Home Loan Documents : లోన్ పెట్టి ఇల్లు కొన్నారా? మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు బ్యాంక్ పోగొడితే..!
Home Loan Documents : హోం లోన్ కోసం ఆస్తి పత్రాలను బ్యాంకు చేతుల్లో పెడితే పోగొట్టారంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కిన కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులపై ఎలాంటి బాధ్యత ఉంటుంది. హౌస్ ఓనర్లు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అనేది పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- May 26, 2026 / 06:38 PM IST
Home Loan Documents ( Image Credit : Gemini AI )
- బ్యాంకులో హోం లోన్ తీసుకుంటున్నారా?
- మీ ప్రాపర్టీ డాక్యుమెంట్లను బ్యాంకులో పెట్టారా?
- బ్యాంకులు మీ ఒరిజినల్ డాక్యుమెంట్లను పోగొడితే పరిస్థితి ఏంటి?
- ఎవరిది బాధ్యత? ఇంటి యజమానులు ఏం చేయాలి?
Home Loan Documents : హోం లోన్ తీసుకుంటున్నారా? అయితే, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్లు జాగ్రత్త.. చాలామంది హోం లోన్ల కోసం బ్యాంకుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లను పూచీకత్తుగా పెడుతుంటారు. ప్రతి బ్యాంకు లోన్లు ఇచ్చే ముందు రుణగ్రహీతల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకుంటాయి.
అందులో ప్రధానంగా అమ్మకపు దస్తావేజులు, పన్ను రికార్డులు యాజమాన్య పత్రాలను గృహ రుణాలకు పూచీకత్తుగా సమర్పిస్తారు. ఇవన్నీ బ్యాంకుల్లో (Home Loan Documents) పెడితే చాలా భద్రంగా ఉంటాయని భావిస్తుంటారు. దురదృష్టవశాత్తూ బ్యాంకులు మీ ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లను పొగొడితే ఏమౌతుంది? బ్యాంకులకు బాధ్యత ఉంటుందా? ఏమైనా పరిహారం చెల్లిస్తాయా? హౌస్ ఓనర్లు ఏం చేయాలి? అనేది ఇప్పుడు చూద్దాం..
బ్యాంకు నుంచి రూ.1.86 కోట్ల హోం లోన్ :
ఫిన్‌గ్రోత్ మీడియా వ్యవస్థాపకుడు సీఏ కనన్ బహల్ ప్రకారం.. ఇలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో చోటచేసుకుంది. బ్యాంకులను నమ్మి పూచీకత్తుగా ఇచ్చిన ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లను బ్యాంకు పొగొట్టింది. దీనిపై బాధిత వ్యక్తి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC)ను ఆశ్రయించాడు.
మనోజ్ మధుసూదనన్ అనే వ్యక్తి 2016లో బెంగళూరులోని ఒక ప్రాపర్టీ కోసం ప్రైవేట్ బ్యాంకు నుంచి రూ.1.86 కోట్ల హోం లోన్ తీసుకున్నాడు. లోన్ ప్రక్రియలో భాగంగా ఆయన అమ్మకపు దస్తావేజులు, అకౌంట్ డాక్యుమెంట్లు, పన్ను రసీదులు, వెరిఫికేషన్ డాక్యుమెంట్ సహా ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాడు.
Read Also : WhatsApp Feature : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇక పంపే ముందే మీ మెసేజ్‌లు హైడ్ అవుతాయి.. ఎలాగంటే?
సెక్యూర్డ్ హోమ్ లోన్లలో ఇలాంటి డాక్యుమెంటేషన్ కామన్. లోన్ పూర్తిగా తీరేవరకు బ్యాంకులు ఒరిజినల్ డాక్యుమెంట్లను తమ వద్దే ఉంచుకుంటాయి. అయితే, బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్ ద్వారా బ్యాంకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డాక్యుమెంట్లను పంపింది. ఆ తర్వాత, ఆ ఫైలు మిస్ కావడంతో అసలు వివాదం మొదలైంది. బహల్ ప్రకారం.. ఈ ఇష్యూ కొరియర్ కంపెనీ కారణంగా తలెత్తిందని బాధ్యత రుణదాతపై కాకుండా లాజిస్టిక్స్ ప్రొవైడర్‌పైనే ఉందని బ్యాంకు వాదించింది.
