Hemant Modi: అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్‌లతో కలిసి పనిచేసిన నటుడు అరెస్ట్.. 12ఏళ్లుగా పరారీలో..
2005లో నరోడాలో ఒక హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. 2014లో గుజరాత్ హైకోర్టు పెరోల్ మంజూరు చేసింది.
- Naveen
- Updated on- May 22, 2026 / 11:08 PM IST
Hemant Modi: హత్య కేసులో అతడొక దోషి. మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. పెరోల్‌పై బయటకు వచ్చిన అతడు పరారీలో ఉన్నాడు. పోలీసులకు చిక్కకుండా 12ఏళ్లు తప్పించుకుని తిరిగాడు. ఏకంగా బాలీవుడ్ నటుడిగా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ అగ్ర నటులతో కలిసి నటించాడు. అందుకోసం తన గుర్తింపును మార్చుకున్నాడు. కట్ చేస్తే.. ఆ 53 ఏళ్ల వయసున్న నటుడు అరెస్ట్ అయ్యాడు. 12 ఏళ్లుగా పరారీలో ఉన్న అతడిని గురువారం అహ్మదాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
అహ్మదాబాద్‌లోని నరోడా వాస్తవ్యుడైన హేమంత్ మోడీ, ఇటీవల నగరంలోని ఘీ కాంటా మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక ఇంట్లో ఉండగా గుర్తించి, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు.
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష..
”మోడీ 2005లో నరోడాలో ఒక హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. 2014లో గుజరాత్ హైకోర్టు పెరోల్ మంజూరు చేయడానికి ముందు అతను మెహసానా జైల్లో ఉన్నాడు. 30 రోజుల పెరోల్ గడువుపై బయటకు వచ్చిన అతడు.. పెరోల్ గడువు ముగిసినా పోలీసుల ఎదుట లొంగిపోలేదు. జూలై 25, 2014న మోడీని అధికారికంగా ‘పెరోల్ జంపర్’గా ప్రకటించారు” అని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియన్ తెలిపారు.
ఇన్నేళ్లుగా పరారీలో ఉన్న మోడీ.. నిమాలు, టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో పని చేశాడు. “పదేళ్ల పరారీ కాలంలో, మోడీ వినోద పరిశ్రమలో అత్యంత చురుకైన ప్రముఖమైన కెరీర్‌ను కొనసాగించాడు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్‌లతో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, రణవీర్ సింగ్‌తో కలిసి ‘జయేష్‌భాయ్ జోర్దార్’ వంటి ప్రధాన బాలీవుడ్ చిత్రాలలో నటించాడు.
”హేమంత్ మోడీ చాలా తెలివిగా వ్యవహరించాడు. తన పేరు, నివాస ప్రాంతాన్ని మార్చుకుని అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు. 2014లో పెరోల్‌పై విడుదలైన తర్వాత గుజరాత్‌లోని పటాన్‌లో నివసించాడు. మరుసటి సంవత్సరం అహ్మదాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ అతను ‘ట్వింకిల్ డేవ్’ అనే కొత్త పేరు పెట్టుకున్నాడు. 2017 వరకు ఆ నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో నివసించాడు.
సినిమా రంగంలో కెరీర్ ప్రారంభం..
2017లో ట్వింకిల్ అని కూడా పిలువబడే హేమంత్ ముంబైకి వెళ్లి సినిమా రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఎనిమిదేళ్లలో అతను 2018లో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, 2022లో రణవీర్ సింగ్ నటించిన ‘జయేష్‌భాయ్ జోర్దార్’ వంటి అనేక బాలీవుడ్ చిత్రాలలో సహాయ నటుడిగా పనిచేశాడు. గుజరాతీ చిత్రాలతో పాటు రెండు భాషలలోని వెబ్ సిరీస్‌లు, నాటకాలలో కూడా పాత్రలు పోషించాడు” అని పోలీసులు తెలిపారు.
‘యుగపురుష్’, ‘గాంధీ విరుధ్ గాడ్సే’ వంటి నాటకాలలో నటిస్తూ రంగస్థలంలో కూడా యాక్టివ్ గా ఉన్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్‌లో బహిరంగంగా కనిపించినప్పటికీ.. క్రైమ్ బ్రాంచ్ ఇటీవల గుర్తించే వరకు అతను అధికారుల కన్నుగప్పి విజయవంతంగా తప్పించుకున్నాడు. ఆ కాలంలో అతని వృత్తిపరమైన పోర్ట్‌ఫోలియోలో లాహోర్ 1947, మెట్రో, ఇన్ డైనో వంటి రాబోయే చిత్రాలు, దక్షిణ భారత చిత్రం ఎల్2: ఎంపురాన్, వాగ్లే కి దునియా , మేరే సాయి వంటి టెలివిజన్ సీరియల్స్ కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. హేమంత మోడీ తన మిగిలిన జీవిత ఖైదును అనుభవించేలా క్రైమ్ బ్రాంచ్ అతడిని మెహసానా జిల్లా జైలు అధికారులకు అప్పగించుంది.
పోలీసు నిషేధాజ్ఞల ఉల్లంఘనకు సంబంధించిన బొంబాయి పోలీస్ చట్టంలోని సెక్షన్ 135(1)తో పాటు, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 302 (హత్య), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), 147 148 (అల్లర్లు ప్రాణాంతక ఆయుధాలతో అల్లర్లు), 149 (చట్టవిరుద్ధమైన సమావేశం) 120(బి) (నేరపూరిత కుట్ర) కింద మోడీపై 2005లో కేసు నమోదైంది.
Also Read: రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్.. అసలు విషయం ఇది.. వార్నీ ఇంత రచ్చ చేయాలా!
