RBI : చౌక రుణాలకు బ్రేక్..! నాలుగేళ్ల తర్వాత ఆర్బీఐ షాకిచ్చేందుకు సిద్ధమైందా..? ఈఎంఐలు భారీగా పెరగనున్నాయా..

RBI Repo Rate : దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్బీఐ వడ్డీరేట్ల పెంచేందుకు రెడీ అయిందని సమాచారం. ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

RBI Repo Rate

RBI Repo Rate : బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్న వారికి బిగ్ షాకిచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సిద్ధమైందా? అంటే అవుననే సామాధానం వినిపిస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్బీఐ వడ్డీరేట్ల పెంచేందుకు రెడీ అయిందని సమాచారం. సోమవారం ద్రవ్య విధాన కమిటీ సమావేశం ప్రారంభమైంది. 7వ తేదీ వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాయిటర్స్‌ సర్వేలో దాదాపు 60శాతం మంది ఆర్థికవేత్తలు ఈ పెంపును అంచనా వేశారు. అయితే, రెపో రేటును ఆర్బీఐ పెంచుతుందా.. తటస్థంగా ఉంచుతుందా అనేది బుధవారం వెల్లడికానుంది.

Also Read : School Students : స్కూల్‌లో షాకింగ్ ఘటన.. 82మంది విద్యార్థులకు అరగుండు..! వెల్లువెత్తిన విమర్శలు.. షాకాజ్ నోటీసులు జారీ..

రెపో రేటు పెరిగితే రుణగ్రహీతలపై ఆర్థికంగా అదనపు భారం పడనుంది. మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారనుంది. స్వల్పకాలిక నిధుల కోసం బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీయే రెపో రేటు. ఇది పెరిగితే బ్యాంకులకు నిధుల వ్యయం పెరుగుతుంది. ఆ భారాన్ని బ్యాంకులు కొంతవరకు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రూపంలో వినియోగదారులకు బదిలీ చేయవచ్చు.

ఉదాహరణగా చెప్పాలంటే.. రూ.50 లక్షల గృహ రుణానికి 20 ఏళ్ల కాలపరిమితి ఉండగా వడ్డీ 8.50 నుంచి 8.75 శాతానికి పెరిగితే, నెలవారీ ఈఎంఐ సుమారు రూ.43,391 నుంచి రూ.44,186కు పెరగొచ్చు. అంటే నెలకు దాదాపు రూ.795 అదనపు భారం అవుతుంది. ఈ పరిణామం మధ్య తరగతి వర్గాల ప్రజలకు కొత్త ఆర్థిక ఇబ్బందిని తెచ్చినట్లవుతుంది.

రెపో పెంపు వెనుక ద్రవ్యోల్బణం, ముడిచమురు ధరలు, రూపాయి పతనం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఆగస్టులో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరి, ఆర్బీఐ మధ్యకాలిక లక్ష్యమైన 4 శాతాన్ని వరుసగా అధిగమించింది. మరోవైపు బ్రెంట్‌ ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకుపైన ఉండటం భారత్‌ వంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి సవాలుగా మారింది. డాలర్‌తో రూపాయి విలువ కూడా 96.2925 వద్ద ఉండటంతో దిగుమతి వ్యయాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వడ్డీరేట్ల పెంపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు రూపాయి ఆస్తులపై రాబడిని ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

అయితే రెపో పెంపు ప్రభావం రుణగ్రహీతలకే పరిమితం కాదు. బ్యాంకులు నిధులను సమీకరించేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉండటంతో డిపాజిటర్లకు కొంత ప్రయోజనం కలగొచ్చు. మరోవైపు రుణాలు ఖరీదవడంతో వినియోగం, పెట్టుబడుల వేగం తగ్గే అవకాశముంది. అందుకే బుధవారం ఆర్బీఐ తీసుకునే నిర్ణయం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని వడ్డీ పెంపులు ఉంటాయా? లేక ఇది ఒక్కసారితో ఆగిపోతుందా? అనే ప్రశ్నలు ఉత్పత్తన్నమవుతున్నాయి.