అంబుడ్స్‌మన్ ఆదేశాలు :
ఒరిజినల్ డాక్యుమెంట్లు పొగొట్టుకున్న తర్వాత మనోజ్ నష్టపరిహారం కోరుతూ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాడు. డూప్లికేట్ డాక్యుమెంట్లను వెంటనే జారీ చేయాలని, బహిరంగ ప్రకటనలో వెల్లడించాలని, అలాగే రూ. 25,000 బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని అంబుడ్స్‌మన్ బ్యాంకును ఆదేశించారు. అయితే, బాధిత వ్యక్తికి నష్టపరిహారం అందించే విషయంలో వివాదం తలెత్తింది.
బ్యాంకు బాధ్యత వహిస్తుందా? :
దాదాపు రూ. 5 కోట్ల విలువైన ఆస్తికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు కోల్పోతే దానిపై అందే పరిహారం చాలా తక్కువని ఆ మొత్తం సరిపోదని మనోజ్ భావించాడు. ప్రాపర్టీ తనదే అనడానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు చాలా ముఖ్యమని, భవిష్యత్ లావాదేవీలు, రీసేల్, చట్టపరమైన ధృవీకరణ, ఫైనాన్సింగ్ కార్యకలాపాలలో అవసరం పడతాయని మనోజ్ చెప్పుకొచ్చాడు.
చివరికి ఈ విషయం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) వద్దకు చేరింది. బహల్ ప్రకారం.. ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఒకసారి డిపాజిట్ చేశాక అవి బ్యాంకు అదుపులోనే ఉంటాయని కమిషన్ గమనించినట్లు సమాచారం.
అయితే, కొరియర్ ఏజెన్సీని బ్యాంకు స్వయంగా ఎంపిక చేసుకుందని, అందుకే బాధ్యతను థర్డ్ పార్టీకి బదిలీ చేయలేదని ఫోరం వాదించింది. బాధ్యతను కేవలం బయటివారికి అప్పగించలేమని కమిషన్ అభిప్రాయపడింది.
మిస్ అయిన డాక్యుమెంట్లను బ్యాంకు సొంత ఖర్చుతో తిరిగి ఇవ్వాలని, నష్టపరిహార పత్రంపై సంతకం చేయాలని, రుణగ్రహీతకు రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని NCDRC బ్యాంకును ఆదేశించింది. బహల్ ప్రకారం.. సదరు బ్యాంకు NCDRC తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. తుది తీర్పు వెలువడాల్సి ఉంది.
రుణగ్రహీతలు ఏం తెలుసుకోవాలి? :
బ్యాంకుల్లో లోన్లు తీసుకునే ముందు రుణగ్రహీతల కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను సీఏ బహల్ హైలెట్ చేశారు. ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్ల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. మీరు బ్యాంకులకు సమర్పించే ప్రతి డాక్యుమెంట్ పూర్తి వివరాలతో రాతపూర్వక రికార్డు ఉండాలి.
బ్యాంకు నుంచి అధికారిక రసీదును తప్పనిసరిగా పొందాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం స్కాన్ చేసిన కాపీలను దగ్గర ఉంచుకోవాలి. డాక్యుమెంట్లను ఒకసారి ఇచ్చిన తర్వాత బ్యాంకుల్లో భద్రంగా ఉంటాయని అనుకోవద్దని బహల్ సూచించారు. లేదంటే ఆ నష్టాన్ని బాధ్యతను రుణగ్రహీతలే భరించాల్సి వస్తుందని హెచ్చరించారు.
