Gold Price Consolidation : గోల్డ్‌పై గందరగోళం వద్దు.. అమ్మేయాలా? కొనాలా? రూ.2 లక్షల దిశగా బంగారం.. ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే?
Gold Price Consolidation : బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత ప్రస్తుతం కన్సాలిడేషన్‌లో ఉన్నాయి. బంగారం అమ్మాలా? కొనాలా? గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్‌లో పెట్టుబడి ఎలా చేయాలి? రాబోయే రోజుల్లో ధరలు రూ.2 లక్షలకు చేరుతాయా? కమోడిటీస్ ఎక్స్‌పర్ట్ అంచనాలివే..
- Sreehari A
- Updated on- September 1, 2026 / 07:00 PM IST
Gold Price Consolidation ( Image Credit : AI )
- గోల్డ్‌పై గందరగోళం వద్దు.. అమ్మకండి, ఇలా పెట్టుబడి పెట్టండి
- రూ.1.40 లక్షల దగ్గర గోల్డ్ కన్సాలిడేషన్.. ఇక నెక్ట్స్ టార్గెట్ రూ.2 లక్షలా?
- బంగారం ధరకు బ్రేక్ పడిందా? లేక ఇది తాత్కాలిక విరామమేనా..
- అమ్మమంటున్న ప్రకటనల వెనుక అసలు నిజమేంటి?
- ఎక్స్‌పర్ట్ చెప్పిన కీలక విషయాలివే
Gold Price Consolidation : బంగారం అమ్మేయాలా? కొనాలా? అసలు ఏం చేయాలి? బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో బంగారం అమ్ముకోవడమే బెటర్ అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుల్లో ఒకే ప్రశ్న..
ఇప్పుడు ఉన్న బంగారాన్ని అమ్మేయాలా? వద్దా? ఇంకా కొంతకాలం ఇంట్లోనే ఉంచుకోవాలా? ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఇప్పుడే బంగారం అమ్ముకుంటే భారీగా డబ్బులు సంపాదించుకోవచ్చునని కొన్ని సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయి.
మరోవైపు భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు సైతం చెబుతున్నారు. ఈ గందరగోళం మధ్య కమోడిటీస్ ఎక్స్‌పర్ట్, ఐలా కమోడిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ హరీశ్ గాలిపెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. బంగారం దీర్ఘకాలికంగా ఇప్పటికీ బలమైన పెట్టుబడి సాధనమేనన్నారు. ధర పెరిగిందని ఉన్న బంగారాన్ని తొందరపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు.
ప్రధాని ప్రకటనతో బంగారం కొనుగోళ్లు తగ్గాయా? :
ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లపై చేసిన సూచనల ప్రభావంతో ప్రజలు బంగారం కొనడం పూర్తిగా తగ్గించారని చెప్పలేమని అంటున్నారు. దిగుమతుల గణాంకాల్లో మాత్రం తగ్గుదల కనిపించిందని, దేశీయంగా బంగారం కొనుగోళ్లలో పెద్దగా తగ్గుదల లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
దిగుమతి సుంకం 15 శాతానికి పెరిగిందని, అధికారిక మార్గంలో వచ్చే బంగారం భారీగా తగ్గిందన్నారు. అక్రమ మార్గాల్లో బంగారం మార్కెట్లోకి వస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం సుంకాలను పెంచడంతో బంగారం కొనుగోళ్లు తగ్గుతాయని భావించినా ఆ అంచనాలు పూర్తిగా ఫలించలేదని అన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ ధరతో పోలిస్తే భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.4వేల నుంచి 5 వేల వరకు తక్కువగా ఉందని అన్నారు. అదే సుంకాలు తగ్గిస్తే మరో రూ.7వేల నుంచి 8 వేల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.
బంగారం ఎందుకు తగ్గుతోంది :
బంగారం భారీగా పెరిగి కొంత తగ్గడం అదేమి కొత్త విషయం కాదని చెబుతున్నారు. 2000, 2008, 2014లో కూడా భారీ ర్యాలీల తర్వాత సుమారు 20 శాతం నుంచి 30 శాతం వరకు కరెక్షన్ వచ్చిందని, ఆ తర్వాత మళ్లీ ధరలు పెరిగాయి. ప్రస్తుతం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. అంటే.. బంగారం కథ ముగిసినట్టు కాదని, ధరలు కొంతకాలం తగ్గుముఖం పట్టినట్టు మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంత ఉండొచ్చు? :
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ప్రస్తుతం సుమారు 4,600 నుంచి 4,700 డాలర్ల స్థాయిలో ఉందని, ముందుగా 4,200 నుంచి 4,300 డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ తర్వాత మళ్లీ బలమైన ర్యాలీ రావడంతో 5,600 డాలర్లను దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
Read Also : PM Modi Gold: బంగారం కొనకండి.. విదేశీ ప్రయాణాలకు బ్రేక్ వేయండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు
భారతీయ బులియన్ మార్కెట్ పరిశీలిస్తే.. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.44 నుంచి 1.45 లక్షల వరకు దిగొచ్చింది. అక్కడి నుంచి మళ్లీ పెరిగే అవకాశం ఉందని కమోడిటీస్ ఎక్స్‌పర్ట్ అభిప్రాయపడ్డారు. 2 నుంచి 3 త్రైమాసికాల పాటు ఒడిదుడుకులు ఉన్నా కొత్త రికార్డు స్థాయులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. దీర్ఘకాలంలో రూ.2 లక్షల మార్కును కూడా బంగారం అధిగమించే అవకాశం ఉందని అన్నారు.
బంగారం ధరల పెరుగుదలకు కారణాలివే :
రాబోయే 6 నెలల్లో ప్రధానంగా 3 అంశాలు బంగారం ధరలను భారీగా ప్రభావితం చేయనున్నాయి.
- ద్రవ్యోల్బణం
- అమెరికా వడ్డీరేట్లు
- యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా వడ్డీరేట్లు పెంచితే డాలర్ బలపడుతుంది. అప్పుడు బంగారం ధరపై ఒత్తిడి పెరగొచ్చు. అయినప్పటికీ బంగారం ధరలు సుమారు 4వేల నుంచి 4,200 డాలర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
సామాన్యులు ఏం చేయాలి? :
ఇప్పుడు ఇదే కీలకమైన అంశం.. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో బంగారం కొనడం కన్నా ప్రతి నెలా కొంత మొత్తాన్ని క్రమంగా పెట్టుబడి చేయడం చాలా మంచిదని అంటున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యంతో గోల్డ్ బీస్, గోల్డ్ ఈటీఎఫ్ వంటి డిజిటల్ గోల్డ్ మార్గాలను పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. గత ఐదేళ్లలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆసక్తి పెరిగిందని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు గోల్డ్ ఈటీఎఫ్ వైపు చూస్తున్నారని అంటున్నారు.
అందుకే బంగారం ధర పెరిగిందని భయపడి ఉన్న బంగారాన్ని వెంటనే అమ్మేయడం సరికాదంటున్నారు. మీ అవసరాలు, ఆర్థిక పరిస్థితి, పెట్టుబడి లక్ష్యాలను బట్టి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిదని సూచిస్తున్నారు. బంగారం ధరలో తాత్కాలిక హెచ్చుతగ్గులు అనేవి చాలా కామన్.. కానీ, దీర్ఘకాలికంగా బంగారం ఇప్పటికీ కీలకమైన పెట్టుబడిగా కొనసాగుతోందన్నది నిపుణులు చెబుతున్న మాట..
