దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. పట్ పర్ గంజ్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. వారం రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం జరిగింది. పట్ పర్ గంజ్ పారిశ్రామికవాడలో గురువారం (జనవరి 9, 2020) అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 32 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
జనవరి 2వ ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని బ్యాటరీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.