Heat Insurance : ఎండల భయానికి బ్రేక్! కొత్త బీమా వచ్చేసింది! వడదెబ్బకు క్లెయిమ్ ఎలా? కొత్త హీట్ ఇన్సూరెన్స్ ఫుల్ గైడ్!
Heat Insurance : దేశంలో హీట్ ఇన్సూరెన్స్ బాగా పాపులర్ అవుతోంది. ఈ ప్రత్యేక బీమా అనేది వడగాలులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో ఆసుపత్రి ఖర్చులు, ఆదాయ నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- May 17, 2026 / 07:39 PM IST
Heat Insurance
- హీట్ ఇన్సూరెన్స్ గురించి మీకు తెలుసా?
- దేశంలో ఈ బీమా కవరేజీ ఎవరికి వర్తిస్తుంది?
- వడదెబ్బకు గురైతే ఎంతవరకు పరిహారం లభిస్తుంది?
- హీట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ధర, కవరేజీ పూర్తి వివరాలివే
Heat Insurance : బాబోయ్ ఎండలు దంచికొడుతున్నాయి. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ఎండ వేడి తీవ్రతకు గురవుతున్నారు. దేశంలో పెరుగుతున్న వేడి కారణంగా ప్రజల ఆరోగ్యంపైనే కాదు.. వారి జేబులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. వడగాలుల వల్ల ఆసుపత్రి ఖర్చులు, పనులు నిలిచిపోవడం, ఆదాయ నష్టం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి.
ఈ ప్రమాదం నుంచి రక్షణగా దేశంలో ‘హీట్ ఇన్సూరెన్స్’ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఇలాంటి ఇన్సూరెన్స్ అనేది లేదు. కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. సాధారణంగా ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట పరిమితిని దాటిన వెంటనే ఈ ప్రత్యేక బీమాతో ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. వడదెబ్బ కారణంగా మీరు అనారోగ్యానికి గురైనా లేదా పని చేయలేకపోయినా బీమా సంస్థ మీకు భారీ మొత్తంలో ప్రయోజనాలను అందిస్తుంది.
హీట్ ఇన్సూరెన్స్ ఏంటి? :
హీట్ ఇన్సూరెన్స్ అనేది తీవ్రమైన వేడి లేదా వడగాలుల నుంచి ఆర్థిక రక్షణను అందించే ప్రత్యేక రకమైన భీమా. సాధారణ ఆరోగ్య భీమా ఆస్పత్రిలో చేరిన తర్వాత క్లెయిమ్‌లను కవర్ చేస్తుంది. హీట్ ఇన్సూరెన్స్ తరచుగా పారామెట్రిక్ పద్ధతిలో పనిచేస్తుంది. అంటే.. మీ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట పరిమితిని (ఉదాహరణకు 45°C) మించిపోతే ఆ నష్టానికి కంపెనీ మీకు పరిహారం చెల్లిస్తుంది అనమాట.
హీట్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి? :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎండలో ఎక్కువగా పనిచేసే వారికి ఈ భీమా ఒక వరం లాంటిది. ఈ కింది గ్రూపుల వాళ్లు అత్యధికంగా బీమా ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
- డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, కొరియర్లు
- కూలీలు, నిర్మాణ కార్మికులు
- రైతులు, వీధి వ్యాపారులు
- వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడేవారు
- ఫ్యాక్టరీ కార్మికులు
- సీనియర్ సిటిజన్లు
- గుండె, మూత్రపిండాలు లేదా నాడీ సంబంధిత రుగ్మతలున్న వాళ్లు
పదేపదే వడగాలుల హెచ్చరికలు జారీ అయ్యే ప్రాంతాలలో నివసించే వారు వాతావరణ సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు.
హీట్ ఇన్సూరెన్స్ ధర ఎంత? :
భారత మార్కెట్లో హీట్ ఇన్సూరెన్స్ అనేది చాలా కొత్తది. అందుకే ఈ బీమా ధరలు మారుతూ ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు మీ ప్రాథమిక ఆరోగ్య పాలసీకి కేవలం కొన్ని వందల రూపాయలకే ‘అదనపు కవర్’గా తీసుకోవచ్చు. అదే పెద్ద బీమా కంపెనీలు అయితే ఎక్కువ వసూలు చేయవచ్చు. దేశంలో హీట్ ఇన్సూరెన్స్ ఇంకా పూర్తి స్థాయిలో లేదు. ధర అనేది ఈ కింది అంశాలను బట్టి మారుతూ ఉంటుంది.
- కవరేజ్ మొత్తం
- కవరేజీ వ్యవధి
- భౌగోళిక స్థానం
- బీమా పొందిన వ్యక్తి ప్రమాద వర్గం
- ఆరోగ్య బీమాతో కలిపి ఉన్నా లేకున్నా
ఎందులో బీమా కవర్ చేస్తుంది? :
- బీమా సంస్థను బట్టి కవరేజీ అనేది చాలా భిన్నంగా ఉంటుంది. కానీ, హీట్ ఇన్సూరెన్స్‌లో ఇవి కవర్ అవుతాయి.
- వడదెబ్బ కారణంగా ఆసుపత్రి ఖర్చులు.
- వేడి కారణంగా పనికి వెళ్లలేకపోవడం వల్ల ఆదాయ నష్టం.
- చికిత్స కోసం అత్యవసర వైద్య ఖర్చులు
- కొన్ని సందర్భాల్లో, ఏసీ, కూలర్లకు హీట్ వల్ల నష్టం జరుగుతుంది.
- దీర్ఘకాలిక వడగాలుల పరిస్థితులతో నష్టపరిహారం
- తీవ్రమైన వాతావరణంలో వ్యాపారపరంగా అంతరాయ నష్టాలు
హీట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి :
- టెంపరేచర్ ఆధారంగా హీట్ పాలసీ ఎప్పుడు వర్తిస్తుందో తెలిసి ఉండాలి
- క్లెయిమ్ ఎలా చేయాలి? ఎలా సెటిల్ అవుతుందో తెలుసుకోవాలి.
- ఏయే సందర్భాల్లో ఇన్సూరెన్స్ వర్తించదో (మినహాయింపులు), వెయిటింగ్ పీరియడ్
- ఆస్పత్రి ఖర్చులు కవరేజ్‌లో ఉన్నాయా లేదో చూడాలి
- పని చేయలేకపోతే మీ ఆదాయ నష్టంపై ఆర్థిక సాయం ఉందా?
- ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమాతో ఇది కవర్ అవుతుందా చూడాలి
- పాలసీ ఎంత కాలం వరకూ ఉంటుంది
- కోలుకోవడం లేదా రికవరీ సమయంలో కవరేజ్ వర్తిస్తుందా?
