సీన్ రివర్స్: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిపై యాసిడ్ దాడి

లవర్ తిరస్కరించిందని, పెద్దలు పెళ్లికి నిరాకరించారని బాయ్ ఫ్రెండ్‌లు అమ్మాయిలపై దాడి చేయడం వింటూనే ఉన్నాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పందొమ్మిది సంవత్సరాల యువతి ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోలేదని నిరాహార దీక్షలు, నిరసనలు చేయలేదు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అని యాసిడ్ తో దాడి చేసింది. 

ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘడ్ ప్రాంతానికి చెందిన జీవన్‌ఘర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖవార్సీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేర యాసిడ్ దాడిలో కేసు ఫైల్ అయింది. పోలీసులకు బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 

కొన్ని నెలలుగా బాలిక తన కొడుకుతో రిలేషన్‌షిప్‌లో ఉంది. నెల రోజులుగా వారిద్దరి మధ్య మాటల్లేవు. దానికి కారణం అడిగితే రోజూ ఫోన్ చేసి పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తీసుకువచ్చిందని కొడుకు చెప్పాడట. గురువారం ఉదయం దీని గురించి కొడుకుతో మాట్లాడి ఎప్పటినుంచి మాట్లాడట్లేదనే వివరాలు అడిగింది. అదే రోజే ఇంటి దగ్గర్లోని షాప్ వద్ద నిల్చొన్న తన కొడుకుపై యాసిడ్‌తో దాడి జరిగింది. అంతేకాకుండా పెళ్లి చేసుకోకపోతే వారిద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానంటూ ఆ యువతి బెదిరించినట్లు ఆమె వివరించింది. 

బాధితుడికి చికిత్స అందిస్తున్న జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ డాక్టర్ ఎస్ఎస్ జైదీ మాట్లాడుతూ.. దాడివల్ల యువకుని కన్ను పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. చికిత్స ఇస్తున్నామని త్వరలోనే కోలుకుంటాడని వెల్లడించారు.