సెజ్‌లో ఆభరణాలపై తనిఖీలు లేకపోవడాన్ని అదునుగా భావించి వందల కోట్ల విలువైన బంగారం 1800 కిలోలను పక్కదారి పట్టించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) దృషిపెట్టడంతో రూ.756 కోట్ల విలువైన బంగారం సెజ్‌ల పేరిట తప్పించిన వైనం వెలుగులోకి తెచ్చింది. గతేడాది మే 3న నమోదైన ఈ కేసులో శ్రీకృష్ణ జ్యూయలర్స్ ఎండీ ప్రదీప్‌తోపాటు ఐదుగురిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ కృష్ణ జువెలర్స్ ఉద్యోగి సునీల్‌ను కీలక నిందితుడిగా భావిస్తూ.. తమిళనాడులో మంగళవారం అరెస్టు చేశారు. ముందుగా మదురై కోర్టులో ప్రవేశపెట్టి బుధవారం నాంపల్లిలోని ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేకకోర్టుకు తీసుకెళ్లనున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
కావాలనే దాచిపెట్టారు:
సునీల్‌ను దొరికిపోతే గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని శ్రీకృష్ణ జువెలర్స్ యజమాని ప్రదీప్.. సునీల్‌తోపాటు అతడి భార్య, కొడుకును అజ్ఞాతంలో ఉంచి అవసరాలు తీరుస్తూ వచ్చారు. నెలకు రూ.10వేల జీతం అందిస్తూ సునీల్ కుమార్తె చదువు ఖర్చులు కూడా ప్రదీప్ భరించినట్లు సమాచారం. 9 నెలలుగా సునీల్‌ను కనిపెట్టేందుకు డీఆర్‌ఐ అధికారులు తీవ్రంగా యత్నించారు. పుణె నుంచి తమిళనాడుకు మారినట్టు తెలుసుకొన్న అధికారులు.. సునీల్ చిరునామా కనిపెట్టి అరెస్టుచేశారు.
నమ్మకస్థుడు కాబట్టే:
ప్రదీప్ కుటుంబానికి 20ఏళ్ల క్రితం సునీల్ పాలుపోసేవాడు. అలా నమ్మకం సంపాదించుకున్న సునీల్‌ను సంస్థలో ఉద్యోగిగా తీసుకొన్నాడు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో జెమ్స్ సెజ్‌లో బంగారు దిగుమతి చేసుకొని ఆభరణాలుగా మార్చి విదేశాలకు ఎగుమతిచేసే యూనిట్‌ను ప్రదీప్ ఏర్పాటుచేశారు. ఈ సెజ్ లో ఆభరణాల పేరిట తెచ్చే బంగారాన్ని పక్కదారి పట్టించడం, బంగారు బిస్కెట్లపై నంబర్లు, ఇతర వివరాలను చెరిపి, వాటిని బంజారాహిల్స్‌లోని శ్రీకృష్ణ జువెలర్స్‌కు తరలించడంలో సునీల్ కీలకపాత్ర పోషించాడు.
అసలు కుంభకోణం ఏంటంటే:
రావిర్యాలలోని జెమ్స్ అండ్ జువెలరీ సెజ్‌లో పెద్దమొత్తంలో బంగారం పక్కదారిపట్టిందని సమాచారం అందింది. అప్రమత్తమైన డీఆర్‌ఐ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. దాంతో పాటు మే 3న సెజ్‌లోని శ్రీకృష్ణ జువెలరీకి చెందిన యూనిట్‌లో తనిఖీలు చేపట్టారు. ఆభరణాలు తయారుచేసి ఎక్స్‌పోర్ట్ చేయాల్సి ఉండగా.. కొద్ది మొత్తంలో బంగారానికి విలువైన రంగురాళ్లు కలిపి తయారుచేస్తున్నారని, అందులో మిగిల్చిన బంగారాన్ని స్థానిక మార్కెట్‌లోకి తరలిస్తున్నట్టు గుర్తించారు. మొత్తం 1800 కిలోల బంగారం పక్కదారి పట్టించినట్టు తేల్చారు.
ఇప్పటివరకు రూ.16.71 కోట్ల విలువైన 51.5 కిలోల బంగారాన్ని, రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, ఆభరణాల తయారీలోవాడే ఖరీదైన రాళ్లు, వజ్రాలతోపాటు రూ.2.24 కోట్ల నగదు స్వాధీనం చేసుకొన్నారు. మిగిలిన బంగారం కోసం డీఆర్‌ఐ తనిఖీలు ముమ్మరం చేశారు.
Read More>>దళిత యువకుల బట్టలూడదీసీ..జననాంగాలపై పెట్రోల్ పోసీ..