TGPSC Jobs Notification : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 886 పోస్టుల భర్తీకి చర్యలు..
TGPSC Jobs Notification : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ స్థాయిల్లోని 886 పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
TGPSC Jobs Notification
TGPSC Jobs Notification : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీచేసిన ప్రభుత్వం.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ స్థాయిల్లోని 886 పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాల్లో పరిపాలనను గాడిన పెట్టేందుకు ఈ భారీ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త పురపాలికలకు అవసరమైన ఉద్యోగాల మంజూరు ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా సూత్రప్రాయంగా అంగీకారం లభించడంతో, రానున్న కేబినెట్ భేటీలో వీటికి అధికారిక ముద్ర పడే అవకాశం ఉంది. ఆ తరువాత నోటిఫికేషన్ విడుదలకు అధికారులు చర్యలు ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పరిపాలన సౌలభ్యంకోసం కొత్తగా 24 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని పురపాలికలను నగర పాలక సంస్థలుగా (కార్పొరేషన్లు) అప్‌గ్రేడ్ చేసింది. ఈ క్రమంలో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పాలనపై ప్రభావం చూపుతోంది. దీంతో ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి నెట్టుకొస్తున్నారు. అయితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అధికారులు మొత్తం 886 పోస్టుల అవసరాన్ని గుర్తిస్తూ పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే టీజీపీఎస్సీ ద్వారా అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది.
ఈ ఏడాది డిసెంబర్ నెలలో లేదంటే వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదోలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల భర్తీకి కేబినెట్ నిర్ణయం వెలువడిన వెంటనే రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేసి టీజీపీఎస్సీకి వివరాలు పంపనున్నారు. అన్ని ప్రక్రియలు వేగంగా పూర్తయితే జనవరి నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
