SCSS Vs MIS : రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం కావాలా? ఎక్కువ వడ్డీ కావాలా? పోస్టాఫీస్‌లో ఏ స్కీమ్ బెస్ట్?

SCSS Vs MIS : పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుంది? ఏ పథకంలో రూ.60 వేలు అదనపు ఆదాయం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

SCSS vs MIS _ Which Post Office Scheme Offers

  • సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే పోస్టాఫీస్ పథకాలు..
  • ఐదేళ్లలో రూ.60 వేల అదనపు ఆదాయం.. ఈ స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ
  • పోస్టాఫీస్‌లో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత వస్తుందంటే?
  • SCSS, MISలో ఏది ఎంచుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి?

SCSS vs MIS : రిటైర్మెంట్ తర్వాత చేతిలో కొంత డబ్బు ఉన్నా.. దాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉంటుందోనని చాలామంది సీనియర్ సిటిజన్లు ఆలోచిస్తుంటారు.. పెట్టిన డబ్బుకు భద్రత ఉండాలి.. ప్రతినెలా లేదా మూడు నెలలకోసారి ఆదాయం రావాలి.. వీలైతే వడ్డీ కూడా ఎక్కువగా రావాలి.

ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ అందిస్తున్న రెండు అద్భుతమైన పథకాలే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS). మరి ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి సంపాదించుకోవచ్చునో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రూ.15 లక్షలు పెడితే SCSSలో ఎంత వస్తుంది? :
60 ఏళ్లు నిండిన SCSS ఖాతా ఓపెన్ చేయొచ్చు.. ఇందులో గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీ లెక్కన రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.1,23,000 వడ్డీ వస్తుంది. అంటే.. ప్రతి 3 నెలలకు రూ.30,750 చేతికి అందుతుంది. ఐదేళ్లలో మొత్తం రూ.6,15,000 వడ్డీ ఆదాయం పొందొచ్చు.. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం తిరిగి వస్తుంది.

Read Also : WhatsApp View Once : పాస్‌వర్డ్‌లు, OTPలు పంపుతున్నారా? WhatsAppలో కొత్త సేఫ్టీ ఫీచర్.. మెసేజ్ చదివాక మాయం..!

MISలో నెలనెలా ఆదాయం ఎంతంటే? :

నెలనెలా ఖర్చులకు డబ్బులు అవసరమయ్యే వారికి MIS స్కీమ్ బెస్ట్ ఆప్షన్.. ఇందులో వ్యక్తిగత ఖాతాకు రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాకు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 7.4 శాతం వడ్డీ ప్రకారం.. రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.9,250 వడ్డీ వస్తుంది. ఐదేళ్లలో మొత్తం రూ.5,55,000 ఆదాయం లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత అసలు రూ.15 లక్షలు తిరిగి పొందవచ్చు.

ఏది ఎంచుకుంటే బెటర్? :
ఈ రెండు పథకాలను కంపేర్ చేసి చూస్తే.. SCSSలో ఐదేళ్లకు రూ.6.15 లక్షల వడ్డీ వస్తుండగా, MISలో రూ.5.55 లక్షలే లభిస్తాయి. అంటే SCSSలో అదనంగా రూ.60వేలు ఆదాయం పొందవచ్చు. క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం కావాలంటే MIS స్కీమ్ బెటర్..

ఎక్కువ వడ్డీ ఆదాయం కావాలంటే SCSS స్కీమ్ లో పెట్టుబడి పెట్టొచ్చు.. అయితే పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత వడ్డీ రేట్లు, పన్ను నిబంధనలు, ఇతర షరతులను తప్పనిసరిగా తెలుసుకోవడం ఎంతైనా మంచిది..