Man Return Back
Rising from the dead: రోడ్డు ప్రమాదంలో మరణించాడనుకుని ఒక వ్యక్తికి అంత్యక్రియలు జరిపించారు. అవి జరిగిన 3 నెలలకు సదరు వ్యక్తి ప్రత్యక్షం కావటంతో,నాలిక్కరుచుకున్న పోలీసులు ఆ మరణించిన వ్యక్తి అనే కోణంలో తిరిగి విచారణ చేస్తున్నారు.
కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని కుదస్సనాడులో సాబూ అనేవ్యక్తి నివసించేవాడు. సాబూ క్యాటరింగ్ పనుల్లో సహాయం చేయటం, బస్సుక్లీనింగ్, హోటళ్లలో బాయ్ వంటి పనులు చేసి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఇతనికి చిన్నచిన్నచోరీలు చేసే అలవాటు ఉంది.
గతేడాది నవంబర్ లో తాను పని చేసే హోటల్ లో దొంగతనం చేశాడనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని గురించిన సమాచారం అతని కుటుంబ సభ్యులకు తెలియలేదు.
డిసెంబర్ 24న కొట్టాయం జిల్లా పాలా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి మరణించాడు. అతనికి సాబూ కి పోలికలు ఉండటంతో సాబూ మరణించాడని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆ దేహం సాబూదేనని పొరపాటు పడిన కుటుంబ సభ్యులు అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 26, శుక్రవారంనాడు ఆ గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ సాబూను చూశాడు.
అతడ్ని గుర్తుపట్టి పోలీసులకు కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చాడు. సాబూ ని తీసుకుని గ్రామం వచ్చాడు. దీంతో పోలీసులు నాలిక్కరుచుకున్నారు. ఐతే గత డిసెంబర్ లో చనిపోయిన వ్యక్తి ఎవరు అని ఆరా తీయటం మొదలెట్టారు.