Gold Rate Falls : దీపావళి నాటికి పసిడి రూ.లక్షకు చేరడం ఖాయమా..? నిపుణులు చెప్పిన విషయాలివే..
Gold Rate Falls : నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. బంగారం ధర 10 గ్రాములకు రూ.1 లక్ష స్థాయికి చేరాలంటే అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్సు ధర సుమారు 2,800 డాలర్లకు పడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 4,132 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ పతనం సంభవించే అవకాశం చాలా తక్కువగా ఉందని పేర్కొంటున్నారు.
- Harish Thanniru
- Updated on- October 5, 2026 / 10:33 AM IST
Gold Rate Falls
Gold Rate Falls : బంగారం.. ఈ పేరు వింటేనే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే.. గోల్డ్ రేట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుండటమే కారణం. కొన్నేళ్ల క్రితం రూ.50వేలు పెడితే తులం బంగారం చేతిలో ఉండేది.. కానీ.. ఇప్పుడు రూ.1.50 వెచ్చించినా స్వచ్ఛమైన తులం బంగారం చేతికొచ్చే పరిస్థితి లేదు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు బంగారం కొనుగోళ్లకు క్రమంగా దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ నిపుణులు సంతోషకరమైన వార్తను తీసుకొచ్చారు. రానున్న కొద్దిరోజుల్లోనే తులం గోల్డ్ రేటు రూ.లక్ష దిగువకు పడిపోతుందని చెబుతున్నారు. అయితే, అదెలా సాధ్యమనే అంశం ప్రస్తుతం బంగారం ప్రియుల్లో ఆసక్తిని రేపుతోంది. తులం బంగారం రూ.లక్షకు చేరాలంటే అనేక అంశాలు అనుకూలించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2025 నుంచి 2026 ప్రారంభం వరకు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలను బంగారం ధరలు నమోదు చేశాయి. అయితే, ఇప్పుడు గోల్డ్ రేటు వేగంగా పడిపోతోంది. దీంతో ఈ సురక్షిత పెట్టుబడి సాధనం తన ఆకర్షణను కోల్పోతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు గరిష్ఠ స్థాయి అయిన 5,595 డాలర్లు నుంచి సుమారు 26శాతం పడిపోగా.. భారత రిటైల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు 23శాతం వరకు తగ్గుదల నమోదైంది.
గతంలో 10గ్రాముల బంగారం ధర రూ.2లక్షలు దాటే అవకాశం ఉందని తొలుత నిపుణులు అంచనా వేశారు. ఆ అంచనాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు పతనంతో ఇప్పుడు తులం బంగారం రూ.1.25 లక్షలు అంతకన్నా తక్కువగా అంటే రూ.1లక్ష స్థాయికి ధరలు చేరుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు భారీగా పెరిగి, 10 ఏళ్ల బాండ్ రాబడులు మరింత పెరిగితేనే దేశీయంగా బంగారం ధర రూ.1.25 లక్షల స్థాయికి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరల పతనానికి అనేక అంతర్జాతీయ పరిణామాలు కారణమవుతున్నాయి. రికార్డు ధరల వద్ద పెట్టుబడిదారులు భారీగా లాభాలను స్వీకరించడం మొదట ఈ దిద్దుబాటుకు కారణమైంది. దీనికితోడు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ అంచనాలు పెరగడం కూడా పసిడిపై ఒత్తిడిని పెంచాయి. అమెరికా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే వైఖరి అవలంబిస్తే.. యూఎస్ డాలర్ మరింత బలపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బాండ్ రాబడులు పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ ఆదాయం అందించే బాండ్ల వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశం ఉంది.
నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. బంగారం ధర 10 గ్రాములకు రూ.1 లక్ష స్థాయికి చేరాలంటే అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్సు ధర సుమారు 2,800 డాలర్లకు పడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 4,132 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ పతనం సంభవించే అవకాశం చాలా తక్కువగా ఉందని పేర్కొంటున్నారు.
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటం కూడా దేశీయ బంగారం ధరల భారీ పతనాన్ని అడ్డుకుంటోంది. రూపాయి విలువ 96.30 స్థాయిని దాటి బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా.. ఆ ప్రభావం పూర్తిగా భారత మార్కెట్‌కు బదిలీ కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దీనికితోడు 15 శాతం దిగుమతి సుంకం, ధంతేరస్, దీపావళి పండుగల సీజన్, రాబోయే వివాహాల సీజన్‌లో పెరిగే రిటైల్ డిమాండ్ కూడా ధరలకు కొంత మద్దతు ఇవ్వవచ్చని అంచనా. ఒకవేళ దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.1.25 లక్షల స్థాయికి చేరితే.. తక్కువ ధరలను అవకాశంగా భావించి కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అలా జరిగితే అంతర్జాతీయంగా బంగారం ధరలకు మళ్లీ మద్దతు లభించే అవకాశం ఉంటుంది.
