ITR Rules for Husband And Wife (Image Credit To Original Source)
Union Budget 2026 : ఫిబ్రవరి 1నే కేంద్ర వార్షిక బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. అయితే ఈసారి బడ్జెట్‌కు ముందు పన్ను చెల్లింపుదారులకు భారీగా మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు.
ప్రత్యేకించి భార్యాభర్తల కోసం ప్రభుత్వం ప్రత్యేక జాయింట్ టాక్స్ ఆప్షన్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే ఇకపై దంపతులిద్దరూ కలిసి సింగిల్ టాక్స్ కోసం ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇది జరిగితే.. ఒకే ఆదాయం ఉన్న కుటుంబాలు భారీగా ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుతం, పన్ను వ్యవస్థలో వివాహం తర్వాత కూడా భార్యాభర్తలను వేర్వేరు పన్ను యూనిట్లుగా పరిగణిస్తారు. ఫలితంగా ఒకే ఆదాయంపై పన్ను విధించే అవకాశం ఉంటుంది.
కొత్త టాక్స్ మోడల్ కుటుంబాన్ని ఒకే యూనిట్‌గా పరిగణిస్తుంది. తద్వారా భార్యాభర్తలిద్దరికి టాక్స్ సేవింగ్స్ భారీగా పెరుగుతాయి. వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం టాక్స్ పేయర్ల కోసం ఎలాంటి మార్పులు చేయాలని భావిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జాయింట్ టాక్స్ అంటే ఏంటి? :
ప్రస్తుతం భారతీయ పన్ను వ్యవస్థ ప్రకారం.. భార్యాభర్తలకు పెళ్లి అయిన దగ్గర నుంచి వారిని పన్ను ప్రయోజనాలకు వేర్వేరు వ్యక్తులుగా పరిగణిస్తారు. ప్రతి వ్యక్తి వారి వారి ఆదాయాల కోసం స్పెషల్ ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్) దాఖలు చేస్తారు.
ఒక ఇంట్లో ఒకే ఒక సంపాదించే వ్యక్తి ఉన్నప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. భర్త సంవత్సరానికి రూ. 10 లక్షలు సంపాదిస్తాడు.. భార్య ఇంటిని మాత్రమే చూసుకుంటుంది. ఆమె ఎలాంటి ఉద్యోగం చేయదు.. ఇలాంటి సందర్భంలో మొత్తం రూ. 10 లక్షలపైనా పన్ను విధిస్తారు.
అయితే, భార్య ప్రాథమిక మినహాయింపు అందుబాటులో ఉండదు. అదే ఉమ్మడి పన్ను విధానంలో భార్యాభర్తలిద్దరి ఆదాయాలు కలిసి ఉంటాయి. అప్పుడు వారి మినహాయింపు పరిమితులు కూడా ఒకటిగా మారుతాయి. దాంతో కుటుంబంలో సంపాదించే వ్యక్తిపై పన్ను భారం పడదు. కుటుంబంలో వాస్తవ ఆర్థిక పరిస్థితి ఆధారంగా పన్ను విధించే అవకాశం ఉంటుంది.
ఉమ్మడి పన్ను అమలు చేస్తే.. ఒకే ఆదాయ పొందే కుటుంబాలు భారీగా ప్రయోజనం పొందుతాయి. ఇద్దరు భాగస్వాముల ప్రాథమిక మినహాయింపు పరిమితులను కలిపితే వారి పన్ను విధించే ఆదాయం కూడా ఆటోమాటిక్‌గా తగ్గుతుంది. ఇంకా, భార్యాభర్తలు గృహ రుణ వడ్డీ, ఆరోగ్య బీమా, ఇతర డిడక్షన్లతో కలిపి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రస్తుత పన్ను విధానం ప్రకారం.. ఈ మినహాయింపులన్నీ ఒకే వ్యక్తి ఆదాయానికి సరిపోవు. ఉమ్మడి పన్ను దాఖలు కోసం స్లాబ్‌లను కూడా తిరిగి రూపొందించవచ్చు. అంటే.. అధిక మినహాయింపు పరిమితులు, ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు పన్ను రేట్లు ఉంటాయి. ప్రతి ఏడాదిలో మధ్యతరగతి కుటుంబాలకు భారీగా ఉపశమనం అందించే అవకాశం ఉంటుంది.
జాబ్ చేసే కపుల్స్‌కు బెనిఫిట్స్ ఏంటి? :
జాయింట్ టాక్స్ విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి, స్లాబ్‌లను దామాషా ప్రకారం పెంచాలి. ఉదాహరణకు.. ప్రస్తుతం, ఒక వ్యక్తి రూ. 3 లక్షల వరకు మినహాయింపుకు అర్హులు. అదే ఉమ్మడి పన్ను వ్యవస్థ కింద ఈ పరిమితిని రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ చేయవచ్చు. అధిక పన్ను భారాన్ని నివారించేందుకు సర్‌ఛార్జ్ పరిమితిని కూడా తదనుగుణంగా పెంచవచ్చు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటే.. ఎలాంటి ప్రయోజనాలను కోల్పోకుండా ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.
భార్యాభర్తలిద్దరూ జాయింట్ టాక్స్ సిస్టమ్ ఎంచుకున్నప్పటికీ, వేర్వేరు స్టాండర్డ్ డిడక్షన్లను కొనసాగించాలని సూచించారు. ఈ విధానం ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి దేశాలలో అమలులో ఉంది. ఈ జాయింట్ టాక్స్ ఆప్షన్ 2026 బడ్జెట్‌లో ప్రవేశపెడితే.. భారత పన్ను వ్యవస్థకు అత్యంత సానుకూలంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.