School Students : స్కూల్లో షాకింగ్ ఘటన.. 82మంది విద్యార్థులకు అరగుండు..! వెల్లువెత్తిన విమర్శలు.. షాకాజ్ నోటీసులు జారీ..
82 Students Half Haircut Punishment : చంద్రపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆదేశాలతో సుమారు 82 మంది విద్యార్థులకు అరగుండు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
School Students
82 Students Half Haircut Punishment : పిల్లలు అంటే అల్లరి చేస్తారు.. ఆడుకుంటారు.. తెలియక చిన్నచిన్న తప్పులు చేస్తారు. అలాంటి పిల్లలకు ప్రేమగా చెప్పి, తప్పు ఏంటో అర్థమయ్యేలా చేస్తే మరోసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తపడతారు. కానీ, చిన్నతప్పుకే చిన్నారులను అవమానించేలా వ్యవహరించి వారి మనసును గాయపరిచేలా శిక్ష విధిస్తే ఎంత బాధగా ఉంటుంది.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జంభుల్ఘాట్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటన ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. హెయిర్‌కట్ సమయంలో కొందరు విద్యార్థులు ఆడుకునేందుకు వెళ్లారనే కారణంతో 82 మంది విద్యార్థులకు సగం జుట్టు కత్తిరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పాఠశాల ప్రిన్సిపల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Raghunandan Rao: హైకోర్టు సీజేకు ఎంపీ రఘునందన్ సంచలన లేఖ.. రేవంత్, కేటీఆర్ ఆస్తులపై విచారణకు డిమాండ్!
చంద్రపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆదేశాలతో సుమారు 82 మంది విద్యార్థులకు అరగుండు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థులకు జుట్టు కత్తిరించేందుకు ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు శనివారం బార్బర్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కొందరు స్టూడెంట్స్ లైన్లో లేకుండా ఆటలాడేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ తీవ్ర ఆగ్రహానికి గురై సదరు స్టూడెంట్స్ కు సగం జట్టు మాత్రమే కత్తిరించాలని బార్బర్‌ను ఆదేశించాడు. దీంతో 82మంది విద్యార్థులకు సగం జట్టును మాత్రమే కత్తిరించి అరగుండుతో వదిలేశారు.
విద్యార్థులు అరగుండుతో ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రిన్సిపల్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులకు పూర్తిస్థాయిలో హెయిర్ కట్ చేయించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. దీంతో రాత్రి 11గంటల సమయంలో మళ్లీ సదరు విద్యార్థులకు పూర్తిగా హెయిర్ కట్ చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకునే హెయిర్‌కట్స్ చేయించామని అధికారులు వివరణ ఇచ్చినప్పటికీ.. అప్పటికే అరగుండుతో ఉన్న విద్యార్థుల ఫొటోలు వైరల్ కావడంతో శిక్ష పేరుతో పిల్లలను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు సంబంధిత బాధ్యులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం షోకాజ్ నోటీసుతో వ్యవహారాన్ని ముగించకుండా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
