కల్నల్ ఇంటికి కన్నం వేసిన దొంగ : విషయం తెలిసి దేశభక్తుడైపోయాడు

  • Publish Date - February 20, 2020 / 03:37 PM IST

దొంగలకు నైతికత ఉండదని ఎవరు చెప్పారో తెలీదు కానీ… ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఎందుకంటే  రిటైర్డ్ కల్నల్ ఇంటికి కన్నంవేసిన  దొంగ సమాజం యొక్క మొత్తం అభిప్రాయాన్ని మార్చాడు. కేరళ రాష్ట్రంలో రిటైర్డ్ కల్నల్ ఇంట్లో  చోరీకి యత్నించాడు ఒక దొంగ. అయితే, అది దేశం కోసం పనిచేసిన సైనికుడి ఇల్లు అని తెలుసుకున్నప్పుడు క్షమాపణ కోరాడు

కల్నల్ ఇంట్లోకి  వచ్చిన దొంగ మొదటగా అక్కడ దొరికిన 15వందల రూపాయల నగదును జేబులో పెట్టుకున్నాడు. రిటైర్డ్ కల్నల్ ఇల్లు అవటంతో  అక్కడ దొరికిన  మిలటరీ మద్యాన్ని సేవించాడు. 15 వందల రూపాయలతో సరిపెట్టుకోలేని దొంగ ఇంట్లోని గదులన్నీ కలియ తిరిగాడు. ఒకగదిలో  ఇంట్లో ఉన్న  ఇండియన్ ఆర్మీ  టోపిని చూశాఢు. అంతే అంతకు ముందు కొట్టిన మందు కిక్కు దిగిపోయింది. వెంటనే తాను చేసిన పనులకు పశ్చాత్తాపం చెందాడు. అతడిలో ఒక్కసారిగా దేశభక్తి పెరిగిపోయింది. తాను చేసిన పనికి క్షమాపణ కోరాలనుకున్నాడు. అందుకోసం  పవిత్ర బైబిల్ లోని వాక్యాలను ఉటంకిస్తూ గోడపై క్షమాపణ పత్రం రాశాడు

“మీ ఇంట్లో  టోపీ చూసిన తర్వాతే ఇది ఒక ఆర్మీ ఆఫీసర్ యొక్క ఇల్లు అని నేను గ్రహించాను. ఈవిషయం ఇంతకు ముందే తెలిసి ఉంటే, నేను ఎప్పుడూ మీ ఇంట్లోకి ప్రవేశించేవాడినికాను. ఆఫీసర్, దయచేసి నన్ను క్షమించు. నేను బైబిల్లోని ఏడవ ఆజ్ఞను ఉల్లంఘించాను. అని రాశాడు.

ఇక్కడితో క్షమాపణ కోరి వదిలేస్తే పర్వాలేదు… కల్నల్ ఇంటిపక్కన ఉన్న టైర్ షాప్ నుంచి దొంగిలించిన ఒక బ్యాగ్ ను అందులోని కాగితాలను అక్కడ వదిలేసి “దయచేసి ఈ బ్యాగు,కాగితాలు దుకాణ యజమానికి తిరిగి ఇవ్వండి.”అని కోరాడు. అంతకు ముందు తాను దొంగిలించిన 15వందల  రూపాయలను అక్కడ వదిలేశాడు.   కల్నల్ గత రెండు నెలలుగా తన కుటుంబంతో బహ్రెయిన్ లో  ఉంటున్నారు.  దొంగతనం జరిగిన మరునాడు ఉదయం ఇంటికి పనివాడు వచ్చి చూసినప్పుడు ఈ సంగతి వెలుగులోకి వచ్చింది.