ఎప్పుడెప్పుడా అని యూజర్లు ఎదురుచూస్తున్న WhatsApp Pay సర్వీసు త్వరలో లాంచ్ కానుంది. ఇండియాలో వాట్సాప్ పే సర్వీసును ప్రారంభించేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. డేటా సమ్మతి సమస్యలు, నిబంధనల కారణంగా కొంతకాలంగా వాట్సాప్ పే టెస్ట్ రన్ ఆలస్యమైందని కంపెనీ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియాలో వన్ మిలియన్ యూజర్లకు పేమెంట్స్ సర్వీసు అందించేందుకు టెస్టింగ్ రన్ విజయవంతంగా కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం.. వాట్సాప్ ప్లాట్ ఫాంపై పేమెంట్స్ సర్వీసు ఫీచర్ యూజర్లకు ఎనేబుల్ అయిన సంగతి తెలిసిందే. కానీ, అధికారిక ట్రాన్సాక్షన్స్ చేసుకునేందుకు వీలు లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.
‘ఇండియాలో వాట్సాప్ పే సర్వీసుపై టెస్టింగ్ జరుగుతోంది. ఈ ప్రొడక్టును వినియోగించుకునేందుకు ఎంతోమంది యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా వాట్సాప్ పే సర్వీసును త్వరలో లాంచ్ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది’ అని జూకర్ బర్గ్ తెలిపారు. దేశంలో డిజిటల్ సర్వీసును ప్రత్యేకించి చిన్న, మధ్యతరహా బిజినెస్ (SMBs)ల్లో ప్రోత్సహించేందుకు వీలుగా 400 మిలియన్ల మంది యూజర్లకు చేరేలా పీర్ టూ పీర్ యూపీఐ ఆధారిత వాట్సాప్ పే సర్వీసును అందుబాటులో తీసుకురానుంది.
వాట్సాప్ పే ఫీచర్లల్లో కొన్నింటికి సంబంధించి నిబంధనలను పాటించకపోవడంపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆర్బీఐ డేటా స్థానికత అవసరాలకు తగినట్టుగా వాట్సాప్ పేమెంట్స్ డేటాను స్టోర్ చేసేందుకు స్థానిక డేటా సెంటర్లను నిర్మించనున్నట్టు వాట్సాప్ స్పష్టం చేసింది.
కానీ, ఈ విషయంలో ఆర్బీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో.. వాట్సాప్ పే ఇంకా తన డేటా స్థానికీకరణ నిబంధనలను పాటించలేదని తెలిపింది. ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రెగ్యులేటరీ నిబంధనలను వాట్సాప్ పాటిస్తే.. దేశంలో వాట్సాప్ పే డిజిటల్ చెల్లింపు కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతిస్తామని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఇప్పటికే దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఆల్ఫాబెట్ గూగుల్ పే, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే, అమెజాన్ పే, అలీబాబా-మద్దతుగల పేటిఎమ్ వంటి దిగ్గజాలతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ ప్రత్యక్ష పోటీలో పేమెంట్ సర్వీసును ప్రారంభించడం వాట్సాప్‌కు చాలా అవసరం కాగా.. డిజిటల్ పేమెంట్స్ సర్వీసు 2023 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.