RBI : ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఎలక్ట్రానిక్ చెక్కులు వచ్చేస్తున్నాయ్..! వీటివల్ల ఉపయోగాలు ఏమిటంటే?
RBI Electronic Cheques : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ చెక్కులు (ఈ-చెక్స్) అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.
- Harishth Thanniru
- Published On : March 28, 2026 / 08:58 AM IST
RBI Electronic Cheques
RBI Electronic Cheques : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ చెక్కులు (ఈ-చెక్స్) అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. పేమెంట్స్ విజన్-2028 పేరుతో ఒక డాక్యుమెంట్‌ను ఆర్బీఐ విడుదల చేసింది.
Also Read : Beer Price Hike : మందుబాబులకు బిగ్అలర్ట్.. బీర్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..
చెల్లింపుల వ్యవస్థను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ కంపెనీలతో పాటు పేమెంట్ కంపెనీలు అన్నిటినీ తన నియంత్రణలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ‘పేమెంట్స్ విజన్-2028’ డాక్యుమెంట్‌లో ఆర్బీఐ పేర్కొంది. వీటికితోడు డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేసే చెల్లింపులను చెల్లింపుదారు మధ్యలోనే ఆపివేసే వెసులుబాటును కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ వెసులుబాటు కార్డు చెల్లింపుదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కార్డు లావాదేవీల మాదిరిగానే ఏదైనా డిజిటల్ చెల్లింపులకు ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసే సౌకర్యాన్ని ఎలక్ట్రానిక్ చెక్ వినియోగదారులకు కల్పించాలని ఆర్బీఐ యోచిస్తోంది.
అనధికారిక డిజిటల్ లావాదేవీల వల్ల కలిగే నష్టానికి ఖాతాదారుడి బ్యాంక్ (ఇష్యూయర్), బెనిఫిషియరీ బ్యాంక్ రెండూ సంయుక్తంగా బాధ్యత వహించే నియమావళిని ఆర్బీఐ పరిశీలిస్తోంది. అదేవిధంగా.. కాగితపు చెక్కుల ప్రయోజనాలను, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వేగంతో అనుసంధానిస్తూ ఎలక్ట్రానిక్ చెక్కులను ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తోంది. మోసాల నివారణకు చెక్కుల డిజైన్, భద్రతా ఫీచర్లను సమీక్షించనుంది.
ఆర్బీఐ పలు అంశాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలో వైట్ లేబుల్ సొల్యూషన్లను ప్రవేశపెట్టడం, అసిస్టెండ్ పేమెంట్ ప్రొవైడర్లను నియంత్రణ పరిధిలోకి తీసుకురావడంపై ఆర్బీఐ దృష్టిపెట్టనుంది. అంతేకాక.. బ్యాంకింగ్ ఖాతాదారులు తమ చెల్లింపులను సులభంగా మార్చుకునేలా ఎటువంటి ఇబ్బంది లేని పేమెంట్స్ స్విచ్చింగ్ సర్వీస్ ను ఆర్బీఐ తీసుకురానుంది.
