HRA Tax Relief : జీతగాళ్లకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్ సహా 4 నగరాల్లో 50శాతం HRA.. చేతికి ఎంత జీతం వస్తుందంటే?
HRA Tax Relief : ఇప్పటి వరకు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై 4 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ఉద్యోగులు మాత్రమే బేసిక్ పేలో 50శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపుకు అర్హులు. ఇతర నగరాలకు, ఈ పరిమితి 40శాతంగా ఉండేది. ఇప్పుడు ఈ జాబితాలో మరో 4 నగరాలు చేరాయి.
- Sreehari A
- Published On : April 2, 2026 / 06:56 PM IST
HRA Tax Relief
- నెలకు జీతం పొందే ఉద్యోగులకు భారీ శుభవార్త
- హైదరాబాద్ సహా 4 నగరాల్లో 50 శాతం HRA పెంపు
- 4 నగరాల నుంచి ఇప్పుడు 8 నగరాలకు విస్తరణ
HRA Tax Relief : ఏప్రిల్ 1, 2026న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. జీతభత్యాలు పొందే పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)కు సంబంధించి నిబంధనలను భారీగా మార్చింది.
తద్వారా ఉద్యోగులు తమ కనీస వేతనంలో 50శాతం వరకు హెచ్‌ఆర్‌ఏను క్లెయిమ్ చేసే నగరాల జాబితాను విస్తరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫై చేసిన ఆదాయపు పన్ను నిబంధనలు, 2026 ప్రకారం ఈ మినహాయింపు పొందవచ్చు.
మెట్రో నగరాల సంఖ్య 8కి పెంపు :
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా చెన్నై 4 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ఉద్యోగులు మాత్రమే మూల వేతనంలో 50శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపును పొందేవారు. ఇతర నగరాల్లో మాత్రం ఈ పరిమితి 40 శాతంగా ఉండేది. అయితే, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ సహా 4 సిటీలు కూడా చేరాయి.
ఈ 8 నగరాల్లో పనిచేసే ఉద్యోగులు ఇప్పుడు తమ కనీస వేతనంలో సగం (50 శాతం) హెచ్‌ఆర్‌ఏ మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గి, చేతికి అందించే జీతం ఎక్కువ పెరుగుతుంది అనమాట.
ఈ మార్పు ఎందుకంటే? :
పెరుగుతున్న అద్దెలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ మార్పు చేసినట్టు నిపుణులు భావిస్తున్నారు. బెంగళూరు, పూణే వంటి నగరాల్లో గత కొన్నేళ్లుగా అద్దెలు భారీగా పెరిగాయి. పాత మెట్రో నగరాల్లోని అద్దెలు అధిక స్థాయికి చేరుకుంటున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధ్యతరగతివారికి ఎక్కువ డబ్బు మిగులుతుంది. తద్వారా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. పాత పన్ను విధానం కింద ఉన్నవారికి మరిన్ని ప్రయోజనాలు అందనున్నాయి. హెచ్‌ఆర్‌ఏతో పాటు పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ప్రభుత్వం మరికొన్ని మినహాయింపు పరిమితులను పెంచింది.
పిల్లల విద్య, హాస్టల్ : పిల్లల విద్య, హాస్టల్ భత్యం మినహాయింపు పరిమితి పెంపు
ఉచిత భోజనం : కంపెనీ అందించే కూపన్లు లేదా ఫ్రీ ఫుడ్ పై రిలీఫ్
విదేశీ ప్రయాణం, చదువులు : విదేశీ చదువులు లేదా ప్రయాణాల కోసం అయ్యే ఖర్చులపై టీసీఎస్ (TCS) ఇప్పుడు తగ్గింది.
రిలీఫ్ మాత్రమే కాదు.. నిబంధనలను కూడా కఠినతరం చేశారు. మోసపూరిత అద్దె వసూళ్లను అరికట్టేందుకు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌లను లోతుగా పరిశీలించనున్నారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ (F&O)లో స్పెక్యులేషన్‌ను అరిక్టేందుకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)ను 150శాతానికి పెంచారు.
