యువతకు ఆదాయం పెరిగింది, పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా, చాలామంది తమ పదవీ విరమణ (రిటైర్మెంట్) ప్రణాళికను “తర్వాత చూద్దాంలే” అని వాయిదా వేస్తున్నారు. కానీ, ఈ నిర్లక్ష్యం భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రైమ్ వెల్త్ ఫిన్‌సర్వ్ వ్యవస్థాపకుడు చక్రవర్తి దీని గురించి స్పందిస్తూ.. “మీరు 60 ఏళ్లకు రిటైర్ అయి, 85 ఏళ్ల వరకు జీవిస్తే, ఆ 25 ఏళ్లు జీతం లేకుండా ఎలా బతుకుతారు? మీరు ఎక్కువ కాలం బతుకుతారా లేదా అన్నది కాదు ప్రశ్న… మీ దగ్గర ఉన్న డబ్బు ఆ జీవితానికి సరిపోతుందా అన్నదే అసలు ప్రశ్న” అని చెప్పారు.
సమస్య ఎక్కడ?
చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్‌ను ఒక సుదూర లక్ష్యంగా భావించి, ఇల్లు, కారు వంటి తక్షణ అవసరాలపై దృష్టి పెడతారు. కానీ, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.
ఎంత డబ్బు కావాలి? ఒక చిన్న లెక్క చూద్దాం..
30 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తికి, ప్రస్తుతం నెలకు ఇంటి ఖర్చులు రూ.60,000 అనుకుందాం. 6-7% ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 60 ఏళ్ల వయసులో ఇదే జీవనశైలిని కొనసాగించాలంటే నెలకు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు అవసరం.
దీని ప్రకారం, కనీసం రూ.4 కోట్ల నుండి రూ.6 కోట్ల రిటైర్మెంట్ నిధి (corpus) అవసరం. ఈ సంఖ్య చూసి భయపడకండి. సరైన ప్రణాళికతో, క్రమశిక్షణతో ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఉత్తమ మార్గాలు ఇవే..
మీరు ఇప్పటికే EPF, PPF, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడులు పెడుతుంటే, మీ లక్ష్యానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నారో లెక్కించుకోండి. ఆ గ్యాప్‌ను పూరించడానికి ఈ మార్గాలను పరిశీలించండి.
ఇప్పుడే ప్రారంభించండి..
చాలామంది ఇప్పుడు SIPలను నెలవారీ కరెంట్ బిల్లు, ఇంటి అద్దెలా ఒక తప్పనిసరి ఖర్చుగా భావిస్తున్నారు. ఇది మంచి పరిణామం. రిటైర్మెంట్ అనేది ఒక పెద్ద లక్ష్యం, కానీ దానికి పునాది ఒక చిన్న, క్రమమైన పెట్టుబడితోనే మొదలవుతుంది. మీరు ఎంత ఆలస్యంగా ప్రారంభిస్తే, అంత ఎక్కువ భారం మీపై పడుతుంది. కాబట్టి, ఆలోచించడం ఆపి, ఇప్పుడే మీ భవిష్యత్తు కోసం ఒక బలమైన ఆర్థిక ప్రణాళికను ప్రారంభించండి.