. మీ పిల్లల పేరు మీద దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని భావిస్తే.. రిటైర్మెంట్ లేదా భవిష్యత్తులో ఉన్నత చదువుల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే NPS వాత్సల్య పథకాన్ని ఎంచుకోవచ్చు.
తద్వారా దీర్ఘకాలిక అధిక రాబడిని పొందవచ్చు. కొడుకు, కుమార్తె ఇద్దరికీ పెట్టుబడి కోసం చూస్తుంటే NPS వాత్సల్య అద్భుతమైన ఆప్షన్. మార్కెట్ వృద్ధి, పెన్షన్ ప్రయోజనం రెండింటినీ పొందవచ్చు. ఈ రెండు పథకాలు వేర్వేరు ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మీ పెట్టుబడి లక్ష్యాలు, సమయం, పన్నుపరమైన ప్రయోజనాల అవసరాన్ని బట్టి ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.
Disclaimer : ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. ప్రభుత్వ పథకాలే అయినప్పటికీ అవగాహనతో పెట్టుబడి పెట్టడం ఎంతైనా మంచిది..