Laptop-PC Prices : భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్, PC ధరలు, ఇప్పుడు కొనడమే బెటర్.. ఆ తర్వాత కొందామన్న కొనలేరు!
Laptop-PC Prices : ల్యాప్ టాప్, కంప్యూటర్ ఏది కొనాలన్నా ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. మరికొద్ది నెలల్లో ఈ ఎలక్ట్రానిక్స్ ధరలు అమాంతం పెరగబోతున్నాయి. ఏఐ టెక్నాలజీ ప్రభావంతో ఏకంగా 35 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Sreehari A
- Published On : March 12, 2026 / 04:08 PM IST
Laptop-PC Prices
- అతి త్వరలో పీసీ, ల్యాప్ టాప్ ధరలు పెరగనున్నాయి
- డీడీఆర్ ర్యామ్ ధరలు, ప్రాసెసర్ల కొరత ఇందుకు కారణం
- రానున్న రోజుల్లో 35 శాతం వరకు ఖరీదైనవి కావొచ్చు
Laptop-PC Prices : కొత్త కంప్యూటర్, ల్యాప్ టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏఐ ప్రభావంతో కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ధరలు భారీగా పెరగనున్నాయి. 2026లో ఎలక్ట్రాన్స్ డివైజ్‌ల ధరలు దాదాపు 35శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఏఐ టెక్నాలజీ కారణంగా కంపోనెంట్ ఖర్చులు పెరిగాయి. అదే పీసీలు, కంప్యూటర్ వంటి కీలక ఇంటర్నల్ పార్టుల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి.
అందులో ప్రాసెసర్లు, జీపీయూలు సహా కీలక పార్టుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కొనాలనుకుంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి రావచ్చు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. DDR RAM ధరలు అధికంగా పెరగడం, ఎంట్రీ-లెవల్ ఇంటెల్ ప్రాసెసర్ల కొరతే ప్రధాన కారణమని చెబుతున్నారు.
2025లో రికార్డు స్థాయిలో పీసీ షిప్‌మెంట్‌లు అయ్యాక ఈ ఏడాదిలో వాల్యూమ్‌లు 8శాతం వరకు తగ్గుతాయని మార్కెట్ ట్రాకర్ ఐడీసీ వెల్లడించింది. IDC ప్రకారం.. డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్‌స్టేషన్‌లతో సహా భారతీయ పీసీ మార్కెట్ 2025లో 15.9 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌లతో భారీగా అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది కన్నా 10.2శాతం ఎక్కువ.
వార్షిక షిప్‌మెంట్లు, 15 మిలియన్ యూనిట్లను దాటడం ఇదే ఫస్ట్ టైమ్. FY21, FY22లో కోవిడ్ టైమ్‌లో అధిగమించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతులు 4.1 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 18.5శాతం పెరుగుదలను సూచిస్తుంది. HP ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత లెనోవా, డెల్, ఏసర్, ఆసుస్ ఉన్నాయి. అన్ని ప్రధాన కంపెనీలు 2025లో షిప్‌మెంట్ వృద్ధిని నివేదించాయి.
పెరుగుతున్న పీసీలు, ల్యాప్‌టాప్ ధరలు :
పెరుగుతున్న కాంపోనెంట్ ధరలు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ధరలను పెంచుతున్నాయి. RAM ధరలు ఇప్పటికే 2.5 నుంచి 3 రెట్లు పెరిగాయి. ఫలితంగా ఇప్పటివరకు ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ధరలు 10-12 శాతం పెరిగాయి. మార్చిలో మరో 8 నుంచి 10 శాతం పెరుగుదల ఉండొచ్చు.
కాంపోనెంట్ ధరల పెరుగుదలతో రాబోయే కొన్ని నెలల్లో మరో 10 శాతం పెరుగుదల ఉంటుందని ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు భరత్ షెనాయ్ అన్నారు. గతంలో రూ.30వేల నుంచి రూ. 35వేల రేంజ్ అమ్ముడయ్యే పీసీలు, ల్యాప్ టాప్స్ ఇప్పుడు రూ.45వేల దగ్గర ధర పలుకుతున్నాయని ఆయన తెలిపారు.
విద్యార్థులు, గృహ వినియోగదారులు మొదటిసారి కొనుగోలు చేసేవారు అప్‌గ్రేడ్ చేయడం కష్టమవుతుందని షెనాయ్ చెప్పారు. రిటైలర్లు, ఇండస్ట్రీ నిపుణులు సైతం పీసీల ధరలు రాబోయే 6 నుంచి 7 త్రైమాసికాల వరకు పెరుగుతూనే ఉండవచ్చని, 2027 రెండో సగం వరకు తగ్గకపోవచ్చునని అంటున్నారు. కొంతమంది కస్టమర్లు ముందుగానే కొనుగోలు చేయాల్సి వస్తుంది.
ధరలు పెరగడం, డిమాండ్ తగ్గడం :
మొత్తంమీద, పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ షిప్‌మెంట్‌లు 2026 చివరి నాటికి తగ్గవచ్చు. ఎందుకంటే.. పెరుగుతున్న ఖర్చులు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ‘ప్రాథమిక అంచనాల ప్రకారం.. వినియోగదారులు, కమర్షియల్ పీసీలు రెండూ సంవత్సరానికి 7 శాతం నుంచి 8 శాతం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
ధరలు పెరిగితే ఎంట్రీ-లెవల్ కొనుగోలుదారులు తక్కువ-స్పెసిఫికేషన్ మోడళ్లను ఎంచుకోవచ్చు. అయితే గేమింగ్, క్రియేటర్లు, ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులు వంటి ప్రీమియం, ప్రొఫెషనల్ ధర ఎక్కువైనా కొనేందుకు చూస్తుంటారు. ఇలాంటి ప్రీమియం కంప్యూటర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
వచ్చే నవంబర్ నుంచి ప్రతి నెలా ల్యాప్‌టాప్ ధరలు, స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న మెమరీ ధరలు, డాలర్ అస్థిరత, ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా సంఘర్షణ ప్రభావంతో ఎలక్ట్రానిక్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కంప్యూటర్ ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం ఎంతైనా మంచిది.
